జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు జిల్లా వాసులు
Published Fri, Jul 22 2016 12:20 AM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM
– రికార్డు స్థాయిలో నలుగురి ఎంపికS
– ఆగస్టు 5 నుంచి పంజాబ్‌లో జాతీయ పోటీలు
– రేపటి నుంచి అనంతపురంలో శిక్షణ శిబిరాలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు శ్రీకాకుళం జిల్లా నుంచి రికార్డు స్థాయిలో నలుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. పంజాబ్‌లోని జలందర్‌లో లౌలీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఆగస్ట్ 5 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించే జాతీయ జూనియర్ బాలబాలికల సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలకు జిల్లా నుంచి నలుగురు ప్రాతినిధ్యం వహించనున్నారు. వీరంతా ఆంధ్రా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు. వీరిలో బాలుర జట్టుకు సీహెచ్ గోవిందరావు (జెడ్పీహెచ్‌స్కూల్, ఇప్పిలి), కె.విక్రమ్ (జెడ్పీహెచ్‌స్కూల్, చిన్నబాడాం), జి.నర్సింహనాయుడు (జెడ్పీహెచ్‌స్కూల్, తొగరాం) ఎంపికయ్యారు. బాలికల జట్టుకు కమిలీ గౌడో (జెడ్పీహెచ్‌స్కూల్, మందస) ఎంపికైంది. వీరంతా ఈనెల 8 నుంచి 10వ తేదీ వరకు శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా జరిగిన 3వ రాష్ట్రస్థాయి జూనియర్ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. ఈ మీట్‌లో సిక్కోలు బాలుర జట్టు 3వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.
రేపటి నుంచి శిక్షణ శిబిరాలు
ఇదిలా ఉండగా ఈ పోటీలకు ముందు ఆంధ్రా జట్టుకు ఎంపికైన క్రీడాకారులకు అనంతపురం జిల్లాలోని ఆర్‌డీటీ స్టేడియంలో ఈనెల 23 నుంచి పది రోజులపాటు నిర్వహించే శిక్షణ శిబిరాలకు వీరంతా హాజరవుతున్నారు. ఇందుకోసం గురువారం ఇక్కడ నుంచి పయనమయ్యారు. వీరికి సంఘ ప్రతినిధులు వీడ్కోలు పలికారు. శిబిరాల్లో కఠోర సాధన చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ పోటీల్లో ఆంధ్రరాష్ట్ర జట్టు ముందంజలో నిలిపేలా సర్వశక్తులూ ఒడ్డాలని సూచించారు. కాగా, జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు జిల్లా నుంచి నలుగురు క్రీడాకారులు ఎంపిక కావడం పట్ల జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ చైర్మన్, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, అధ్యక్షుడు బడగల హరిధరరావు, కన్వీనర్ కె.సురేష్‌కుమార్ గుప్త, ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటరమణ, ప్రతినిధులు కె.రవికుమార్, ఎం.ఆనంద్‌కిరణ్, సతీష్‌రాయుడు, రాజశేఖర్, జిల్లా ఒలింపిక్ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు ధర్మాన కృష్ణదాస్, పి.సుందరరావు, డీఎస్‌డీఓ బి.శ్రీనివాస్‌కుమార్, జిల్లా పీఈటీ సంఘ ప్రతినిధులు పోలినాయుడు, సాంబమూర్తి, రాజారావు, సూరిబాబు, శేఖర్, పీఈటీలు హర్షం వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement