ఎయిర్ బస్ భారత్ కార్యకలాపాలకు ఒకే సంస్థ
న్యూఢిల్లీ: భారత్‌లో వ్యాపార విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తేవాలని ఏవియేషన్ దిగ్గజం ఎయిర్‌బస్ గ్రూప్ నిర్ణయించింది. ఎయిర్‌బస్ గ్రూప్ ఇండియా పేరుతో ఏర్పాటయ్యే ఈ సంస్థకు పియర్ డి బాసెట్ సారథ్యం వహిస్తారని వెల్లడించింది. ఇలా స్థానిక కార్యకలాపాలన్నింటినీ ఒకే సంస్థ కిందికి తేవడమనేది మొట్టమొదటిసారిగా భారత్‌లోనే చేపట్టామని, ఇది తమ ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమానికి కూడా దోహదపడగలదని భావిస్తున్నామని ఎయిర్‌బస్ గ్రూప్ పేర్కొంది. భారత్‌ను తమ గ్రూప్ ఇంజనీరింగ్, ఇన్నోవేషన్ కార్యకలాపాలకు హబ్‌గా తీర్చిదిద్దుకునేందుకు పుష్కలంగా అవకాశాలున్నాయని బాసెట్ తెలిపారు. ఇప్పటికే తమ అంతర్జాతీయ కార్యకలాపాల్లో భారత విభాగం కీలకపాత్ర పోషిస్తోందని ఆయన తెలియజేశారు. దాదాపు 61 బిలియన్ డాలర్ల గ్రూప్‌లో ఎయిర్‌బస్, ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్, ఎయిర్‌బస్ హెలికాప్టర్స్ భాగంగా ఉన్నాయి.