దిన‘ధన’ గండం
సాక్షి ప్రతిని«ధి, ఏలూరు : పెద్దనోట్లు రద్దు అయిన నెల తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పులేదు. ప్రజల కష్టాలు తగ్గలేదు. సామాన్యుల పరిస్థితి దినదినగండంగా మారింది. బ్యాంకుల ముందు నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. అధికశాతం ఏటీఎంలు మూతపడే ఉంటున్నాయి. ఫలితంగా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పలుచోట్ల వారు రోడ్డెక్కి ఆందోళనకు దిగాల్సిన దుస్థితి నెలకొంది. తాజాగా గురువారం యలమంచిలి, కైకరం బ్యాంకుల్లో నగదు నిల్వలు నిండుకోవడంతో ఖాతాదారులు ఆందోళనకు దిగారు. కైకరం స్టేట్ బ్యాంక్‌లో రెండురోజు గురువారం కూడా డబ్బులు లేవనే బోర్డు పెట్టడంతో ఖాతాదారులు ఆగ్రహం వ్యక్త ం చేసి రోడ్డు ఎక్కారు. మేనేజర్‌గానీ, సిబ్బందిగానీ స్పష్టమైన సమాధానం చెప్పలేకపోవటంతో ఖాతాదారులు ఆగ్రహంతో జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. రాస్తారోకో వల్ల ట్రాఫిక్ జామ్ కావడంతో ఉంగుటూరు తహసీల్దార్, చేబ్రోలు ఎస్‌ఐలు వచ్చి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. బ్యాంకులో డబ్బులు ఉన్నా తీసుకోవడానికి బ్యాంకర్లు ఇబ్బంది పెడుతున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కూలి పనులకు డబ్బులు ఇవ్వలేకపోవడంతో వారు పనికి రావడానికి ఇష్టపడడం లేదని, ఇలా అయితే రబీలో పంట వేసినట్లేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ‘ధాన్యం డబ్బులు బ్యాంకులో పడ్డాయి. మా డబ్బులు తీసుకోవడానికి కూడా వీలులేకుండా పోయింది. బాకీదారులు మా ఇళ్ల చుట్టూతిరుగుతున్నారు’ అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బుల కోసం తామూ పనులు మానుకుని పెద్ద సంఖ్యలో బ్యాంకుల ముందు క్యూ కట్టాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎనిమిదో తేదీ వచ్చినా పింఛను సొమ్ములు అందకపోవడంతో వృద్ధులు ఆందోళ చెందుతున్నారు. పింఛను పడని వారికి ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా వారికి సరైన సమాచారం లేక ఆందోళనగా బ్యాంకులు, పంచాయతీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇదివరకు ఒకటో తేదీనే పింఛ¯ŒS వచ్చేది. ఇప్పుడు ఎనిమిదో తేదీకి కూడా రాకపోవడంతో అసలు వస్తుందా రాదా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు జిల్లాలో పెద్ద ఎత్తున దొంగనోట్లు చలామణి అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నోట్ల రద్దుతో చాలా వరకు పెద్ద నోట్లు బ్యాంక్ ఖాతాల్లోకి చేరుకోగా.. ప్రస్తుతం చలామణీలో ఉన్న దొంగనోట్లును కొంతమంది వ్యక్తులు కార్మికులు, వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులకు గుట్టుచప్పుడు కాకుండా వారి కూలీ డబ్బులు కింద చలామణీలో పెడుతున్నట్లు పలువురు చెబుతున్నారు. ఈనెల 6వ తేదీ నుంచి రేష¯ŒSషాపులను మినీ బ్యాంకులుగా మారుస్తున్నామని రేష¯ŒS డీలర్లను బ్యాంకు కరస్పాండెంట్లుగా మార్చి బ్యాంకింగ్ కార్యకలాపాలన్నీ నిర్వహింప చేస్తామని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చేసిన ప్రకటన ఇంతవరకూ అమలులోకి రాలేదు.