
జిల్లాస్థాయి ఇన్‌స్పైర్–2016 ప్రారంభం
పెడన టౌన్ (మచిలీపట్నం) : సాంకేతికతను అందిపుచ్చుకుని విద్యార్థులు అత్యున్నత స్థానానికి ఎదగాలని పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు అన్నారు. పెడనలోని సెయింట్ విన్సెంట్ పల్లోటి ఇంగ్లీషు మీడియం ఉన్నత పాఠశాలలో గురువారం ఇన్‌స్పైర్ –2016 వైజ్ఞానిక ప్రదర్శనను ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణతో కలిసి ఆయన ప్రారంభించారు. పట్టుదల, కృషి, ధృడసంకల్పంతో చదివితే ఉన్నత స్థానానికి ఎదిగేందుకు పేదరికం అడ్డురాదన్నారు. 2010లో ప్రారంభమైన ఇన్‌స్పైర్ కార్యక్రమం విద్యార్థుల్లో నిబిడికృతమైన ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు వేదికగా మారిందన్నారు. ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ మాట్లాడుతూ విద్య అంటే కేవలం మార్కుల సాధనే కాదని, జ్ఞానం, నూతన పరిశోధనల పట్ల జిజ్ఞాస పెంచుకోవటమన్నారు. విద్యార్థులు స్వేచ్ఛగా ఆలోచించే విధంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మార్గదర్శనం చేయాలని సూచించారు. డీఈవో ఎ.సుబ్బారెడ్డి మాట్లాడుతూ రెండు రోజులపాటు జరగనున్న ఇన్‌స్పైర్–2016 వైజ్ఞానిక ప్రదర్శనకు జిల్లావ్యాప్తంగా 250 ప్రదర్శనలు ఉన్నాయన్నారు. వీటిలో ఉత్తమ ప్రదర్శనలను ఎంపిక చేసి రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు పంపనున్నట్లు చెప్పారు. తొలుత నిండుగా దీవెనలు ఇచ్చిన దేవునికి స్తోత్రం అంటూ సెయింట్ విన్సెంట్ పల్లోటి స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన స్వాగతగీతం ఆకట్టుకుంది. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఈడ్పుగంటి వెంకట్రామయ్య, మునిసిపల్ చైర్మన్ బండారు ఆనందప్రసాద్, వైస్‌చైర్మన్ అబ్ధుల్ ఖయ్యూం, మునిసిపల్ కమిషనర్ ఎం గోపాలరావు, ఎస్‌ఈఆర్‌టీ ప్రొఫెసర్ వనజాక్షి, మచిలీపట్నం, గుడివాడ డీవైఈవోలు గిరికుమారి, జి వెంకటేశ్వరరావు, పల్లోటి స్కూల్ కరస్పాండెంట్ ఫాదర్ జోజప్ప తదితరులు పాల్గొన్నారు.