రెక్కలుంటేనే పక్షి ఎగురుతుంది. ఆదాయం ఉంటేనే మనిషి గుండె కొట్టుకుంటుంది. సగటు స్త్రీకి పని చేద్దామన్నా ఆదాయ మార్గాలు కనిపించవు. అలాంటి వారిని గౌరి చేరదీసి, శిక్షణ ఇచ్చి, వాళ్ల చేతుల్లో నాలుగు కాసులు గలగలలాడేలా చేస్తున్నారు.
కర్ణాటకలోని చిక్కోడి జిల్లా బెళగవిలో గౌరీ దేశ్‌పాండే మంజ్రేకర్ అనే అమ్మాయి గురించి అక్కడి వారికి బాగా తెలుసు. అందుకే ఆమె ‘2019 ఇండియన్ ఉమెన్ ఎక్స్‌లెన్స్ అండ్ లీడర్‌షిప్’ అవార్డు గెలుచుకోవడం అక్కడ పెద్ద విశేషమేమీ అవలేదు! ‘పంఖ్’ అని ఆమెకో సొంత సేవా సంస్థ ఉంది. ఆ సంస్ధ ద్వారా అవిశ్రాంతంగా అమె అందిస్తున్న సేవలకు గుర్తింపే ఆ ఎక్స్‌లెన్స్ అవార్డు. 2012లో పంఖ్‌ను స్థాపించారు గౌరి. సమాజం నుంచి తీసుకున్నప్పుడు సమాజానికి తిరిగి ఇచ్చేయడం అన్నది ఆ సంస్థ ఆవిర్భావానికి ముందు నుంచే ఆమెకు అలవాటు! మంచి ఉద్యోగం. మంచి జీతం. మంచి తలంపు. నెలనెలా వృద్ధాశ్రమాలకు వెళ్లి తన జీతంలోని కొంతభాగాన్ని ఇస్తుండేవారు గౌరి. అప్పుడే.. ఆమె ఒక బ్యాంకును కూడా నెలకొల్పారు. ‘జాయ్ బ్యాంక్ గ్రూపు’ దాని పేరు. ఎవరైనా, డబ్బులున్నవాళ్లు నేరుగా ఆ బ్యాంకుకు వచ్చి విరాళాలను జమ చేయవచ్చు.
అలా సమకూరిన డబ్బు గౌరీ చేతుల మీదుగా అత్యవసరంలో ఉన్నవాళ్లకు అందుతుంది. ఆ మొత్తం వేలు, లక్షలే అవనక్కర్లేదు. వంద రూపాయల కోసం వచ్చే వాళ్లకు కూడా సహాయం లభిస్తుంది. ఇంతకన్నా పెద్ద పని ఏదైనా చేయాలని గౌరి ఓ రోజు అనుకున్నారు. ఆ ఆలోచనలోంచి వచ్చిందే ‘పంఖ్’. బాగా చదువుకున్న అమ్మాయి. మంచి ఉద్యోగం చేస్తున్న అమ్మాయి. సమాజానికి ఇంకా ఏమైనా చేయాలన్న ఉత్సాహం ఉన్న అమ్మాయి. ఇన్ని ఉన్నాయి కాబట్టి ధైర్యంగా ఉద్యోగం మానేయగలిగారు గౌరి. సమాజంలో ఏదైనా మార్పును కోరుకున్నప్పుడు ఆ మార్పు మొదట తన నుంచి మొదలవ్వాలని ఆమె బలంగా అనుకున్నారు. గాంధీజీ ప్రభావం అది. అనుకున్నదే తడవుగా చిక్కోడిలో ‘పంఖ్ హ్యాండీక్రాఫ్ట్స్’ను ప్రారంభించారు. విద్య, ఉపాధి కల్పన, బలహీన వర్గాలకు సాధికారత.. అనే ఈ మూడు లక్ష్యాలతో పంఖ్ నడవడం మొదలైంది.
మహిళలకు చేతివృత్తులను కూడా ఇందులో నేర్పిస్తున్నారు. రెక్కలుంటేనే పక్షి ఎగురుతుంది. ఆదాయం ఉంటేనే మనిషి గుండె కొట్టుకుంటుంది. సగటు స్త్రీకి పని చేద్దామన్నా ఆదాయ మార్గాలు కనిపించవు. అలాంటి వారిని గౌరి చేరదీసి, శిక్షణ ఇచ్చి, వాళ్ల చేతుల్లో నాలుగు రూపాయలు కదలాడేలా ఆర్థిక స్వావలంబనను, స్వయం సమృద్ధిని అందించారు. చిక్కోడిలో అక్షత తకన్నవర్ అనే బాలిక బోర్డు పరీక్షల్లో పదో ర్యాంకు సాధించింది. మంచి ర్యాంకు తెచ్చుకున్నా కూడా, పేదరికం కారణంగా ఆమె పై చదువులకు వెళ్లలేకపోతున్న విషయాన్ని తెలుసుకున్న గౌరి అమెకు చేయూతనిచ్చి ఉన్నత చదువుల అవకాశం కల్పించారు. ప్రస్తుతం అక్షత రాయ్‌బాగ్ తాలూకాలోని ప్రభుత్వ కార్యాలయంలో అకౌంటెంట్‌గా పని చేస్తోంది. ఇక ఫర్జానా గృహిణి. కుటుంబం నుంచి ఆమెకు ఆర్థిక తోడ్పాటు లేదు. అన్నీ తనే పడాలి. ముగ్గురు పిల్లలు. ఇప్పుడామె ‘పంఖ్’ లో పనిచేస్తోంది. కుటుంబాన్ని పోషించుకుంటూ, పిల్లల్ని చక్కగా చదివించుకుంటోంది. పంఖ్ రెండు స్థాయుల్లో పని చేస్తుంటుంది.
మహిళలకు ఉపాధి కల్పించడం, వారి ఉత్పత్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని సమాజంలో ఆర్థికంగా అట్టడుగున ఉన్న కుటుంబాలలోని పిల్లలకు వినియోగించడం. ‘పంఖ్’ విరాళంగా ఇచ్చే ‘కిడ్డీ ప్యాక్స్’లో బ్లాంకెట్స్, జాకెట్స్, స్కూలు బ్యాగులు, చాప, నేప్‌కిన్, చదువుకోడానికి అవసరమైన స్టేషనరీ ఉంటాయి. ‘మిషన్ మిలియన్ స్మైల్స్’ అనే ప్రాజెక్టు కూడా ఒకటి గౌరి ఆధ్వర్యంలోనే నడుస్తోంది. ఏ ఆసరా లేని పిల్లలకు అన్ని విధాలా చేయందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. పంఖ్‌లో పని చేస్తున్న మహిళలు ప్రధానంగా కొవ్వొత్తులు, పెన్ స్టాండ్స్, లాంతర్లు తయారు చేస్తుంటారు. ఈ కాలంలో ఇంకా వీటి అవసరం ఏమిటని అనిపించవచ్చు. కానీ చిక్కోడి చుట్టుపక్కల మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ ఇవి అత్యవసరమైన సామగ్రి.
వీటన్నిటికీ గౌరీ పెద్దగా ప్రచారం కల్పించుకోలేదు. మంచి పనికి దానంతటదే ప్రచారం లభిస్తుంది. ‘పంఖ్’ గురించి తెలుసుకున్న పారిస్‌లోని భారత రాయబార కార్యాలయం ‘మేకిన్ ఇండియా’ ప్రాజెక్టులో భాగంగా పంఖ్ నుంచి భారీ మొత్తంలో క్యారీబ్యాగులు కొనుగోలు చేసింది. ఆ డబ్బును మళ్లీ మహిళా, శిశు సంక్షేమానికే ఉపయోగిస్తున్నారు గౌరీ. ఇవన్నీ చూస్తుంటే.. ఆమెకు ఇప్పుడు వచ్చిన అవార్డు గురించి గ్రామస్థులకు తెలిసినా, దానికంత ప్రాముఖ్యం ఇవ్వక పోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే వాళ్ల హృదయాలలో గౌరికి అంతకు మించిన స్థానమే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment