మోదీ మేకిన్ ఇండియా.. బాబు మేకిన్ సింగపూర్
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ ఎద్దేవా
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల హామీలను విస్మరించాయి
ఎన్నికల హామీల అమలు కోసం ప్రజల పక్షాన ఉద్యమిస్తాం
టీడీపీ, బీజేపీ నేతల లాగులు తడిసేలా పోరాడదాం: రఘువీరా
విజయవాడ సెంట్రల్: ప్రధాని నరేంద్ర మోదీ మేకిన్ ఇండియా అంటుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు మేకిన్ సింగపూర్ అంటున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ ఎద్దేవా చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాలు ఎన్నికల హామీలను పూర్తిగా విస్మరించాయని దిగ్విజయ్‌సింగ్ ధ్వజమెత్తారు. మోదీ, చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీల అమలు కోసం ప్రజల పక్షాన ఉద్యమిస్తామన్నారు. విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో పీసీసీ సమన్వయ కమిటీ తొలి సమావేశం, కాంగ్రెస్ విస్తృత కార్యవర్గ సమావేశం, విలేకరుల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఎన్‌డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ప్రత్యేకహోదాపై నోరు మెదపకపోవడం సిగ్గుచేటని దిగ్విజయ్ ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పెట్టుబడులు వరదలా వస్తాయని, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. ఇరిగేషన్, ఎడ్యుకేషన్ రంగాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్ర మంత్రివర్గంలో గిరిజన, ముస్లిం మంత్రులు లేకపోవడం చరిత్రలో ఇదే తొలిసారని విమర్శించారు. రాష్ట్రంలో పెద్దఎత్తున జరుగుతున్న ప్రభుత్వ అవినీతిని సకాలంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
పార్టీకి పునర్‌వైభవం కోసం ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. కాంగ్రెస్ పాలన, ఇతర పార్టీల పాలన మధ్య ఉన్న వ్యత్యాసాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. ప్రభుత్వం అనుసరిస్తోన్న బాకై్సట్ దోపిడీ విధానంపై గిరిజనులను ఎప్పటికప్పుడు చైతన్య పరిచేందుకు సిద్ధం కావాలన్నారు. భావప్రకటనను, స్వేచ్ఛను హరించేలా దేశంలో దాడులు జరగడం బాధాకరమని చెప్పారు. అఫ్జల్ గురుకు అనకూలంగా జేఎన్‌యూలో సమావేశం ఏర్పాటుచేసిన ఉమర్ ఖలీద్‌పై చర్యలు తీసుకోకుండా, విద్యార్థి నాయకుడు కన్హయా కుమార్‌పై కేసులు పెట్టడం శోచనీయమన్నారు. టీడీపీ దోపిడీ పాలనపై పోరాడదాం: రఘువీరా రాష్ట్రంలో టీడీపీ దోపిడీపాలనపై పోరాటాన్ని ఉధృతం చేయాలని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. ఇసుక, మైను, వైనుతో టీడీపీ నేతలు రాష్ట్రాన్ని దోచేస్తున్నారని దుయ్యబట్టారు. జన్మభూమి కమిటీలను అడ్డుపెట్టుకొని ప్రజాప్రతినిధుల హక్కుల్ని హరించివేస్తున్నారన్నారు. టీడీపీ, బీజేపీలు ఎన్నికల్లో అబద్ధపు హామీలు ఇచ్చి జూన్ 8కి రెండేళ్లు పూర్తవుతోందన్నారు. ఆ పార్టీ నాయకుల లాగులు తడిసేలా మే నెల్లో పెద్దఎత్తున పోరాటానికి రూపకల్పన చేస్తున్నట్లు పేర్కొన్నారు. బాకై్సట్ అక్రమ త్రవ్వకాలపై గిరిజనుల్ని చైతన్యపర్చేందుకు త్వరలోనే ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తారని తెలిపారు. త్వరలో జరగనున్న మునిసిపల్, నగరపాలక సంస్థ ఎన్నిక లకు సమాయత్తం కావాలన్నారు. సమావేశాల్లో పార్టీ ఎస్సీ సెల్ జాతీయ కార్యదర్శి కొప్పుల రాజు, పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తిరువనక్కరసు, శాసన మండలి విపక్షనేత సి.రామచంద్రయ్య, రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు, జేడీ శీలం, మాజీ మంత్రులు సాకే శైలజానాథ్, కనుమూరి బాపిరాజు, పనబాక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రరత్న భవన్‌లో కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం 60 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం విజయవాడ కేంద్రంగా మళ్లీ కాంగ్రెస్ కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండగా నగరం నుంచే కాంగ్రెస్ కార్యకలాపాలు సాగేవి. ఆ తరువాత తెలంగాణతో కలిసి రాష్ట్రం ఏర్పడ్డాక హైదరాబాద్‌కు మకాం మార్చారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రరత్న భవన్ రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంగా మారింది. ఈ భవనంలో ఏర్పాటు చేసిన పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. అనంతరం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పార్టీ పతాకాన్ని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్యనేతలు, కేంద్ర మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.