Mekin India
-
రెక్కలు కడుతున్న పిల్ల
రెక్కలుంటేనే పక్షి ఎగురుతుంది. ఆదాయం ఉంటేనే మనిషి గుండె కొట్టుకుంటుంది. సగటు స్త్రీకి పని చేద్దామన్నా ఆదాయ మార్గాలు కనిపించవు. అలాంటి వారిని గౌరి చేరదీసి, శిక్షణ ఇచ్చి, వాళ్ల చేతుల్లో నాలుగు కాసులు గలగలలాడేలా చేస్తున్నారు. కర్ణాటకలోని చిక్కోడి జిల్లా బెళగవిలో గౌరీ దేశ్‌పాండే మంజ్రేకర్ అనే అమ్మాయి గురించి అక్కడి వారికి బాగా తెలుసు. అందుకే ఆమె ‘2019 ఇండియన్ ఉమెన్ ఎక్స్‌లెన్స్ అండ్ లీడర్షిప్’ అవార్డు గెలుచుకోవడం అక్కడ పెద్ద విశేషమేమీ అవలేదు! ‘పంఖ్’ అని ఆమెకో సొంత సేవా సంస్థ ఉంది. ఆ సంస్ధ ద్వారా అవిశ్రాంతంగా అమె అందిస్తున్న సేవలకు గుర్తింపే ఆ ఎక్స్‌లెన్స్ అవార్డు. 2012లో పంఖ్ను స్థాపించారు గౌరి. సమాజం నుంచి తీసుకున్నప్పుడు సమాజానికి తిరిగి ఇచ్చేయడం అన్నది ఆ సంస్థ ఆవిర్భావానికి ముందు నుంచే ఆమెకు అలవాటు! మంచి ఉద్యోగం. మంచి జీతం. మంచి తలంపు. నెలనెలా వృద్ధాశ్రమాలకు వెళ్లి తన జీతంలోని కొంతభాగాన్ని ఇస్తుండేవారు గౌరి. అప్పుడే.. ఆమె ఒక బ్యాంకును కూడా నెలకొల్పారు. ‘జాయ్ బ్యాంక్ గ్రూపు’ దాని పేరు. ఎవరైనా, డబ్బులున్నవాళ్లు నేరుగా ఆ బ్యాంకుకు వచ్చి విరాళాలను జమ చేయవచ్చు. అలా సమకూరిన డబ్బు గౌరీ చేతుల మీదుగా అత్యవసరంలో ఉన్నవాళ్లకు అందుతుంది. ఆ మొత్తం వేలు, లక్షలే అవనక్కర్లేదు. వంద రూపాయల కోసం వచ్చే వాళ్లకు కూడా సహాయం లభిస్తుంది. ఇంతకన్నా పెద్ద పని ఏదైనా చేయాలని గౌరి ఓ రోజు అనుకున్నారు. ఆ ఆలోచనలోంచి వచ్చిందే ‘పంఖ్’. బాగా చదువుకున్న అమ్మాయి. మంచి ఉద్యోగం చేస్తున్న అమ్మాయి. సమాజానికి ఇంకా ఏమైనా చేయాలన్న ఉత్సాహం ఉన్న అమ్మాయి. ఇన్ని ఉన్నాయి కాబట్టి ధైర్యంగా ఉద్యోగం మానేయగలిగారు గౌరి. సమాజంలో ఏదైనా మార్పును కోరుకున్నప్పుడు ఆ మార్పు మొదట తన నుంచి మొదలవ్వాలని ఆమె బలంగా అనుకున్నారు. గాంధీజీ ప్రభావం అది. అనుకున్నదే తడవుగా చిక్కోడిలో ‘పంఖ్ హ్యాండీక్రాఫ్ట్స్’ను ప్రారంభించారు. విద్య, ఉపాధి కల్పన, బలహీన వర్గాలకు సాధికారత.. అనే ఈ మూడు లక్ష్యాలతో పంఖ్ నడవడం మొదలైంది. మహిళలకు చేతివృత్తులను కూడా ఇందులో నేర్పిస్తున్నారు. రెక్కలుంటేనే పక్షి ఎగురుతుంది. ఆదాయం ఉంటేనే మనిషి గుండె కొట్టుకుంటుంది. సగటు స్త్రీకి పని చేద్దామన్నా ఆదాయ మార్గాలు కనిపించవు. అలాంటి వారిని గౌరి చేరదీసి, శిక్షణ ఇచ్చి, వాళ్ల చేతుల్లో నాలుగు రూపాయలు కదలాడేలా ఆర్థిక స్వావలంబనను, స్వయం సమృద్ధిని అందించారు. చిక్కోడిలో అక్షత తకన్నవర్ అనే బాలిక బోర్డు పరీక్షల్లో పదో ర్యాంకు సాధించింది. మంచి ర్యాంకు తెచ్చుకున్నా కూడా, పేదరికం కారణంగా ఆమె పై చదువులకు వెళ్లలేకపోతున్న విషయాన్ని తెలుసుకున్న గౌరి అమెకు చేయూతనిచ్చి ఉన్నత చదువుల అవకాశం కల్పించారు. ప్రస్తుతం అక్షత రాయ్‌బాగ్ తాలూకాలోని ప్రభుత్వ కార్యాలయంలో అకౌంటెంట్‌గా పని చేస్తోంది. ఇక ఫర్జానా గృహిణి. కుటుంబం నుంచి ఆమెకు ఆర్థిక తోడ్పాటు లేదు. అన్నీ తనే పడాలి. ముగ్గురు పిల్లలు. ఇప్పుడామె ‘పంఖ్’ లో పనిచేస్తోంది. కుటుంబాన్ని పోషించుకుంటూ, పిల్లల్ని చక్కగా చదివించుకుంటోంది. పంఖ్ రెండు స్థాయుల్లో పని చేస్తుంటుంది. మహిళలకు ఉపాధి కల్పించడం, వారి ఉత్పత్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని సమాజంలో ఆర్థికంగా అట్టడుగున ఉన్న కుటుంబాలలోని పిల్లలకు వినియోగించడం. ‘పంఖ్’ విరాళంగా ఇచ్చే ‘కిడ్డీ ప్యాక్స్’లో బ్లాంకెట్స్, జాకెట్స్, స్కూలు బ్యాగులు, చాప, నేప్కిన్, చదువుకోడానికి అవసరమైన స్టేషనరీ ఉంటాయి. ‘మిషన్ మిలియన్ స్మైల్స్’ అనే ప్రాజెక్టు కూడా ఒకటి గౌరి ఆధ్వర్యంలోనే నడుస్తోంది. ఏ ఆసరా లేని పిల్లలకు అన్ని విధాలా చేయందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. పంఖ్లో పని చేస్తున్న మహిళలు ప్రధానంగా కొవ్వొత్తులు, పెన్ స్టాండ్స్, లాంతర్లు తయారు చేస్తుంటారు. ఈ కాలంలో ఇంకా వీటి అవసరం ఏమిటని అనిపించవచ్చు. కానీ చిక్కోడి చుట్టుపక్కల మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ ఇవి అత్యవసరమైన సామగ్రి. వీటన్నిటికీ గౌరీ పెద్దగా ప్రచారం కల్పించుకోలేదు. మంచి పనికి దానంతటదే ప్రచారం లభిస్తుంది. ‘పంఖ్’ గురించి తెలుసుకున్న పారిస్‌లోని భారత రాయబార కార్యాలయం ‘మేకిన్ ఇండియా’ ప్రాజెక్టులో భాగంగా పంఖ్ నుంచి భారీ మొత్తంలో క్యారీబ్యాగులు కొనుగోలు చేసింది. ఆ డబ్బును మళ్లీ మహిళా, శిశు సంక్షేమానికే ఉపయోగిస్తున్నారు గౌరీ. ఇవన్నీ చూస్తుంటే.. ఆమెకు ఇప్పుడు వచ్చిన అవార్డు గురించి గ్రామస్థులకు తెలిసినా, దానికంత ప్రాముఖ్యం ఇవ్వక పోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే వాళ్ల హృదయాలలో గౌరికి అంతకు మించిన స్థానమే ఉంది. -
కఠిన నిర్ణయాలుంటాయ్!
న్యూఢిల్లీ: జాతీయ ప్రయోజనాల రీత్యా కఠిన నిర్ణయాలు కొనసాగుతాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 2022 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం రెట్టింపై 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో తయారీ, వ్యవసాయ రంగాల వాటా చెరో ట్రిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. మోదీ గురువారం ఢిల్లీలో ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్(ఐఐసీసీ)కు శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతూ.. ఈ సెంటర్ భవిష్యత్‌లో పరిశ్రమలు, స్టార్టప్‌లకు కేంద్రంగా నిలుస్తుందని, 5 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించేందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐటీ, రిటైల్ రంగాల్లో ఉద్యోగ కల్పన శరవేగంగా పెరుగుతున్న దృష్ట్యా వృద్ధిరేటు 8 శాతం దాటుతుందని పేర్కొన్నారు. దేశ సూక్ష్మ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయని చెప్పారు. మేకిన్ ఇండియా, జీఎస్టీ తదితర సంస్కరణలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. అన్ని ప్రభుత్వ బ్యాంకులు అవసరమా?.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నా భారత ఆర్థిక వ్యవస్థ బలం పుంజుకుంటోందని మోదీ అన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నామని, భవిష్యత్తులోనూ అలాంటి చర్యలు కొనసాగుతాయన్నారు. మన ఆర్థిక వ్యవస్థ దశాబ్ద కాలంలో 10 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేనా బ్యాంకు, విజయా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడాల విలీనాన్ని ప్రస్తావిస్తూ..డజన్ల కొద్దీ ప్రభుత్వ బ్యాంకుల అవసరం ఏముందని ప్రశ్నించారు. బ్యాంకుల విలీనంపై చాలా ఏళ్లుగా చర్చ నడుస్తున్నా తమ ప్రభుత్వ హయాంలోనే ఈ దిశగా ముందడుగు పడిందని తెలిపారు. మేకిన్ ఇండియా పథకంతో భారత్ మొబైల్ పరిశ్రమకు కేంద్రంగా మారిందని, 4–5 లక్షల మంది యువతకు ఉపాధి దొరకడంతో పాటు రూ.3 లక్షల కోట్ల విలువైన విదేశీ మారక నిల్వలు ఆదా అయ్యాయని తెలిపారు. సులభతర వాణిజ్య విధానాలను ప్రోత్సహించడానికి జిల్లాస్థాయి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. 221.37 ఎకరాల విస్తీర్ణంలో ఐఐసీసీని రూ.25,703 కోట్లతో నిర్మించనున్నారు. 11 వేల మంది కూర్చునే సామర్థ్యం గల కన్వెన్షన్, ఎగ్జిబిషన్, స్టార్ హోటళ్లు తదితర వాణిజ్య కేంద్రాలకు ఇందులో చోటు కల్పించనున్నారు. మోదీని కలసిన ఆశా కార్యకర్తలు.. దేశం నలుమూలల నుంచి వచ్చిన 90 మంది ఆశా కార్యకర్తలతో మోదీ ముచ్చటించారు. తమ గౌరవ వేతనాలు పెంచడంతో పాటు ఉచిత బీమా సదుపాయం కల్పించినందుకు వారు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల ఆశా, అంగన్వాడీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తాను జరిపిన సంభాషణను మోదీ గుర్తు చేసుకున్నారు. ఆశా కార్యకర్తల సేవలు, అంకితభావాన్ని కొనియాడిన మోదీ..కాలా అజార్ వ్యాధి నిర్మూలనకు వారు చేసిన కృషిని బిల్ గేట్స్ ఫౌండేషన్ ప్రశంసించిందని అన్నారు. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఇతర ప్రభుత్వ సంస్థలతో కలసి పనిచేయాలని సూచించారు. పేదరిక నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎలా ఉపయోగపడుతున్నాయో వివరించారు. మెట్రోలో మోదీ.. కన్వెన్షన్ సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు మోదీ ఢిల్లీలోని ధౌలాకువాన్ నుంచి ద్వారకా వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ ప్రయాణం సుమారు 18 నిమిషాలు సాగిందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ప్రయాణికులు మోదీతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపారు. కార్యక్రమం ముగిసిన తరువాత మోదీ మళ్లీ మెట్రో రైలులోనే తిరుగు ప్రయాణమయ్యారు. ప్రముఖుల రాకపోకలతో రోడ్లపై ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా మోదీ తరచూ మెట్రోరైలు సేవలను వినియోగించుకుంటున్నారు. -
2019లో భారీ మెజార్టీతో..!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మరోసారి ఘనవిజయం సాధిస్తుందని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ వ్యతిరేకులంతా ఏకమై ప్రారంభించనున్న మహాకూటమి ఓ మిథ్య అని ఆయన అభివర్ణించారు. ఢిల్లీలో రెండ్రోజులపాటు జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రారంభోత్సవంలో షా మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మేకిన్ ఇండియా నినాదంతో ముందుకెళ్తుంటే బ్రేకింగ్ ఇండియా లక్ష్యంతో కాంగ్రెస్ పనిచేస్తోందన్నారు. 2014లో పార్టీ, కూటమి సాధించిన సీట్లకంటే ఈ సారి మరిన్ని ఎక్కువ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమగ్ర అభివృద్ధి, పేదల సంక్షేమం, జాతీయవాదం అంశాలపై బీజేపీ ఎన్నికల ప్రచారం ఉండాలని కార్యవర్గ సభ్యులకు మోదీ సూచించారు. ‘వరుస ఎన్నికల్లో ఓటమితో ఆత్మరక్షణలో ఉన్న విపక్షాలు అర్బన్ నక్సల్స్‌కు మద్దతివ్వడంతోపాటు భారత్‌ను ముక్కలు ముక్కలు (బ్రేకింగ్ ఇండియా) చేద్దామని ప్రయత్నిస్తున్నారు’ అని షా అన్నారు. ఈ సమావేశానికి ప్రధాని మోదీతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, అన్ని రాష్ట్రాల పార్టీ ముఖ్య పదాధికారులు (మొత్తం 175 మంది) హాజరయ్యారు. ఆదివారం జరిగే ముగింపు సమావేశంలో మోదీ ప్రసంగిచనున్నారు. రాజకీయ, ఆర్థిక తీర్మానాలను ప్రతిపాదించి ఆమోద ముద్ర వేయనున్నారు. బెంగాల్, ఒడిశా, తెలంగాణలపై.. పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణల్లో అక్కడి ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలపై ఉన్న ప్రజావ్యతిరేకత కారణంగా ఎక్కువసీట్లు గెలుస్తామని షా చెప్పారు. 2014లో మొత్తం 543 సీట్లలో బీజేపీ 283 సీట్లు గెలిచింది. ‘బీజేపీ 2014లో ఇప్పుడు ఏకమవుతున్న అన్ని పార్టీలను చిత్తుగా ఓడించింది. ఇప్పుడు వాళ్లందరూ ఏకమైనా ఫలితాల్లో పెద్ద తేడా ఉండదు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, మోదీ చరిష్మా, పార్టీ సంస్థాగత బలం కారణంగా మళ్లీ అధికారంలోకి వస్తాం’ అని షా అన్నారు. ‘కాంగ్రెస్ చెప్పిందే మన్మోహన్ సింగ్ పాటిస్తారు. ఇక్కడ మోదీ ముందుండి నడిపిస్తారు’ అని అన్నారు. పాక్‌పై భారత ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన సెప్టెంబర్ 28ని శౌర్యదివస్‌గా జరపాలని, గాంధీజీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. వాజ్‌పేయిని గుర్తుచేసుకుంటూ.. మాజీ ప్రధాని దివంగత నేత అటల్ బిహారీ వాజ్‌పేయిని పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం స్మరించుకుంది. ఆరోగ్యం సహకరించినదాకా ప్రతీ జాతీయ కార్యవర్గ సమావేశానికి అటల్జీ హాజరైన విషయాన్ని స్మరించుకుంది. ‘దేశ ప్రజల ఆకాంక్షలన నెరవేర్చడంలో విశ్వసనీయమైన నేతగా అటల్జీ తనకంటూ ప్రత్యేకతను ఏర్పర్చుకున్నారు. ఆయన చిత్తశుద్ధి, కఠోర శ్రమకారణంగానే ఇది సాధ్యమైంది. సిద్ధాంతాలకు కట్టుబడి ధ్రుఢనిశ్చయంతో ముందుకెళ్లడం ద్వారానే అనుకున్న లక్ష్యాలను ఆయన సాధించగలిగారు’ అని వాజ్‌పేయి సంతాప తీర్మానంలో పేర్కొంది. రైతుల ఆదాయం రెట్టింపుచేసేందుకు మోదీ చేస్తున్న ప్రయత్నాలకు కృతజ్ఞతలు తెలుపుతూ వ్యవసాయ తీర్మానాన్ని ఆమోదించింది. ఎంపీ, ఛత్తీస్‌గఢ్‌లలో ఓకే ఈ సమావేశాల్లో త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలతోపాటు పార్లమెంటు ఎలక్షన్లపై చర్చ జరిగింది. ఇప్పటివరకు జరిగిన వివిధ సర్వేలు, పార్టీ అంతర్గత వివరాల ప్రకారం ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అవకాశాలున్నట్లు తెలిసింది. రాజస్తాన్‌లో ప్రజావ్యతిరేకత ఉందని పార్టీ ఈ సమస్యను దాటుకుని ముందుకెళ్లటం చాలా కష్టమని పార్టీ నివేదికలు చెబుతున్నాయి. రాజస్తాన్ సీఎం, పార్టీ రాష్ట్రాధ్యక్షుడు, కీలక మంత్రులు, ఇతర పార్టీ ముఖ్యులతో షా ఆదివారం షా భేటీ కానున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మోదీ, అమిత్ నేతృత్వంలోనూ ముందుకెళ్లాలని కూడా సమావేశంలో నిర్ణయించారు. దీనికితోడు 2019 జనవరిలో పూర్తికానున్న అమిత్ షా అధ్యక్ష పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించారు. అసెంబ్లీ, ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పార్టీ సంస్థాగత ఎన్నికలను వాయిదా వేయాలని తీర్మానించారు. తెలంగాణపై ప్రత్యేక దృష్టి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అమిత్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేద్దామనుకునేవారు కచ్చితంగా ఈసారి ఎమ్మెల్యేలుగా పోటీచేసి తమ సత్తా చాటాలని ఆయన తెలంగాణ ముఖ్యనేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ అభ్యర్థుల జాబితాను విడతలవారీగా విడుదల చేయాలని పార్టీ నిర్ణయించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే రోజే 35 మందితో తొలి జాబితాను ప్రకటించనున్నారు. ఆ తర్వాత 2 దశల్లో మిగిలిన 84 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తారు. వ్యూహాలపై జాతీయ కార్యవర్గ భేటీ అనంతరం తెలంగాణ నేతలతో వేరుగా ఆయన భేటీ కానున్నారు. -
మినీ అణు రియాక్టర్లు అమ్ముతాం!
వాషింగ్టన్: మేకిన్ ఇండియాలో భాగంగా భారత్‌లో మినీ ఫాస్ట్‌ట్రాక్ అణు రియాక్టర్లను నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికాకు చెందిన భారత సంతతి ఔత్సాహిక వ్యాపారవేత్త క్రిస్ సింగ్ తెలిపారు. 160 మెగావాట్ల సామర్థ్యంతో, లైట్ వాటర్ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ఈ మినీ రియాక్టర్లు భవిష్యత్‌లో అణు విద్యుత్ ఉత్పత్తిలో కీలకంగా మారుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఎస్ఎంఆర్ ఎల్ఎల్సీ, హోల్టెక్ ఇంటర్నేషనల్ సంస్థల్ని స్థాపించడంతో పాటు సీఈవోగా వ్యవహరిస్తున్న క్రిస్ ఈ మేరకు పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘మేం రూపొందించే మినీ రియాక్టర్లకు కొన్ని ఎకరాల స్థలం సరిపోతుంది. సముద్రం, నదీతీరాల్లో, ఎడారుల్లో అమర్చుకోవచ్చు. వీటి ఖర్చు చాలా తక్కువ. ఒక్కో మినీ రియాక్టర్ నిర్మాణానికి రూ.65,384 కోట్లు(100 కోట్ల డాలర్లు) మాత్రమే ఖర్చవుతుంది. అంతేకాకుండా ఇవి అత్యంత సురక్షితమైనవి’ అని క్రిస్ తెలిపారు. -
మేకిన్ ఇండియాకు ట్రంప్ నిర్ణయం సవాలే
చైనా మీడియా హెచ్చరిక బీజింగ్: స్థానికులకు ఉద్యోగాలివ్వాలం టూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెస్తున్న విధానాలు.. భారత ప్రధాని మోదీ ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమానికి సవాలేనని చైనా మీడియా హెచ్చరించింది. అయితే, ఆసియా మిత్రులతో అమెరికా సాగిస్తున్న సత్సంబంధాలు భారత్–అమెరికా మైత్రి ని బలోపేతం చేస్తాయని పేర్కొంది. ‘చదువుకున్న, శిక్షణ పొందిన యువకులు ప్రపంచంలో అత్యధికంగా భారత్‌లోనే ఉన్నారు. అమెరికా కంపెనీలకు వారే కీల కం. అందువల్ల అమెరికన్లకే ట్రంప్ నిర్ణయాలు (హెచ్1బీ వీసాలపై ఆంక్షలు) అక్కడి భారత ఐటీ ఉద్యోగులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. అమెరికాకు ఔట్సోర్సింగ్ చేస్తున్న భారత ఐటీ, ఫార్మాకంపెనీలపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మేకిన్ ఇండియా నినాదానికి ది ఇబ్బందికరమే’ అంటూ చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. -
పాత 'యాపిల్' మాకొద్దు...
♦ రీఫర్బిష్డ్ ఫోన్ల అమ్మకానికి కేంద్రం నో ♦ మేకిన్ ఇండియా ప్రచారం దెబ్బతింటుందని ఉద్దేశం ♦ పాత ఫోన్లకు దేశం డంప్‌గా మారుతుందని ఆందోళన ♦ యాపిల్ వస్తే నమ్మకం పెరుగుతుందన్న వాదనలూ ఉన్నాయ్ ♦ ప్రస్తుతం ఈ పరిశ్రమ విలువ ఏటా రూ.20,000 కోట్లుగా అంచనా.. మహేందర్ నూగూరి అరె! యాపిల్ ఫోన్ రూ.15 వేలకే వస్తోందే!!. ఎంచక్కా నా కల నెరవేరుతోంది... అనుకున్న వారికి కాస్తంత నిరాశే. ‘‘చైనా ఫోన్లు ఇండియాను ముంచేస్తున్నాయి. ఒక్క ఫోన్లేంటి? విదేశీ ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఇండియాను కమ్మేస్తున్నాయి. ఇక వాడేసిన విదేశీ ఫోన్లు కూడా ఇక్కడికొచ్చేస్తే... ఇదొక డంప్ యార్డ్‌లా తయారయ్యే ప్రమాదం ఉంది’’ అని అనుకున్నవారికి మాత్రం కాస్త సంతోషకరమే. ఎందుకంటే... విదేశాల్లో వాడేసిన ఫోన్లను బాగు చేసి ఇండియాకు తెచ్చి విక్రయించాలని చూసిన దిగ్గజ మొబైల్ సంస్థ ‘యాపిల్’కు ఎదురుదెబ్బ తగిలింది. యాపిల్ చేసిన ఈ ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నిజానికి యాపిల్ చేసిన ఈ ప్రతిపాదన దేశంలో పెద్ద కదలికే తెచ్చింది. ప్రపంచంలోనే నంబర్-1 సంస్థయిన యాపిల్ గనక ఈ మార్కెట్లోకి వస్తే ఐఫోన్లు మరింత చౌకగా వస్తాయని, అందుబాటులోకి వస్తాయని చాలామంది భావించారు. యాపిల్ బ్రాండ్ దానికి తోడుంటుంది కనక పాత ఫోనైనా సరే నమ్మకమైన సర్వీసు ఉంటుందని, రీఫర్బిష్డ్ మార్కెట్లో ఇదో సంచలనమవుతుందని చాలామంది భావించారు. అయితే యాపిల్‌ను అనుమతిస్తే పాత ఫోన్లన్నీ ఇండియాకు దిగుమతి అయి వస్తాయని, దీనికితోడు ఇండియాలో తయారీని ప్రోత్సహించడానికి కేంద్రం చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రచారానికి కూడా దెబ్బ తగులుతుందని మరికొందరు ఆందోళన వ్యక్తంచేశారు. యాపిల్ ప్రత్యర్థి కంపెనీలైతే... ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే ప్రమాదకర పరిణామాలు చోటు చేసుకుంటాయంటూ ప్రభుత్వానికి అభ్యర్థనలు కూడా పంపాయి. ఇవన్నీ చూశాక కేంద్రం మాత్రం యాపిల్ ప్రతిపాదనకు నో చెప్పినట్లు ‘బ్లూమ్‌బర్గ్’ వార్తా సంస్థ తెలియజేసింది. ‘‘ఇలాంటి ప్రతిపాదనను గతేడాది పర్యావరణ మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. యాపిల్ మళ్లీ చేసిన దరఖాస్తును కేంద్రం తోసిపుచ్చింది’’ అని పేరు వెల్లడి కావటానికి ఇష్టపడని టెలికం అధికారి ఒకరు చెప్పినట్లు బ్లూమ్‌బర్గ్ తెలియజేసింది. బ్రాండెడ్ కంపెనీలేవీ లేవు... దేశంలో రీఫర్బిష్డ్ మార్కెట్ విలువ అక్షరాలా ఏడాదికి ఇరవై వేల కోట్ల రూపాయలు. పెపైచ్చు ఏటా 25-30 శాతం పెరుగుతోంది కూడా. అందుకే ఈ మార్కెట్లో సింహ భాగాన్ని చేజిక్కించుకోవచ్చన్న ఉద్దేశంతో యాపిల్ పావులు కదిపింది. నిజానికి ఇంత భారీ పరిమాణం ఉన్న మార్కెట్లో ఇప్పటిదాకా బ్రాండెడ్ కంపెనీలేవీ లేవు. ఎక్కడికక్కడ వ్యాపారులే పాత ఫోన్లను కొని, రీఫర్బిష్ చేసి విక్రయిస్తున్నారు. స్థానికంగా విక్రయించటంతో పాటు ఈబే సహా కొన్ని ఈ-కామర్స్ సైట్ల ద్వారా కూడా వీరే విక్రయిస్తున్నారు. ఇక రీఫర్బిష్డ్ కాకుండానే తాము వాడేసిన ఫోన్లను జనం నేరుగా క్వికర్, ఓఎల్ఎక్స్ తదితర సైట్ల ద్వారా విక్రయానికి పెడుతున్నారు. అంతేతప్ప ఫోన్లను తయారు చేస్తున్న ఏ కంపెనీ కూడా ఇండియాలో అధికారికంగా రీఫర్బిష్డ్ ఫోన్లను విక్రయిం చటం లేదు. అందుకే యాపిల్ దీన్నొక అవకాశంగా తీసుకుంది. కంపెనీలకు చేరకుండా మధ్యలోనే... ఈ-కామర్స్ సైట్ల ద్వారా ఫోన్ కొన్నపుడు... వారం రోజుల్లోనే పనిచేయకుండా పోయే ఫోన్లు మాత్రమే (డెడ్ ఆన్ అరైవల్) తిరిగి తయారీ కంపెనీల వద్దకు వెళ్తున్నాయి. అలాంటపుడు కస్టమర్‌కు కొత్త ఫోన్ ఇస్తాయి. వెనక్కివచ్చిన ఫోన్లను కంపెనీలు రిపేర్ చేసి... ఎక్కువ జమ కాగానే వేలంలో రిజిస్టర్డ్ డీలర్లకు విక్రయిస్తాయి. వారు వీటిని ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, ఆన్లైన్లో విక్రయించకూడదు. ఆఫ్‌లైన్ విధానంలో సబ్‌డీలర్లు, ఇతర విక్రేతల ద్వారా కస్టమర్లకు డిస్కౌంట్లతో విక్రయించాలి. తక్కువ ధరకు వచ్చింది కదా అని కొంటే... దీనికి తయారీ కంపెనీ వారంటీ ఉండకపోతే ఇబ్బందే. ఇక కస్టమర్లు 30 రోజుల రిటర్న్ పాలసీ ఉంది కదా అని 20 రోజులు వాడేసి... ఆ తరవాత తమకు నచ్చలేదని వెనక్కిచ్చేస్తే అవి తయారీ కంపెనీలకు వెళ్లటం లేదు. ఉత్పత్తి వెనక్కి రావటం వల్ల విక్రేత నష్టపోతాడు కనక... ఆ నష్టంలో కొంత మొత్తాన్ని ఈ-కామర్స్ కంపెనీలు భరిస్తున్నాయి. ఇలా తిరిగొచ్చిన ఫోన్లను చిన్నచిన్న వ్యాపారులు, సెకండ్ హ్యాండ్ ఫోన్ల వ్యాపారంలో ఉన్నవారు కొనుక్కుని, చిన్నపాటి మార్పులు చేసి వాటినే రీఫర్బిష్డ్ పేరిట అమ్ముతున్నారు. తయారీ కంపెనీలే రీఫర్బిష్ చేసినట్లు మాయ మాటలు చెబుతున్నారు. -
కొత్త విమానాలు 1,600 కావాలి
♦ 20 ఏళ్లలో రూ. 15 లక్షల కోట్లు అవసరం ♦ మేకిన్ ఇండియాలో భాగంగా విడిభాగాల కొనుగోళ్లు ♦ 2020 నాటికి ఈ మొత్తం 2 బిలియన్ డాలర్లు ♦ ఎయిర్‌బస్ వైస్ ప్రెసిడెంట్ జూస్ట్ వాన్‌డెర్ హైడెన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పౌర విమానయాన రంగంలో ప్రపంచంలోనే అత్యధిక వృద్ధిరేటును నమోదు చేస్తున్న ఇండియాకి వచ్చే ఇరవై ఏళ్లలో 1,600 కొత్త విమానాలు అవసరమవుతాయని విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్ అంచనా వేసింది. ఇందుకోసం సుమారు రూ.15 లక్షల కోట్లు అవసరమవుతాయని ఎయిర్‌బస్ వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్, (ఆసియా, నార్త్ అమెరికా) జూస్ట్ వాన్‌డెర్ హైడెన్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఏవియేషన్ ప్రదర్శనలో భాగంగా విలేకరుల సమావేశంలో హైడెన్ మాట్లాడుతూ ఇందులో 100 కంటే ఎక్కువ సీట్ల సామర్థ్యం ఉన్న 1,230 విమానాలు, 380 భారీ విమానాలు అవసరమవుతాయన్నారు. ప్రస్తుతం ఇండియాలో 325 చిన్న విమానాలు, 53 భారీ విమానాలు సేవలు అందిస్తున్నాయి. ప్రస్తుతం నెలకు పది లక్షల మందికిపైగా ప్రయాణం చేస్తున్నా విమానాశ్రమాల సంఖ్య 4కే పరిమితమయ్యిందని, 2034కి ఈ సంఖ్య 14కు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో దేశీయ విమానయాన రంగం సగటున 8.4 శాతం వృద్ధిని నమోదు చేయడం ద్వారా ప్రయాణికుల సంఖ్య మూడు రెట్లు పెరుగుతుందన్నారు. గతేడాది ఇండియా నుంచి 250 కొత్త విమానాలకు ఆర్డర్లు వచ్చాయన్నారు. ప్రస్తుత విమానాలతో పోలిస్తే 20 శాతానికిపైగా ఇంధన వ్యయాన్ని తగ్గించే ఏ-320 నియో, 3-321 నియోలకు మంచి డిమాండ్ ఉందని, ఈ ఏడాది చివరికల్లా వీటి డెలివరీ మొదలవుతుందన్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా స్థానికంగా విడిభాగాలను అత్యధికంగా వినియోగిస్తున్నామని, ప్రస్తుతం 500 మిలియన్ డాలర్లుగా ఉన్న వీటి కొనుగోళ్ల విలువ 2020 నాటికి 2 బిలియన్ డాలర్లకు చేరుతుందన్నారు. -
మోదీ మేకిన్ ఇండియా.. బాబు మేకిన్ సింగపూర్
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ ఎద్దేవా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల హామీలను విస్మరించాయి ఎన్నికల హామీల అమలు కోసం ప్రజల పక్షాన ఉద్యమిస్తాం టీడీపీ, బీజేపీ నేతల లాగులు తడిసేలా పోరాడదాం: రఘువీరా విజయవాడ సెంట్రల్: ప్రధాని నరేంద్ర మోదీ మేకిన్ ఇండియా అంటుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు మేకిన్ సింగపూర్ అంటున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ ఎద్దేవా చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాలు ఎన్నికల హామీలను పూర్తిగా విస్మరించాయని దిగ్విజయ్‌సింగ్ ధ్వజమెత్తారు. మోదీ, చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీల అమలు కోసం ప్రజల పక్షాన ఉద్యమిస్తామన్నారు. విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో పీసీసీ సమన్వయ కమిటీ తొలి సమావేశం, కాంగ్రెస్ విస్తృత కార్యవర్గ సమావేశం, విలేకరుల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ప్రత్యేకహోదాపై నోరు మెదపకపోవడం సిగ్గుచేటని దిగ్విజయ్ ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పెట్టుబడులు వరదలా వస్తాయని, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. ఇరిగేషన్, ఎడ్యుకేషన్ రంగాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్ర మంత్రివర్గంలో గిరిజన, ముస్లిం మంత్రులు లేకపోవడం చరిత్రలో ఇదే తొలిసారని విమర్శించారు. రాష్ట్రంలో పెద్దఎత్తున జరుగుతున్న ప్రభుత్వ అవినీతిని సకాలంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీకి పునర్వైభవం కోసం ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. కాంగ్రెస్ పాలన, ఇతర పార్టీల పాలన మధ్య ఉన్న వ్యత్యాసాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. ప్రభుత్వం అనుసరిస్తోన్న బాకై్సట్ దోపిడీ విధానంపై గిరిజనులను ఎప్పటికప్పుడు చైతన్య పరిచేందుకు సిద్ధం కావాలన్నారు. భావప్రకటనను, స్వేచ్ఛను హరించేలా దేశంలో దాడులు జరగడం బాధాకరమని చెప్పారు. అఫ్జల్ గురుకు అనకూలంగా జేఎన్‌యూలో సమావేశం ఏర్పాటుచేసిన ఉమర్ ఖలీద్‌పై చర్యలు తీసుకోకుండా, విద్యార్థి నాయకుడు కన్హయా కుమార్‌పై కేసులు పెట్టడం శోచనీయమన్నారు. టీడీపీ దోపిడీ పాలనపై పోరాడదాం: రఘువీరా రాష్ట్రంలో టీడీపీ దోపిడీపాలనపై పోరాటాన్ని ఉధృతం చేయాలని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. ఇసుక, మైను, వైనుతో టీడీపీ నేతలు రాష్ట్రాన్ని దోచేస్తున్నారని దుయ్యబట్టారు. జన్మభూమి కమిటీలను అడ్డుపెట్టుకొని ప్రజాప్రతినిధుల హక్కుల్ని హరించివేస్తున్నారన్నారు. టీడీపీ, బీజేపీలు ఎన్నికల్లో అబద్ధపు హామీలు ఇచ్చి జూన్ 8కి రెండేళ్లు పూర్తవుతోందన్నారు. ఆ పార్టీ నాయకుల లాగులు తడిసేలా మే నెల్లో పెద్దఎత్తున పోరాటానికి రూపకల్పన చేస్తున్నట్లు పేర్కొన్నారు. బాకై్సట్ అక్రమ త్రవ్వకాలపై గిరిజనుల్ని చైతన్యపర్చేందుకు త్వరలోనే ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తారని తెలిపారు. త్వరలో జరగనున్న మునిసిపల్, నగరపాలక సంస్థ ఎన్నిక లకు సమాయత్తం కావాలన్నారు. సమావేశాల్లో పార్టీ ఎస్సీ సెల్ జాతీయ కార్యదర్శి కొప్పుల రాజు, పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తిరువనక్కరసు, శాసన మండలి విపక్షనేత సి.రామచంద్రయ్య, రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు, జేడీ శీలం, మాజీ మంత్రులు సాకే శైలజానాథ్, కనుమూరి బాపిరాజు, పనబాక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రరత్న భవన్లో కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం 60 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం విజయవాడ కేంద్రంగా మళ్లీ కాంగ్రెస్ కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండగా నగరం నుంచే కాంగ్రెస్ కార్యకలాపాలు సాగేవి. ఆ తరువాత తెలంగాణతో కలిసి రాష్ట్రం ఏర్పడ్డాక హైదరాబాద్‌కు మకాం మార్చారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రరత్న భవన్ రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంగా మారింది. ఈ భవనంలో ఏర్పాటు చేసిన పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. అనంతరం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పార్టీ పతాకాన్ని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్యనేతలు, కేంద్ర మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మేకిన్ ఇండియాలో పెట్టుబడుల ఆకర్షణ
ముగింపు కార్యక్రమానికి మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: ముంబైలో జరుగుతున్న ‘మేకిన్ ఇండియా’ వారోత్సవాలు వేదికగా రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు పరిశ్రమల శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 13న ప్రారంభమైన వారోత్సవాల్లో తెలంగాణ పరిశ్రమల శాఖ ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసింది. రోజుకు సగటున 50కి పైగా జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు తెలంగాణ స్టాల్‌ను సందర్శించారు. వారికి రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం(టీఎస్ఐపాస్) ప్రత్యేకతలతోపాటు, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై పరిశ్రమల శాఖ అధికారులు వివరించారు. స్టాల్‌ను సందర్శించిన సంస్థల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. చైనాలోని హునాన్ ప్రావిన్స్‌కు చెందిన పరిశ్రమల ప్రతినిధులతోపాటు, ఎయిర్‌బస్, సిప్లా వంటి ప్రముఖ పారిశ్రామిక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపాయి. స్టాల్‌ను సందర్శించిన సంస్థల వివరాలు సేకరించిన పరిశ్రమల శాఖ.. పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్న 25 సంస్థల జాబితాను సిద్ధం చేశారు. గురువారం జరిగే వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొంటారు. -
ప్రాజెక్టుల జాప్యానికి బ్యూరోక్రసీనే కారణం కాదు
మేకిన్ ఇండియా వారోత్సవంలో కేంద్ర మంత్రి గడ్కరీ వ్యాఖ్యలు ముంైబె : ప్రాజెక్టులకు అనుమతులివ్వడంలో జాప్యానికి పూర్తిగా బ్యూరోక్రసీనే తప్పు పట్టలేమని, వాటి అమలుకు రాజకీయ మద్దతు కూడా అవసరమని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రాజెక్టుల జాప్యానికి బ్యూరోక్రసీ కారణమని తాను కూడా వివిధ వేదికలపై వ్యాఖ్యానించిన సంగతి వాస్తవమేనని, కానీ ప్రతీసారి వ్యవస్థనే తప్పు పట్టం సరికాదన్నది తన అభిప్రాయమని పేర్కొన్నారు. మేకిన్ ఇండియా వారోత్సవంలో భాగంగా రహదారులు, హైవేలపై సెమినార్లో పాల్గొన్న సందర్భంగా గడ్కరీ ఈ విషయాలు తెలిపారు. ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసేందుకు కొత్త టెక్నాలజీనో.. విధానాలనో అమలు చేసిన ప్రతిసారి విమర్శలు రావడమో లేక వివిధ వర్గాల నుంచి మద్దతు లేకపోవడమో జరుగుతోందన్నారు. ఎఫ్‌టీఏలతో మేకిన్ ఇండియాకు కష్టం.. వివిధ దేశాలతో ఎడా పెడా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ) కుదుర్చుకుంటూ వెడితే మేకిన్ ఇండియా నినాదానికి విఘాతం కలుగుతుందని దేశీ ఆటోమొబైల్ పరికరాల తయారీ కంపెనీలు హెచ్చరించాయి. ఈ ఎఫ్‌టీఏల వల్ల సమాన అవకాశాలు దక్కకుండా పోతే దేశీ పరిశ్రమ పోటీ పడలేక, కుదేలవుతుందని ఆటో పరికరాల తయారీ సంస్థల అసోసియేషన్ ప్రెసిడెంట్ అరవింద్ బాలాజీ కార్యక్రమంలో చెప్పారు. ఫోక్స్‌వ్యాగన్ కార్ల నుంచి తీవ్ర ‘కాలుష్యం’: గీతే జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ కార్ల నుంచి కాలుష్య ఉద్గారాలు పరిమితికి మించి తొమ్మిది రెట్లు అధికంగా వెలువడుతున్నట్లు తేలిందని భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్ గీతే చెప్పారు. దీనికి సంబంధించి ఫోక్స్‌వ్యాగన్‌పై తగు చర్యలు తీసుకోవాలని రహదారుల రవాణా శాఖను కోరినట్లు ఆయన వివరించారు. కర్ణాటకకు 10వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు.. మేకిన్ ఇండియా వీక్ సందర్భంగా తమ రాష్ట్రానికి రూ. 10,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయని కర్ణాటక తెలిపింది. ఫ్రాన్స్‌కి చెందిన టార్కోవాక్స్ సిస్టమ్స్ గ్రూప్, అమెరికాకు చెందిన మెకార్మిక్ ఇంగ్రీడియంట్స్ తదితర సంస్థల ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయని వివరించింది. -
యంత్రపరికరాల రంగంపై ప్రత్యేక దృష్టి
♦ 2025 నాటికి అదనంగా 2.1 కోట్ల ఉద్యోగాల కల్పన లక్ష్యం ♦ తయారీలో వాటా 20 శాతానికి పెంచుకోవడానికి ప్రాధాన్యం న్యూఢిల్లీ: భారీ యంత్రపరికరాల తయారీ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలు పరిష్కరించే దిశగా కేంద్రం తొలిసారిగా ప్రత్యేక విధానాన్ని ఆవిష్కరించింది. దీని ద్వారా 2025 నాటికి అదనంగా 2.1 కోట్ల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా నిర్దేశించుకుంది. అలాగే మొత్తం తయారీ కార్యక లాపాల్లో యంత్ర పరికరాల విభాగం వాటాను ప్రస్తుతమున్న 12 శాతం నుంచి 2025 నాటికల్లా 20 శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ గత వారం దీనికి ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్ గీతే తెలిపారు. ప్రస్తుతం రూ. 2.3 లక్షల కోట్లుగా ఉన్న యంత్రపరికరాల తయారీని 2025 నాటికల్లా రూ. 7.5 లక్షల కోట్లకు పెంచుకునేలా జాతీయ యంత్రపరికరాల విధానాన్ని రూపొందించినట్లు మేకిన్ ఇండియా వారోత్సవంలో పాల్గొన్న సందర్భంగా సోమవారం ఆయన వివరించారు. విద్యుత్ రంగంలోకి 1 లక్ష కోట్ల డాలర్లు .. విద్యుత్ రంగానికి సంబంధించి గత కొన్నాళ్లుగా ప్రభుత్వం పలు సంస్కరణలు ప్రవేశపెట్టిన దరిమిలా 2030 నాటికల్లా ఈ రంగంలోకి కనీసం 1 లక్ష కోట్ల డాలర్ల పెట్టుబడులు రాగలవని అంచనా వేస్తున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియుష్ గోయల్ చెప్పారు. డిస్కంలకు తోడ్పాటునిచ్చే ‘ఉదయ్’ స్కీము, టారిఫ్ విధానాలు, మరోవైపు, ప్రభుత్వ రంగ రిఫైనరీలు స్పాట్ క్రూడ్ కొనుగోళ్లకు సంబంధించి .. టెండర్ల ప్రక్రియ ప్రస్తావన లేకుండా కొత్తగా ముడిచమురు దిగుమతి విధానాన్ని రూపొందించనున్నట్లు చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. మహారాష్ట్రలో రూ. 6 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు.. మేకిన్ ఇండియా వీక్‌లో భాగంగా సోమవారం నిర్వహించిన సెమినార్లో దాదాపు రూ. 6.11 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు సంబంధించి సుమారు 2,560 అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. వీటితో దాదాపు 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించగలవన్నారు. -
పెరిగిన దేశీ తయారీ స్మార్ట్ఫోన్ల ఎగుమతులు
బెంగళూరు: ప్రతిష్టాత్మక ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమం సత్ఫలితాలను అందిస్తోంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 19.9 శాతంగా ఉన్న స్థానికంగా తయారైన స్మార్ట్ఫోన్ల ఎగుమతులు రెండో త్రైమాసికంలో 24.8 శాతానికి పెరిగాయి. అంటే మొత్తం స్మార్ట్ఫోన్ల ఎగుమతుల్లో 24.8 శాతం ఇండియాలో తయారైనవి లేదా అసెంబుల్ అయినవి వున్నాయి. సైబర్‌మీడియా రీసెర్చ్ నివేదిక ప్రకారం మొత్తం భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శాంసంగ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. శాంసంగ్, స్పైస్ కంపెనీలకు ఇప్పటికే దేశంలో ప్లాంట్లు ఉన్నాయి. హెచ్‌టీసీ, జియోనీ వంటి కంపెనీలు ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నాయి. -
ఎయిర్ బస్ భారత్ కార్యకలాపాలకు ఒకే సంస్థ
న్యూఢిల్లీ: భారత్‌లో వ్యాపార విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తేవాలని ఏవియేషన్ దిగ్గజం ఎయిర్‌బస్ గ్రూప్ నిర్ణయించింది. ఎయిర్‌బస్ గ్రూప్ ఇండియా పేరుతో ఏర్పాటయ్యే ఈ సంస్థకు పియర్ డి బాసెట్ సారథ్యం వహిస్తారని వెల్లడించింది. ఇలా స్థానిక కార్యకలాపాలన్నింటినీ ఒకే సంస్థ కిందికి తేవడమనేది మొట్టమొదటిసారిగా భారత్‌లోనే చేపట్టామని, ఇది తమ ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమానికి కూడా దోహదపడగలదని భావిస్తున్నామని ఎయిర్‌బస్ గ్రూప్ పేర్కొంది. భారత్‌ను తమ గ్రూప్ ఇంజనీరింగ్, ఇన్నోవేషన్ కార్యకలాపాలకు హబ్‌గా తీర్చిదిద్దుకునేందుకు పుష్కలంగా అవకాశాలున్నాయని బాసెట్ తెలిపారు. ఇప్పటికే తమ అంతర్జాతీయ కార్యకలాపాల్లో భారత విభాగం కీలకపాత్ర పోషిస్తోందని ఆయన తెలియజేశారు. దాదాపు 61 బిలియన్ డాలర్ల గ్రూప్‌లో ఎయిర్‌బస్, ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్, ఎయిర్‌బస్ హెలికాప్టర్స్ భాగంగా ఉన్నాయి. -
మోదీ విజన్‌కు కెర్రీ ఫిదా!
ప్రధాని కార్యక్రమాలపై అమెరికా విదేశాంగ మంత్రి ప్రశంసల జల్లు గాంధీనగర్: ప్రధాని మోదీ విజన్‌పై అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ప్రశంసల వర్షం కురిపించారు. ‘మేకిన్ ఇండియా’, ‘సబ్కా సాత్ సబ్కా వికాస్’ కార్యక్రమాలు అద్భుతమన్నారు. సమ్మిళిత వృద్ధిని కాంక్షించే ‘సబ్కా సాత్ సబ్కా వికాస్’ నినాదం విశ్వవ్యాప్తం కావాలని అభిలషించారు. ఆదివారమిక్కడ వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో కెర్రీ ప్రసంగించారు. భారత్-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేసుకుకోవడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని, ఇంతకుమించిన మంచి తరుణం దొరకదని అన్నారు. ద్వైపాక్షిక సంబంధాల్లో సరికొత్త అధ్యాయానికి మేకిన్ ఇండియా నినాదం ‘గెలువు-గెలిపించు’ స్ఫూర్తిగా నిలవాలన్నారు. రైళ్లలో టీ అమ్ముకున్న ఒక వ్యక్తి భారత అత్యున్నత పీఠంపై కూర్చున్నారంటూ మోదీని అభినందించారు. ‘ఈరోజు సరికొత్త భారత నిర్మాణానికి జరుగుతున్న ఈ కార్యక్రమంలో సంతోషంగా భాగస్వాములం అవుతున్నాం. ఎన్నికల సమయంలో మోదీ ఇచ్చిన సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదం నన్నెంతో ఆకట్టుకుంది’ అని అన్నారు. మోదీ చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు సహకారం అందిస్తామన్నారు. గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు తమ అధ్యక్షుడు ఒబామా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. భారత్‌తో వాణిజ్య బంధాలు మరింత బలోపేతం చేసుకుంటామని కెర్రీ పేర్కొన్నారు. ‘వస్తువులు, సేవలకు సంబంధించిన వాణిజ్యం ఇరుదేశాల మధ్య 2000 సంవత్సరంతో పోలిస్తే ఐదు రెట్లు పెరిగింది. ద్వైపాక్షిక పెట్టుబడులు 30 బిలి యన్ డాలర్లకు చేరాయి. ఇరు దేశాల మధ్య వార్షిక వాణిజ్యం ఐదు రెట్లు పెరగాలని మోదీ ఆకాంక్షిస్తున్నారు. అందుకు అనుగుణంగా మేం కూడా చర్యలు చేపడతాం. ప్రజల ఆకాంక్షలను ప్రజాస్వామ్యమే నెరవేరుస్తుందని నిరూపించే ఉమ్మడి బాధ్యత రెండు దేశాలపైనా ఉంది’ అని వ్యాఖ్యానించారు. అనంతరం కెర్రీ ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఆయన ఇక్కడి గాంధీ ఆశ్రమా న్ని కూడా సందర్శించి మహిళలతో ముచ్చటించారు. ఆయన వెంట అహ్మదాబాద్‌కు చెందిన నిషా బిస్వాల్ ఉన్నారు. ఆమె ప్రస్తు తం అమెరికా దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల శాఖకు ఉపమంత్రిగా ఉన్నారు. -
వచ్చే ఏడాది మొబైల్ ఎగుమతులు నిల్
పెరిగిపోతున్న దిగుమతులు దేశీయంగా తగ్గిపోతున్న ఉత్పత్తి సెల్యులార్ అసోసియేషన్ నివేదిక న్యూఢిల్లీ: ఒకవైపు మేకిన్ ఇండియా నినాదంతో దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీకి ఊతమిచ్చేలా కేంద్రం కసరత్తు చేస్తుంటే మరోవైపు అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాదిలో మొబైల్ ఫోన్ల ఎగుమతులు పూర్తిగా సున్నా స్థాయికి పడిపోనున్నాయని భారతీయ సెల్యులార్ అసోసియేషన్ (ఐసీఏ) ఒక నివేదికలో పేర్కొంది. పన్ను వివాదం కారణంగా తమిళనాడులో నోకియా మొబైల్ ఫోన్ ప్లాంటు మూతబడటం కూడా ఎగుమతుల క్షీణతకు కారణమని తెలిపింది. నివేదిక ప్రకారం 2014లో మొబైల్ మార్కెట్ 32 శాతం పెరిగి 12 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. అయితే, దేశీయంగా ఉత్పత్తి 29 శాతం క్షీణించి... మూడొంతుల మార్కెట్‌ను దిగుమతులే ఆక్రమిస్తాయి. 2012లో గరిష్టంగా రూ. 12,000 కోట్ల స్థాయిని తాకిన ఎగుమతులు అప్పట్నుంచీ 70 శాతం క్షీణతతో ఈ ఏడాది రూ. 2,450 కోట్లకు పరిమితం కానున్నాయి. తక్షణం తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే వచ్చే ఏడాది అసలు మొబైల్ ఫోన్ల ఎగుమతులే ఉండబోవని కేంద్రానికి సమర్పించిన నివేదికలో ఐసీఏ తెలిపింది. గతంలో దేశీయంగా ఎలక్ట్రానిక్ మొబైల్ మార్కెట్లో దిగుమతులదే హవా ఉన్నప్పటికీ, ఎగుమతులు కూడా చెప్పుకోతగ్గ స్థాయిలో ఉండటం వల్ల వాణిజ్య లోటు ఒక మోస్తరు స్థాయికి పరిమితమయ్యేదని ఐసీఏ వివరించింది. 2013-14లో టెలికం విభాగంలో వాణిజ్య లోటు రూ. 49,041 కోట్లుగా నమోదైంది. ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు అత్యంత తక్కువగా ఉండగా.. మొబైల్ రంగం తయారీ, ఎగుమతులు మాత్రమే ఆదుకున్నాయి. నిజానికి 2008-12 మధ్య కాలంలో దేశీ డిమాండ్‌కి దాదాపు సమాన స్థాయిలో ఉత్పత్తి ఉండేదని ఐసీఏ పేర్కొంది. రూ. 75,750 కోట్లకు దిగుమతులు.. 2012లో రూ. 34,600 కోట్లుగా ఉన్న మొబైల్ ఫోన్ దిగుమతులు 2014లో రూ. 58,550 కోట్లకు చేరినట్లు ఐసీఏ తెలిపింది. ఇది వచ్చే ఏడాది ఏకంగా రూ. 75,750 కోట్లుగా ఉండగలదని అంచనా వేసింది. దేశీ ఐటీ, టెలికం ఎగుమతులకు తోడ్పాటుగా ఉంటున్న మొబైల్ ఫోన్ రంగం పరిస్థితి ఇలా మారడం దురదృష్టకరమని ఐసీఏ జాతీయ ప్రెసిడెంట్ పంకజ్ మహీంద్రూ వ్యాఖ్యానించారు. అయితే, భారత్‌ను తయారీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రధాని కట్టుబడి ఉన్న నేపథ్యంలో పరిస్థితులు మెరుగుపడగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేశీ కంపెనీలు 2019 నాటికి అంతర్జాతీయ మొబైల్ తయారీ మార్కెట్లో 25 సాతం వాటా దక్కించుకునేలా పదేళ్ల ట్యాక్స్ హాలిడే, ఇతర త్రా పన్నుల్లో కొంత వెసులుబాటు మొదలైన చర్యలు తీసుకోవాలని ఐసీఏ సిఫార్సు చేసింది. దీంతో వార్షికంగా 13 లక్షల పైగా అదనంగా ఉద్యోగాల కల్పన జరగగలదని, పరిశ్రమ వార్షిక టర్నోవరు రూ. 1.5-3 లక్షల కోట్ల స్థాయికి చేరగలదని వివరించింది. ప్రస్తుతం 60 శాతంగా ఉన్న దిగుమతులు 10 శాతానికి తగ్గగలవని పేర్కొంది. -
కార్మికుల శ్రమ దోపిడీకే ‘మేకిన్ ఇండియా’
జవహర్‌నగర్: కార్మికుల శ్రమను దోచిపెట్టేందుకే ప్రధాన మంత్రి మోదీ ‘మేకిన్ ఇండియా’ అంటున్నారని, చట్టాల సవరణకు వ్యతిరేకంగా కార్మికులు పోరాడాలని ప్రగతిశీల మహిళా సంఘం తెలంగాణ అధ్యక్షురాలు సంధ్య పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం బాలాజీనగర్‌లో భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఇఫ్టూ) ఆధ్వర్యంలో కార్మిక చట్టాల సవరణలను, ఎఫ్‌డీఐల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంధ్య మాట్లాడుతూ.. తెల్లదొరల కాలంలోనే దేశంలోని కార్మికవర్గం ఉద్యమాలు చేసి చట్టాలను సాధించిందన్నారు. కార్మిక చట్టాల అడ్డు తొలగించుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వం తీవ్రంగా యత్నిం స్తోందని.. దీనిని కార్మికులంతా అడ్డుకోవల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాన మంత్రి మోదీ విదేశాలలో సమావేశాలు నిర్వహిస్తూ ఇండియాలో కార్మిక చట్టాన్ని రద్దు చేయాలని చెప్పడం విచారకరమన్నారు. కార్మికుల శ్రమను దోచిపెట్టడానికే మోదీ మేకిన్ ఇండియా నినాదం ఎత్తుకున్నారని ఆమె దుయ్యబట్టారు. డిసెంబర్ 5న హైదరాబాద్‌లో నిర్వహించే కార్మిక ప్రదర్శనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఇప్టూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.నరేందర్, జంటనగరాల ఉపాధ్యక్షుడు సీహెచ్ బాలనర్సింహ, జిల్లా నాయకులు జయసుధ, వెంకన్న,రామిరెడ్డి, అరుణోదయ జిల్లా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి తదితరులు ఉన్నారు.