కఠిన నిర్ణయాలుంటాయ్‌! | PM narendra modi to lay foundation stone for India International Convention and Expo Centre | Sakshi
Sakshi News home page

కఠిన నిర్ణయాలుంటాయ్‌!

Published Fri, Sep 21 2018 4:03 AM | Last Updated on Fri, Sep 21 2018 5:02 AM

PM  narendra modi to lay foundation stone for India International Convention and Expo Centre - Sakshi

ఢిల్లీ మెట్రో రైలులో ప్రధాని నరేంద్ర మోదీతో సెల్ఫీ దిగుతున్న ప్రయాణికుడు

న్యూఢిల్లీ: జాతీయ ప్రయోజనాల రీత్యా కఠిన నిర్ణయాలు కొనసాగుతాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 2022 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం రెట్టింపై 5 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో తయారీ, వ్యవసాయ రంగాల వాటా చెరో ట్రిలియన్‌ డాలర్ల వరకు ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. మోదీ గురువారం ఢిల్లీలో ఇండియా ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పో సెంటర్‌(ఐఐసీసీ)కు శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతూ.. ఈ సెంటర్‌ భవిష్యత్‌లో పరిశ్రమలు, స్టార్టప్‌లకు కేంద్రంగా నిలుస్తుందని, 5 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించేందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  ఐటీ, రిటైల్‌ రంగాల్లో ఉద్యోగ కల్పన శరవేగంగా పెరుగుతున్న దృష్ట్యా వృద్ధిరేటు 8 శాతం దాటుతుందని పేర్కొన్నారు. దేశ సూక్ష్మ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయని చెప్పారు. మేకిన్‌ ఇండియా, జీఎస్టీ తదితర సంస్కరణలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.  

అన్ని ప్రభుత్వ బ్యాంకులు అవసరమా?..
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నా భారత ఆర్థిక వ్యవస్థ బలం పుంజుకుంటోందని మోదీ అన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నామని, భవిష్యత్తులోనూ అలాంటి చర్యలు కొనసాగుతాయన్నారు. మన ఆర్థిక వ్యవస్థ దశాబ్ద కాలంలో 10 ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేనా బ్యాంకు, విజయా బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాల విలీనాన్ని ప్రస్తావిస్తూ..డజన్ల కొద్దీ ప్రభుత్వ బ్యాంకుల అవసరం ఏముందని ప్రశ్నించారు. బ్యాంకుల విలీనంపై చాలా ఏళ్లుగా చర్చ నడుస్తున్నా తమ ప్రభుత్వ హయాంలోనే ఈ దిశగా ముందడుగు పడిందని తెలిపారు.

మేకిన్‌ ఇండియా పథకంతో భారత్‌ మొబైల్‌ పరిశ్రమకు కేంద్రంగా మారిందని, 4–5 లక్షల మంది యువతకు ఉపాధి దొరకడంతో పాటు రూ.3 లక్షల కోట్ల విలువైన విదేశీ మారక నిల్వలు ఆదా అయ్యాయని తెలిపారు. సులభతర వాణిజ్య విధానాలను ప్రోత్సహించడానికి జిల్లాస్థాయి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. 221.37 ఎకరాల విస్తీర్ణంలో ఐఐసీసీని రూ.25,703 కోట్లతో నిర్మించనున్నారు. 11 వేల మంది కూర్చునే సామర్థ్యం గల కన్వెన్షన్, ఎగ్జిబిషన్, స్టార్‌ హోటళ్లు తదితర వాణిజ్య కేంద్రాలకు ఇందులో చోటు కల్పించనున్నారు.

మోదీని కలసిన ఆశా కార్యకర్తలు..
దేశం నలుమూలల నుంచి వచ్చిన 90 మంది ఆశా కార్యకర్తలతో మోదీ ముచ్చటించారు. తమ గౌరవ వేతనాలు పెంచడంతో పాటు ఉచిత బీమా సదుపాయం కల్పించినందుకు వారు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తాను జరిపిన సంభాషణను మోదీ గుర్తు చేసుకున్నారు. ఆశా కార్యకర్తల సేవలు, అంకితభావాన్ని కొనియాడిన మోదీ..కాలా అజార్‌ వ్యాధి నిర్మూలనకు వారు చేసిన కృషిని బిల్‌ గేట్స్‌ ఫౌండేషన్‌  ప్రశంసించిందని అన్నారు. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఇతర ప్రభుత్వ సంస్థలతో కలసి పనిచేయాలని సూచించారు. పేదరిక నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎలా ఉపయోగపడుతున్నాయో వివరించారు.

మెట్రోలో మోదీ..
కన్వెన్షన్‌ సెంటర్‌ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు మోదీ ఢిల్లీలోని ధౌలాకువాన్‌ నుంచి ద్వారకా వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ ప్రయాణం సుమారు 18 నిమిషాలు సాగిందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ప్రయాణికులు మోదీతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపారు. కార్యక్రమం ముగిసిన తరువాత మోదీ మళ్లీ మెట్రో రైలులోనే తిరుగు ప్రయాణమయ్యారు. ప్రముఖుల రాకపోకలతో రోడ్లపై ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా మోదీ తరచూ మెట్రోరైలు సేవలను వినియోగించుకుంటున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement