అణచివేస్తే ఆగిపోతుందా బాబూ
Published Sun, Nov 20 2016 12:00 AM | Last Updated on Mon, Sep 4 2017 8:33 PM
లక్కింశెట్టి శ్రీనివాసరావు :
రాష్ట్రంలో ప్రశాంతమైన జిల్లా అంటే తూర్పు గోదావరినే చెబుతుంటారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ జిల్లావాసులు చాలా మంచోళ్లని కూడా పొగడ్తలతో ముంచెత్తుతుంటారాయన. రాజకీయాల్లో సెంటిమెంట్‌గా కూడా ఈ జిల్లా పేరే చెబుతుంటారాయన. ఎన్నికల ముందు వరకు ఇవే చిలక పలుకులు పలికారు. ఇప్పుడేమో అరాచశక్తులున్న జిల్లాగా ముద్ర వేసేందుకు కూడా ఎక్కడా వెనుకాడటం లేదు. ఊ అంటే చాలు పెద్ద ఎత్తున పోలీసుల బలగాలతో నింపేస్తున్నారు ఆ బాబు. ఎవరి మద్ధతుతోనైతే అధికారంలోకి వచ్చానని ఆయన చెబుతుంటారో అదే వర్గాన్ని కఠినంగా అణచివేస్తున్నారు. తొమ్మిదేళ్లు అనుభవించి కోల్పోయిన పదవి కోసం ఎడాపెడా హామీలు గుప్పించేశారాయన. అధికారం కోసం తలపెట్టిన మహాపాదయాత్ర జిల్లాలో జరుగుతుండగానే రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గానికి అనేక ఆశలు కల్పించారు. దశాబ్థాలుగా పెండింగ్‌లో ఉన్న బీసీ రిజర్వేషన్లు అమలుచేసి తీరతానని ఆ వర్గాన్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. చంద్రబాబు ఇదే జిల్లాలో ఆ సామాజిక వర్గాన్ని బీసీ జాబితాలో చేరుస్తానని హామీ ఇచ్చారు. ఈ డిమాండ్ కోసం ఆ సామాజిక వర్గం తలపెట్టిన ఎన్నో ఉద్యమాలకు ఈ జిల్లా వేదికైంది. అందుకే ఆ సామాజికవర్గంలో ఏ ఉద్యమమైనా ఇక్కడి నుంచే మొదలవుతుంది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా అమలుకు నోచుకోని చంద్రబాబు హామీపై ఇదే జిల్లా వేదికగా ఆ సామాజికవర్గం గొంతెత్తి అడుగుతోంది. అందుకే ఆ వర్గంపై చంద్రబాబు కక్షకట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. అధికారం కోసం అసలు హామీ ఇవ్వడమెందుకు, న్యాయమైన డిమాండ్‌ను అడుగుతుంటే నిర్బంధంతో మంది గొంతు నొక్కేయడమెందుకని సామాన్యులు సైతం ప్రశ్నిస్తున్నారు.ఆ సామాజికవర్గంలో పలువురు నేతలు ఉద్యమ బాటపట్టినా ఉద్యమనేతగా మాత్రం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను ఆ వర్గం నెత్తినపెట్టుకుంది, ఇప్పటికీ పెట్టుకుంటోంది కూడా. ఎవరి మాట వినరని, అనుకున్నది అనుకున్నట్టే ముక్కుసూటిగా చేసుకుపోయే ముద్రగడ వ్యవహారశైలి సహచరులు కూడా చాలా సందర్భాల్లో నచ్చకపోయి ఉండవచ్చు. అయినా కానీ అతని మాటకు ఆ వర్గం కట్టుబడే ఉంటుంది. అదే చంద్రబాబు సర్కార్‌కు కంటగింపుగా మారింది. ముద్రగడ ఉద్యమం చేస్తే ప్రభుత్వం దిగిరావాలా అనేదే ఆలోచిస్తున్నారు తప్పించి తాను హామీ ఇచ్చాను, అమలు చేసి తీరతాననే విషయాన్ని కార్యచరణలో చూపించి వారికి నచ్చజెప్సాల్సిన చంద్రబాబు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న తీరు ఇతరులకు కూడా ఇబ్బందికరంగా తయారైంది.వారు చేస్తున్న ఉద్యమాన్ని అణచివేసేందుకు, నీరుగార్చేందుకు చంద్రబాబు చేస్తున్న కుట్రలు, వేధింపులు ఇతర వర్గాల్లో కూడా ఏవగింపును కలిగిస్తున్నాయి. రావులపాలెం నుంచి అంతర్వేది వరకు శాంతియుతంగా పాదయాత్ర చేస్తానంటే అనుమతి అనే కుంటిసాకుతో భగ్నం చేయడం ద్వారా ప్రభుత్వం ఏమి సాధించిందంటే సమాధానమే దొరకదు. ఇక్కడ రావులపాలెంలో పాదయాత్రకు సిద్దమయ్యే సమయానికి మరోచోట చంద్రబాబు సర్కార్ ద్వారా చైర్మ¯ŒSగా నియమితులైన చలమలశెట్టి రామానుజయ్యతో సమాంతరంగా పాదయాత్ర చేపట్టడం, అతన్ని అక్కడ అరెస్టు చేయడంలో ఆంతర్యాన్ని సామాన్యులు కూడా అర్థం చేసుకోకుండా ఉండరు.
న్యాయస్థానమంటే అంత చులకనా...
పాదయాత్రపై ఉన్నత న్యాయస్థానం కూడా నిలుపుదలచేయలేమని చెప్పి, శాంతిభద్రతలు పర్యవేక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదనని స్పష్టం చేసింది. అటువంటప్పుడు కూడా పాదయాత్ర ప్రారంభం కాకుండానే పదివేల మంది పోలీసులతో భగ్నం చేయడం, ఆ వర్గానికి చెందిన నేతలను అన్యాయంగా గృహ నిర్బంధానికి గురిచేయడం వల్ల చంద్రబాబు ఆ వర్గానికి బాగా దూరమైందనే చెప్పకతప్పదు. పోలీసుల నిర్బంధంతో ఆ సామాజికవర్గ ఉద్యమాన్ని ప్రస్తుతానికి అణచివేసి ఉండవచ్చు. ఆ సామాజికవర్గం కూడా పోలీసు కేసులకు భయపడి ప్రస్తుతానికి నెమ్మదించవచ్చు. కానీ భవిష్యత్తులో కూడా ఇలానే జరుగుతుందని సర్కార్ అనుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి ఉండదు. అందునా ఉద్యమ నేత పాదయాత్ర చేసి తీరతామని ఆ విషయాన్ని వచ్చే నెల 2న ఖరారు చేస్తామంటున్నారు. అటువంటప్పుడు ప్రభుత్వం ఉద్యమాన్ని ఎంత తొక్కిపెట్టాలని ప్రయత్నించినా నిష్ఫలమే అవుతుంది.
Advertisement