న్యూఢిల్లీ: ఆర్మీ కోసం ఎయిర్‌బస్ సీ-295 ట్రాన్స్‌పోర్ట్ విమానాలను దేశంలో తొలిసారి ఓ ప్రైవేటు సంస్థ తయారు చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌లో ఎయిర్‌బస్ సీ-295 ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ కేంద్రం ఏర్పాటు కాబోతోంది. సుమారు రూ.22,000 కోట్లతో వడోదరలో దీన్ని నెలకొల్పనున్నట్లు రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ తెలిపారు.
‘సైనిక ఎయిర్‌క్రాఫ్ట్‌ను ప్రైవేట్ కంపెనీ భారత్‌లో తయారు చేయనున్న తొలి ప్రాజెక్ట్ ఇదే. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.21,935 కోట్లు. ఈ విమానాలను పౌర రవాణాకు సైతం ఉపయోగిస్తాం.’ అని తెలిపారు రక్షణ శాఖ సెక్రెటరీ డాక్టర్ అజయ్ కుమార్. ఈ ప్రాజెక్టుకు అక్టోబర్ 30న ఆదివారం ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. యూరప్ వెలుపల సీ-295 విమానాలను తయారు చేయడం ఇదే తొలిసారి అని అజయ్ కుమార్ పేర్కొన్నారు. మరోవైపు.. గుజరాత్ ఎన్నికల వేళ వేలాది ఉద్యోగులు కల్పించే భారీ ప్రాజెక్టును ప్రారంభించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
భారత వాయుసేనలోని పాత ఏవీఆర్‌ఓ-748 ఎయిర్‌క్రాఫ్ట్‌ల స్థానంలో ఎయిర్‌బస్‌కు చెందిన సీ-295 విమానాలను ప్రవేశపెట్టేందుకు కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం 56 విమానాలను అందించేందుకు ఎయిర్‌బస్‌తో రూ.21వేల కోట్లకు ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా నాలుగేళ్లలో 16 విమానాలను ‘ఫ్లై అవే’ కండీషన్‌లో ఎయిర్‌బస్ భారత్‌కు అందజేస్తుంది. మిగిలిన 40 విమానాలను టాటా గ్రూప్‌నకు చెందిన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ తయారీ, అసెంబ్లింగ్ చేపడుతుంది. ఈ ఒప్పందానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎరోనాటికల్ క్వాలిటీ అస్యూరెన్స్ గత వారమే ఆమోదం తెలిపింది.
ఇదీ చదవండి: దెయ్యంలాంటి రూపంతో ఫేమస్.. అసలు ముఖం మాత్రం ఇది!
Comments
Please login to add a commentAdd a comment