పాత 'యాపిల్' మాకొద్దు...
♦ రీఫర్బిష్డ్ ఫోన్ల అమ్మకానికి కేంద్రం నో
♦ మేకిన్ ఇండియా ప్రచారం దెబ్బతింటుందని ఉద్దేశం
♦ పాత ఫోన్లకు దేశం డంప్‌గా మారుతుందని ఆందోళన
♦ యాపిల్ వస్తే నమ్మకం పెరుగుతుందన్న వాదనలూ ఉన్నాయ్
♦ ప్రస్తుతం ఈ పరిశ్రమ విలువ ఏటా రూ.20,000 కోట్లుగా అంచనా..
మహేందర్ నూగూరి
అరె! యాపిల్ ఫోన్ రూ.15 వేలకే వస్తోందే!!. ఎంచక్కా నా కల నెరవేరుతోంది... అనుకున్న వారికి కాస్తంత నిరాశే.
‘‘చైనా ఫోన్లు ఇండియాను ముంచేస్తున్నాయి. ఒక్క ఫోన్లేంటి? విదేశీ ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఇండియాను కమ్మేస్తున్నాయి. ఇక వాడేసిన విదేశీ ఫోన్లు కూడా ఇక్కడికొచ్చేస్తే... ఇదొక డంప్ యార్డ్‌లా తయారయ్యే ప్రమాదం ఉంది’’ అని అనుకున్నవారికి మాత్రం కాస్త సంతోషకరమే.
ఎందుకంటే... విదేశాల్లో వాడేసిన ఫోన్లను బాగు చేసి ఇండియాకు తెచ్చి విక్రయించాలని చూసిన దిగ్గజ మొబైల్ సంస్థ ‘యాపిల్’కు ఎదురుదెబ్బ తగిలింది. యాపిల్ చేసిన ఈ ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నిజానికి యాపిల్ చేసిన ఈ ప్రతిపాదన దేశంలో పెద్ద కదలికే తెచ్చింది. ప్రపంచంలోనే నంబర్-1 సంస్థయిన యాపిల్ గనక ఈ మార్కెట్లోకి వస్తే ఐఫోన్లు మరింత చౌకగా వస్తాయని, అందుబాటులోకి వస్తాయని చాలామంది భావించారు.
యాపిల్ బ్రాండ్ దానికి తోడుంటుంది కనక పాత ఫోనైనా సరే నమ్మకమైన సర్వీసు ఉంటుందని, రీఫర్బిష్డ్ మార్కెట్లో ఇదో సంచలనమవుతుందని చాలామంది భావించారు. అయితే యాపిల్‌ను అనుమతిస్తే పాత ఫోన్లన్నీ ఇండియాకు దిగుమతి అయి వస్తాయని, దీనికితోడు ఇండియాలో తయారీని ప్రోత్సహించడానికి కేంద్రం చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రచారానికి కూడా దెబ్బ తగులుతుందని మరికొందరు ఆందోళన వ్యక్తంచేశారు. యాపిల్ ప్రత్యర్థి కంపెనీలైతే... ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే ప్రమాదకర పరిణామాలు చోటు చేసుకుంటాయంటూ ప్రభుత్వానికి అభ్యర్థనలు కూడా పంపాయి.
ఇవన్నీ చూశాక కేంద్రం మాత్రం యాపిల్ ప్రతిపాదనకు నో చెప్పినట్లు ‘బ్లూమ్‌బర్గ్’ వార్తా సంస్థ తెలియజేసింది. ‘‘ఇలాంటి ప్రతిపాదనను గతేడాది పర్యావరణ మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. యాపిల్ మళ్లీ చేసిన దరఖాస్తును కేంద్రం తోసిపుచ్చింది’’ అని పేరు వెల్లడి కావటానికి ఇష్టపడని టెలికం అధికారి ఒకరు చెప్పినట్లు బ్లూమ్‌బర్గ్ తెలియజేసింది.
బ్రాండెడ్ కంపెనీలేవీ లేవు...
