మళ్లీ దగా!
మళ్లీ దగా!
Published Thu, Aug 11 2016 12:27 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
► వాతావరణ బీమా మంజూరులో తీవ్ర అన్యాయం
► 39 మండలాలకు నయాపైసా మంజూరు కాని వైనం
► 24 మండలాల్లో 1.85 లక్షల మందికి రూ.109.66 కోట్లు మంజూరు
► ప్రీమియం రూపంలో రూ.115.60 కోట్లు కట్టిన 5.08 లక్షల మంది రైతులు
► కట్టిన ప్రీమియం కన్నా తక్కువ పరిహారం మంజూరు
కరువు కోరల్లో చిక్కుకున్న ‘అనంత’ రైతులకు మరోసారి అన్యాయం జరిగింది. వాతావరణ బీమా పథకం వల్ల 2011 నుంచి దారుణంగా మోసపోతున్న రైతులు ఈ సారి కూడా వంచనకు గురయ్యారు. ప్రీమియం రూపంలో పెద్దమొత్తంలో గుంజుతున్న బీమా కంపెనీ.. పరిహారం విషయంలో మాత్రం చిల్లర విదిల్చుతోంది. 2015 ఖరీఫ్ పంట నష్టానికి సంబంధించి 1,85,194 మంది రైతులకు కేవలం రూ.109.66 కోట్లు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అనంతపురం అగ్రికల్చర్:
పంటల బీమా స్థానంలో అమలు చేస్తున్న వాతావరణ బీమా పథకం జిల్లా రైతులకు ఏమాత్రమూ భరోసా ఇవ్వలేకపోతోంది. ప్రతియేటా మాదిరే ఈసారీ అన్నదాతలను ఆదుకోలేకపోయింది. గత ఏడాది జిల్లా వ్యాప్తంగా 5,08,868 మంది రైతులు రూ.115.60 కోట్ల ప్రీమియం చెల్లించారు. పరిహారం మాత్రం కేవలం 24 మండలాలకు మంజూరైంది. 1,85,194 మందికి రూ.109.66 కోట్లు మంజూరు చేస్తూ బుధవారం బీమా కంపెనీ ఉత్తర్వులిచ్చింది.
39 మండలాల పరిధిలోని 3,23,674 మందికి నయాపైసా మంజూరు చేయలేదు. మంజూరైన వాటిలోనూ అత్యధికంగా కనగానపల్లి మండలానికి రూ.17.59 కోట్లు, ధర్మవరం మండలానికి రూ.12.20 కోట్లు ఇచ్చింది. అత్యల్పంగా లేపాక్షి మండలానికి రూ.63.32 లక్షలు మాత్రమే మంజూరు చేసింది. అగళి, అమడగూరు, అనంతపురం, బత్తలపల్లి, బుక్కపట్నం, బుక్కరాయసముద్రం, చెన్నేకొత్తపల్లి, చిలమత్తూరు, గాండ్లపెంట, గార్లదిన్నె, గుత్తి, గోరంట్ల, గుడిబండ, గుంతకల్లు, కదిరి, కళ్యాణదుర్గం, కంబదూరు, కణేకల్లు, కొత్తచెరువు, ముదిగుబ్బ, నల్లచెరువు, నల్లమాడ, ఎన్‌పీ కుంట, నార్పల, ఓడీ చెరువు, పామిడి, పెనుకొండ, పుట్లూరు, రామగిరి, రాయదుర్గం, రొళ్ల, శెట్టూరు, శింగనమల, తాడిమర్రి, తాడిపత్రి, తలుపుల, తనకల్లు, యాడికి, యల్లనూరు మండలాలకు పరిహారం మంజూరు కాలేదు. రైతులకు జరిగిన అన్యాయంపై ఉద్యమించడానికి రైతులు, రైతు సంఘాలు, విపక్షాలు సిద్ధమవుతున్నాయి.
Advertisement