సాక్షి, మచిలీపట్నం: టీడీపీ నేత బూరగడ్డ వేదవ్యాస్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. సర్వత్రిక ఎన్నికల్లో పెడన అసెంబ్లీ టికెట్ దక్కకపోవడంతో ఆయనతో పాటు అనుచరులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. కాగిత కృష్ణ ప్రసాద్‌కు టికెట్ కేటాయించడంతో చంద్రబాబును నమ్మి పార్టీలోకి వస్తే మరోసారి మోసం చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. వేదవ్యాస్ పెడన టికెట్ ఆశిస్తుండగా ఆయనకు కాకుండా కాగిత కృష్ణప్రసాద్‌కు చంద్రబాబు కేటాయించారు. దీంతో బూరగడ్డ తీవ్ర మనోవేదనతో అనారోగ్యానికి గురయ్యారు. హై బీపీతో రెండు వారాల క్రితం హైదరాబాదు లోని ఆస్పత్రిలో చేరి, చికిత్స పొంది ఇటీవలే డిశ్చార్జి అయ్యారు. ఇప్పటికీ పూర్తి స్థాయిలో కోలుకోని ఆయన విశ్రాంతిలో ఉన్నారు.
వారసత్వంగా రాజకీయాల్లోకి..
బూరగడ్డ తండ్రి బూరగడ్డ నిరంజనరావు గతంలో మల్లేశ్వరం నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన వారసుడిగా వేదవ్యాస్ 1989లో కాంగ్రెస్ తరఫున కాగిత వెంకట్రావుపై గెలిచి అసెంబ్లీలో డెప్యూటీ స్పీకర్‌గా, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా సేవలు అందించారు. 2004 ఎన్నికల్లో గెలిచి, అసెంబ్లీ పద్దుల కమిటీ చైర్మన్‌గా చేశారు. 2009లో పెడన నియోజకవర్గం ఏర్పడింది. వేదవ్యాస్ ప్రజా రాజ్యం పార్టీలో చేరి, మచిలీపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైఎస్సార్ సీపీ పెడన అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
టికెట్ లేదని తీవ్ర ఆందోళన
2018 వరకు వైఎస్సార్ సీపీలో ఉన్న వేదవ్యాస్ టీడీపీలో చేరారు. అప్పట్లో ఆయన మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) చైర్మన్‌గా చేశారు. 2019లో టీడీపీ నుంచి టికెట్ ఆశించినా.. 2024లో ఇస్తానని చంద్రబాబు మాయ మాటలు చెప్పి దాటేశారని అనుచరులు చెబుతున్నారు. ఇప్పుడు కూడా టికెట్ ఇవ్వకపోవడంతో వేదవ్యాస్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కత్తివెన్ను మండలం చినపాండ్రక గ్రామంలో పర్యటనలో ఉండగా టికెట్ లేదని తెలిసి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రక్తపోటు అధికమై హైదరాబాదులోని ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు.
అసంతృప్తిలో అనుచర వర్గం
పెడన టీడీపీ టికెట్ కాగిత కృష్ణ ప్రసాద్‌కు ఇవ్వ డంతో వేదవ్యాస్ అనుచరులు చంద్రబాబుపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. తమ నాయకుడు పార్టీ కోసం కష్టపడి పని చేస్తూ వచ్చారని, నమ్ముకొని ఉన్న నేతకు టికెట్ ఇవ్వకపోడం సరైంది కాదని చెబుతున్నారు. బాబు తీరు వల్లే తమ నాయకుడు అనారోగ్యానికి గురయ్యారని, తనను నమ్మిన నేతలను నట్టేట ముంచడం చంద్ర బాబుకు కొత్తేమీ కాదని అంటున్నారు.
ఇండిపెండెంట్‌గా పోటీ కోసం పట్టు
వచ్చే ఎన్నికల్లో పెడన నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని బూరగడ్డ అనుచరులు పట్టుపట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాదులో ఉన్న ఆయన నాలుగైదు రోజుల్లో ఇక్కడికి వచ్చి, తన అనుచరులతో సమావేశం నిర్వహించి భవితవ్యం వెల్లడించనున్నట్లు సమాచారం. అయితే, తమకు ఓటు బ్యాంకు ఉందని, గెలిచినా.. ఓడినా పోటీ చేసి ఉనికిని కాపాడుకోవాలనే ఆలోచనతో బూరగడ్డ ఉన్నట్లు అనుచరులు చెప్పుకొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment