Exports of mobile phones
-
మేడిన్ ఇండియా ఐఫోన్ల ఎగుమతులు రూ.45,000 కోట్లు
న్యూఢిల్లీ: దేశం నుంచి మొబైల్ ఫోన్ల ఎగుమతులు 2022–23లో రూ.90,000 కోట్లు నమోదయ్యాయి. ఇందులో ఐఫోన్లను తయారు చేస్తున్న యాపిల్ వాటా ఏకంగా 50 శాతం ఉందని ఇండియా సెల్యులార్, ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) తెలిపింది. శామ్సంగ్ రూ.36,000 కోట్ల ఎగుమతులతో 40 శాతం వాటా కైవసం చేసుకుంది. 2021–22తో పోలిస్తే మొబైల్స్ ఎక్స్‌పోర్ట్స్ రెండింతలయ్యాయి. భారత్ నుంచి విదేశాలకు చేరిన ఎలక్ట్రానిక్స్ 58 శాతం అధికమై గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,85,000 కోట్లకు చేరుకున్నాయి. మొబైల్స్ ఎగుమతుల విషయంలో గత ఆర్థిక సంవత్సరానికి లక్ష్యంగా చేసుకున్న రూ.75,000 కోట్లను అధిగమించడం ఆనందంగా ఉందని ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మొహింద్రూ తెలిపారు. భారత్ నుంచి విదేశాలకు చేరుతున్న మొత్తం ఎలక్ట్రానిక్స్‌లో మొబైల్స్ వాటా 46 శాతంగా ఉంది. -
చైనా ఫోన్లపై నిషేధం లేదు: కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్
న్యూఢిల్లీ: భారత్ నుంచి ఎగుమతులు పెంచుకోవాలని చైనా మొబైల్ ఫోన్ కంపెనీలను కేంద్ర ప్రభుత్వం కోరింది. రూ.12,000లోపు విలువ చేసే చైనీ ఫోన్ల విక్రయాలపై నిషేధ ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. దేశీ ఎలక్ట్రానిక్ ఎకోసిస్టమ్‌లో భారత కంపెనీలకు కీలక పాత్ర ఉందంటూ, దీనర్థం విదేశీ బ్రాండ్లను మినహాయించడం కాదన్నారు. ‘‘మరిన్ని ఎగుమతులు పెంచుకోవాలని చైనా బ్రాండ్ల వద్ద మేము పారదర్శకంగా ప్రస్తావించాం. వాటి సప్లయ్ చైన్, ముఖ్యంగా విడిభాగాల సరఫరా వ్యవస్థ మరింత పారదర్శకంగా, స్వేచ్ఛాయుతంగా ఉండాలి’’అని రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. రూ.12 వేల లోపు ఫోన్లకు చైనా కంపెనీలను దూరం పెట్టాలన్న ప్రతిపాదన ఎక్కడి నుంచి వచ్చిందో తనకు తెలియదన్నారు. 2025–26 నాటికి 300 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్ తయారీ, 120 బిలియన్ డాలర్ల ఎగుమతులను చేరుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు. ప్రస్తుత ఉత్పత్తి 76 బిలియన్ డాలర్లుగా ఉంది. -
మొబైల్ ఫోన్ ఎగుమతులు మూడు రెట్లు
న్యూఢిల్లీ: భారత్ మొబైల్ ఫోన్ ఎగుమతుల విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (2021–22, ఏప్రిల్–జూన్)లో మూడు రెట్లు పెరిగింది. రూ.4,300 కోట్లుగా నమోదయ్యింది. 2020 ఇదే కాలంలో ఎగుమతుల విలువ దాదాపు రూ.1,300 కోట్లు. ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) ఒక నివేదికలో ఈ విషయాలను తెలిపింది. ఈ రంగంలో రికవరీ, వృద్ధి అంశాలను తాజా గణాంకాలు సూచిస్తున్నట్లు నివేదిక వివరించింది. నివేదికలో ముఖ్యాంశాలు ►మొబైల్ హ్యాండ్సెట్ తయారీ పరిశ్రమ నిరంతరం వృద్ధి పథంలో కొనసాగుతోంది. కోవిడ్–19 సెకండ్‌వేవ్‌లోనూ ఫలితాలను నమోదుచేసుకుంది. ►ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎగుమతులు సైతం మొదటి త్రైమాసికంలో 100 శాతం పెరిగి విలువలో రూ.20,000 కోట్లను అధిగమించింది. ►ఇక ఇదే కాలంలో మొబైల్ ఫోన్ల దిగుమతుల విలువ భారీగా తగ్గి రూ.3,100 కోట్ల నుంచి రూ.600 కోట్లకు పతనమైంది. 2014–15 అల్‌టైమ్ కనిష్ట స్థాయి ఇది. ►కాగా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్ల దిగుమతుల విలువ మాత్రం మొదటి త్రైమాసికంలో 50 శాతంపైగా పెరిగి రూ.6,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్లకు ఎగసింది. మరింత పురోగతికి చర్యలు... మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ రంగంలో మరింత పురోగతి సాధించడానికి కృషి చేస్తున్నాం. ఇందుకు తగిన విధాన కల్పనకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. భారీగా ఈ విభాగాల్లో ఉత్పత్తులను పెంచాలన్నది ప్రధాన లక్ష్యం. ప్రపంచ దేశాల్లో అవసరాల్లో 25 శాతం భారత్ వాటా కావాలన్నది సంకల్పం. – పంకజ్ మొహింద్రూ, ఐసీఈఏ చైర్మన్ చదవండి : ఏడాదిలో మరింత పెరగనున్న ఇళ్ల ధరలు! -
వచ్చే ఏడాది మొబైల్ ఎగుమతులు నిల్
పెరిగిపోతున్న దిగుమతులు దేశీయంగా తగ్గిపోతున్న ఉత్పత్తి సెల్యులార్ అసోసియేషన్ నివేదిక న్యూఢిల్లీ: ఒకవైపు మేకిన్ ఇండియా నినాదంతో దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీకి ఊతమిచ్చేలా కేంద్రం కసరత్తు చేస్తుంటే మరోవైపు అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాదిలో మొబైల్ ఫోన్ల ఎగుమతులు పూర్తిగా సున్నా స్థాయికి పడిపోనున్నాయని భారతీయ సెల్యులార్ అసోసియేషన్ (ఐసీఏ) ఒక నివేదికలో పేర్కొంది. పన్ను వివాదం కారణంగా తమిళనాడులో నోకియా మొబైల్ ఫోన్ ప్లాంటు మూతబడటం కూడా ఎగుమతుల క్షీణతకు కారణమని తెలిపింది. నివేదిక ప్రకారం 2014లో మొబైల్ మార్కెట్ 32 శాతం పెరిగి 12 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. అయితే, దేశీయంగా ఉత్పత్తి 29 శాతం క్షీణించి... మూడొంతుల మార్కెట్‌ను దిగుమతులే ఆక్రమిస్తాయి. 2012లో గరిష్టంగా రూ. 12,000 కోట్ల స్థాయిని తాకిన ఎగుమతులు అప్పట్నుంచీ 70 శాతం క్షీణతతో ఈ ఏడాది రూ. 2,450 కోట్లకు పరిమితం కానున్నాయి. తక్షణం తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే వచ్చే ఏడాది అసలు మొబైల్ ఫోన్ల ఎగుమతులే ఉండబోవని కేంద్రానికి సమర్పించిన నివేదికలో ఐసీఏ తెలిపింది. గతంలో దేశీయంగా ఎలక్ట్రానిక్ మొబైల్ మార్కెట్లో దిగుమతులదే హవా ఉన్నప్పటికీ, ఎగుమతులు కూడా చెప్పుకోతగ్గ స్థాయిలో ఉండటం వల్ల వాణిజ్య లోటు ఒక మోస్తరు స్థాయికి పరిమితమయ్యేదని ఐసీఏ వివరించింది. 2013-14లో టెలికం విభాగంలో వాణిజ్య లోటు రూ. 49,041 కోట్లుగా నమోదైంది. ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు అత్యంత తక్కువగా ఉండగా.. మొబైల్ రంగం తయారీ, ఎగుమతులు మాత్రమే ఆదుకున్నాయి. నిజానికి 2008-12 మధ్య కాలంలో దేశీ డిమాండ్‌కి దాదాపు సమాన స్థాయిలో ఉత్పత్తి ఉండేదని ఐసీఏ పేర్కొంది. రూ. 75,750 కోట్లకు దిగుమతులు.. 2012లో రూ. 34,600 కోట్లుగా ఉన్న మొబైల్ ఫోన్ దిగుమతులు 2014లో రూ. 58,550 కోట్లకు చేరినట్లు ఐసీఏ తెలిపింది. ఇది వచ్చే ఏడాది ఏకంగా రూ. 75,750 కోట్లుగా ఉండగలదని అంచనా వేసింది. దేశీ ఐటీ, టెలికం ఎగుమతులకు తోడ్పాటుగా ఉంటున్న మొబైల్ ఫోన్ రంగం పరిస్థితి ఇలా మారడం దురదృష్టకరమని ఐసీఏ జాతీయ ప్రెసిడెంట్ పంకజ్ మహీంద్రూ వ్యాఖ్యానించారు. అయితే, భారత్‌ను తయారీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రధాని కట్టుబడి ఉన్న నేపథ్యంలో పరిస్థితులు మెరుగుపడగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేశీ కంపెనీలు 2019 నాటికి అంతర్జాతీయ మొబైల్ తయారీ మార్కెట్లో 25 సాతం వాటా దక్కించుకునేలా పదేళ్ల ట్యాక్స్ హాలిడే, ఇతర త్రా పన్నుల్లో కొంత వెసులుబాటు మొదలైన చర్యలు తీసుకోవాలని ఐసీఏ సిఫార్సు చేసింది. దీంతో వార్షికంగా 13 లక్షల పైగా అదనంగా ఉద్యోగాల కల్పన జరగగలదని, పరిశ్రమ వార్షిక టర్నోవరు రూ. 1.5-3 లక్షల కోట్ల స్థాయికి చేరగలదని వివరించింది. ప్రస్తుతం 60 శాతంగా ఉన్న దిగుమతులు 10 శాతానికి తగ్గగలవని పేర్కొంది.