ప్రాజెక్టుల జాప్యానికి బ్యూరోక్రసీనే కారణం కాదు
మేకిన్ ఇండియా వారోత్సవంలో కేంద్ర మంత్రి గడ్కరీ వ్యాఖ్యలు
ముంైబె : ప్రాజెక్టులకు అనుమతులివ్వడంలో జాప్యానికి పూర్తిగా బ్యూరోక్రసీనే తప్పు పట్టలేమని, వాటి అమలుకు రాజకీయ మద్దతు కూడా అవసరమని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రాజెక్టుల జాప్యానికి బ్యూరోక్రసీ కారణమని తాను కూడా వివిధ వేదికలపై వ్యాఖ్యానించిన సంగతి వాస్తవమేనని, కానీ ప్రతీసారి వ్యవస్థనే తప్పు పట్టం సరికాదన్నది తన అభిప్రాయమని పేర్కొన్నారు. మేకిన్ ఇండియా వారోత్సవంలో భాగంగా రహదారులు, హైవేలపై సెమినార్‌లో పాల్గొన్న సందర్భంగా గడ్కరీ ఈ విషయాలు తెలిపారు. ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసేందుకు కొత్త టెక్నాలజీనో.. విధానాలనో అమలు చేసిన ప్రతిసారి విమర్శలు రావడమో లేక వివిధ వర్గాల నుంచి మద్దతు లేకపోవడమో జరుగుతోందన్నారు.
ఎఫ్‌టీఏలతో మేకిన్ ఇండియాకు కష్టం..
వివిధ దేశాలతో ఎడా పెడా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ) కుదుర్చుకుంటూ వెడితే మేకిన్ ఇండియా నినాదానికి విఘాతం కలుగుతుందని దేశీ ఆటోమొబైల్ పరికరాల తయారీ కంపెనీలు హెచ్చరించాయి. ఈ ఎఫ్‌టీఏల వల్ల సమాన అవకాశాలు దక్కకుండా పోతే దేశీ పరిశ్రమ పోటీ పడలేక, కుదేలవుతుందని ఆటో పరికరాల తయారీ సంస్థల అసోసియేషన్ ప్రెసిడెంట్ అరవింద్ బాలాజీ కార్యక్రమంలో చెప్పారు.
ఫోక్స్‌వ్యాగన్ కార్ల నుంచి తీవ్ర ‘కాలుష్యం’: గీతే
జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ కార్ల నుంచి కాలుష్య ఉద్గారాలు పరిమితికి మించి తొమ్మిది రెట్లు అధికంగా వెలువడుతున్నట్లు తేలిందని భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్ గీతే చెప్పారు. దీనికి సంబంధించి ఫోక్స్‌వ్యాగన్‌పై తగు చర్యలు తీసుకోవాలని రహదారుల రవాణా శాఖను కోరినట్లు ఆయన వివరించారు.
కర్ణాటకకు 10వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు..
మేకిన్ ఇండియా వీక్ సందర్భంగా తమ రాష్ట్రానికి రూ. 10,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయని కర్ణాటక తెలిపింది. ఫ్రాన్స్‌కి చెందిన టార్‌కోవాక్స్ సిస్టమ్స్ గ్రూప్, అమెరికాకు చెందిన మెకార్మిక్ ఇంగ్రీడియంట్స్ తదితర సంస్థల ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయని వివరించింది.