వచ్చే ఏడాది మొబైల్ ఎగుమతులు నిల్
పెరిగిపోతున్న దిగుమతులు
దేశీయంగా తగ్గిపోతున్న ఉత్పత్తి
సెల్యులార్ అసోసియేషన్ నివేదిక
న్యూఢిల్లీ: ఒకవైపు మేకిన్ ఇండియా నినాదంతో దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీకి ఊతమిచ్చేలా కేంద్రం కసరత్తు చేస్తుంటే మరోవైపు అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాదిలో మొబైల్ ఫోన్ల ఎగుమతులు పూర్తిగా సున్నా స్థాయికి పడిపోనున్నాయని భారతీయ సెల్యులార్ అసోసియేషన్ (ఐసీఏ) ఒక నివేదికలో పేర్కొంది. పన్ను వివాదం కారణంగా తమిళనాడులో నోకియా మొబైల్ ఫోన్ ప్లాంటు మూతబడటం కూడా ఎగుమతుల క్షీణతకు కారణమని తెలిపింది. నివేదిక ప్రకారం 2014లో మొబైల్ మార్కెట్ 32 శాతం పెరిగి 12 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది.
అయితే, దేశీయంగా ఉత్పత్తి 29 శాతం క్షీణించి... మూడొంతుల మార్కెట్‌ను దిగుమతులే ఆక్రమిస్తాయి. 2012లో గరిష్టంగా రూ. 12,000 కోట్ల స్థాయిని తాకిన ఎగుమతులు అప్పట్నుంచీ 70 శాతం క్షీణతతో ఈ ఏడాది రూ. 2,450 కోట్లకు పరిమితం కానున్నాయి. తక్షణం తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే వచ్చే ఏడాది అసలు మొబైల్ ఫోన్ల ఎగుమతులే ఉండబోవని కేంద్రానికి సమర్పించిన నివేదికలో ఐసీఏ తెలిపింది.
గతంలో దేశీయంగా ఎలక్ట్రానిక్ మొబైల్ మార్కెట్‌లో దిగుమతులదే హవా ఉన్నప్పటికీ, ఎగుమతులు కూడా చెప్పుకోతగ్గ స్థాయిలో ఉండటం వల్ల వాణిజ్య లోటు ఒక మోస్తరు స్థాయికి పరిమితమయ్యేదని ఐసీఏ వివరించింది. 2013-14లో టెలికం విభాగంలో వాణిజ్య లోటు రూ. 49,041 కోట్లుగా నమోదైంది. ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు అత్యంత తక్కువగా ఉండగా.. మొబైల్ రంగం తయారీ, ఎగుమతులు మాత్రమే ఆదుకున్నాయి. నిజానికి 2008-12 మధ్య కాలంలో దేశీ డిమాండ్‌కి దాదాపు సమాన స్థాయిలో ఉత్పత్తి ఉండేదని ఐసీఏ పేర్కొంది.
రూ. 75,750 కోట్లకు దిగుమతులు..
2012లో రూ. 34,600 కోట్లుగా ఉన్న మొబైల్ ఫోన్ దిగుమతులు 2014లో రూ. 58,550 కోట్లకు చేరినట్లు ఐసీఏ తెలిపింది. ఇది వచ్చే ఏడాది ఏకంగా రూ. 75,750 కోట్లుగా ఉండగలదని అంచనా వేసింది. దేశీ ఐటీ, టెలికం ఎగుమతులకు తోడ్పాటుగా ఉంటున్న మొబైల్ ఫోన్ రంగం పరిస్థితి ఇలా మారడం దురదృష్టకరమని ఐసీఏ జాతీయ ప్రెసిడెంట్ పంకజ్ మహీంద్రూ వ్యాఖ్యానించారు.
అయితే, భారత్‌ను తయారీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రధాని కట్టుబడి ఉన్న నేపథ్యంలో పరిస్థితులు మెరుగుపడగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేశీ కంపెనీలు 2019 నాటికి అంతర్జాతీయ మొబైల్ తయారీ మార్కెట్‌లో 25 సాతం వాటా దక్కించుకునేలా పదేళ్ల ట్యాక్స్ హాలిడే, ఇతర త్రా పన్నుల్లో కొంత వెసులుబాటు మొదలైన చర్యలు తీసుకోవాలని ఐసీఏ సిఫార్సు చేసింది. దీంతో వార్షికంగా 13 లక్షల పైగా అదనంగా ఉద్యోగాల కల్పన జరగగలదని, పరిశ్రమ వార్షిక టర్నోవరు రూ. 1.5-3 లక్షల కోట్ల స్థాయికి చేరగలదని వివరించింది. ప్రస్తుతం 60 శాతంగా ఉన్న దిగుమతులు 10 శాతానికి తగ్గగలవని పేర్కొంది.