క్షమాపణలు చెప్పిన దిగ్విజయ్
విజయవాడ : అనంతపురం జిల్లాలో రాహుల్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్రెడ్డికి దిగ్విజయ్ సింగ్ క్షమాపణలు చెప్పారు. శుక్రవారం విజయవాడలో అధునీకరించిన నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్తో కోట్ల భేటీ అయ్యారు. ఈ నెల మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా అనంతలో జరిగిన అవమానాన్ని కోట్ల ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్కి వివరించారు. దీంతో దిగ్విజయ్ సింగ్... కోట్లకు క్షమాపణలు చెప్పారు.
ఆ తర్వాత ఆంధ్రరత్న భవన్లో కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ భేటీ అయింది. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు, పార్టీ వ్యవహారాలపై నేతలు చర్చించారు. ఈ భేటీలో ఏపీపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యులు జేడీ శీలం, కేవీపీ రామచంద్రరావు, మాజీ కేంద్రమంత్రులు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, పనబాకలక్ష్మీతోపాటు పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఆ రాష్ట్ర వ్యవహారాలన్నీ హైదరాబాద్లోని ఇందిరా భవన్ నుంచి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ నుంచి రాష్ట్రంలోని 13 జిల్లాలకు పార్టీ నాయకులు వెళ్లి రావడం కొంత ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో విజయవాడలోనే పీసీసీ కార్యాలయం ఏర్పాటు చేసుకుంటే మంచిది అన్న భావన కలగడంతో సదరు నేతలు ఆ అంశంపై దృష్టి కేంద్రీకరించారు.
అందులోభాగంగా ఇప్పటి వరకు విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా ఉన్న ఆంధ్రరత్న భవన్ను ఇకపై ఏపీపీసీసీ కార్యాలయంగా రూపుదిద్దేందుకు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో ఆంధ్రరత్న భవన్లో పలు పనులకు శ్రీకారం చుట్టి అధునీకరించారు. ఆ కార్యాలయాన్ని దిగ్విజయ్ సింగ్ నేడు ప్రారంభించారు.