డిప్లొమా అభ్యర్థులకు మొండిచెయ్యి
- పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో గందరగోళం..
- దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించని అధికారులు
- కాల్ లెటర్లు పంపిన తర్వాత అభ్యంతరాలేంటి?
- నిరాశతో వెనుదిరిగిన అభ్యర్థులు
13ఏఎన్‌జీ04ఏ– గోడు వెల్లబోసుకుంటున్న బాధిత అభ్యర్థి గంగాధర్
13ఏఎన్‌జీ04బీ– దేహదారుఢ్యపరీక్షలకు హాజరుకావాలని గంగాధర్‌కు పంపిన కాల్‌లెటర్
అనంతపురం సెంట్రల్ : పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రాథమిక పరీక్షల్లో అర్హత సాధించిన డిప్లొమా అభ్యర్థులను దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఎంతో ఆశతో వచ్చిన అభ్యర్థులను పోలీసు అధికారులు నిర్మొహమాటంగా వెనక్కు పంపారు. బాధితుని కథనం మేరకు.... హిందూపురం మండలం పత్తికుంటపల్లికి చెందిన సంజప్ప కుమారుడు ఉప్పర గంగాధర డిప్లొమా పూర్తి చేశాడు. పోలీస్ కానిస్టేబుల్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. హాల్ టికెట్ నంబర్ 1010192. ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించడంతో దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకావాలని అధికారులు కాల్‌లెటర్ పంపారు. దీంతో మంగళవారం నగరంలోని నీలం సంజీవరెడ్డి స్టేడియం (పీటీసీ)లో ఫిజికల్ మెజర్మెంట్(పీఎంటీ), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ)లకు హాజరయ్యాడు. అయితే దరఖాస్తు సమయంలో ప్రాథమిక పరీక్షల్లో ఎలాంటి అభ్యంతరం చేయని అధికారులు.. దేహదారుడ్య పరీక్షలకు అనుమతించకపోవడంతో బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. పోలీసు కానిస్టేబుల్ పోస్టు కోసం ప్రత్యేకంగా కోర్సు తీసుకొని ప్రాథమిక పరీక్షల్లో అర్హత సాధించానని, ఇప్పుడు అభ్యంతరం చెబితే ఎలా అని ప్రశ్నించాడు. డిప్లొమా కోర్సు ఇంటర్‌తో సమానం కాబట్టి తమకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కాగా డిప్లొమా అభ్యర్థులను పదుల సంఖ్యలో వెనక్కు పంపినట్లు పోలీసు అధికారవర్గాలు తెలిపాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిప్లొమా అభ్యర్థులకు అవకాశం కల్పించలేదని సమాచారం.