దేశంలో రీఫర్బిష్డ్ మార్కెట్ విలువ అక్షరాలా ఏడాదికి ఇరవై వేల కోట్ల రూపాయలు. పెపైచ్చు ఏటా 25-30 శాతం పెరుగుతోంది కూడా. అందుకే ఈ మార్కెట్లో సింహ భాగాన్ని చేజిక్కించుకోవచ్చన్న ఉద్దేశంతో యాపిల్ పావులు కదిపింది. నిజానికి ఇంత భారీ పరిమాణం ఉన్న మార్కెట్లో ఇప్పటిదాకా బ్రాండెడ్ కంపెనీలేవీ లేవు. ఎక్కడికక్కడ వ్యాపారులే పాత ఫోన్లను కొని, రీఫర్బిష్ చేసి విక్రయిస్తున్నారు. స్థానికంగా విక్రయించటంతో పాటు ఈబే సహా కొన్ని ఈ-కామర్స్ సైట్ల ద్వారా కూడా వీరే విక్రయిస్తున్నారు. ఇక రీఫర్బిష్డ్ కాకుండానే తాము వాడేసిన ఫోన్లను జనం నేరుగా క్వికర్, ఓఎల్‌ఎక్స్ తదితర సైట్ల ద్వారా విక్రయానికి పెడుతున్నారు. అంతేతప్ప ఫోన్లను తయారు చేస్తున్న ఏ కంపెనీ కూడా ఇండియాలో అధికారికంగా రీఫర్బిష్డ్ ఫోన్లను విక్రయిం చటం లేదు. అందుకే యాపిల్ దీన్నొక అవకాశంగా తీసుకుంది.
కంపెనీలకు చేరకుండా మధ్యలోనే...
ఈ-కామర్స్ సైట్ల ద్వారా ఫోన్ కొన్నపుడు... వారం రోజుల్లోనే పనిచేయకుండా పోయే ఫోన్లు మాత్రమే (డెడ్ ఆన్ అరైవల్) తిరిగి తయారీ కంపెనీల వద్దకు వెళ్తున్నాయి. అలాంటపుడు కస్టమర్‌కు కొత్త ఫోన్ ఇస్తాయి. వెనక్కివచ్చిన ఫోన్లను కంపెనీలు రిపేర్ చేసి... ఎక్కువ జమ కాగానే వేలంలో రిజిస్టర్డ్ డీలర్లకు విక్రయిస్తాయి. వారు వీటిని ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, ఆన్‌లైన్‌లో విక్రయించకూడదు. ఆఫ్‌లైన్ విధానంలో సబ్‌డీలర్లు, ఇతర విక్రేతల ద్వారా కస్టమర్లకు డిస్కౌంట్లతో విక్రయించాలి.
తక్కువ ధరకు వచ్చింది కదా అని కొంటే... దీనికి తయారీ కంపెనీ వారంటీ ఉండకపోతే ఇబ్బందే. ఇక కస్టమర్లు 30 రోజుల రిటర్న్ పాలసీ ఉంది కదా అని 20 రోజులు వాడేసి... ఆ తరవాత తమకు నచ్చలేదని వెనక్కిచ్చేస్తే అవి తయారీ కంపెనీలకు వెళ్లటం లేదు. ఉత్పత్తి వెనక్కి రావటం వల్ల విక్రేత నష్టపోతాడు కనక... ఆ నష్టంలో కొంత మొత్తాన్ని ఈ-కామర్స్ కంపెనీలు భరిస్తున్నాయి. ఇలా తిరిగొచ్చిన ఫోన్లను చిన్నచిన్న వ్యాపారులు, సెకండ్ హ్యాండ్ ఫోన్ల వ్యాపారంలో ఉన్నవారు కొనుక్కుని, చిన్నపాటి మార్పులు చేసి వాటినే రీఫర్బిష్డ్ పేరిట అమ్ముతున్నారు. తయారీ కంపెనీలే రీఫర్బిష్ చేసినట్లు మాయ మాటలు చెబుతున్నారు.