కొండలు కొట్టి.. కోట్లు కొల్లగొట్టి
తుని నియోజకవర్గంలో చెలరేగుతున్న కేటుగాళ్లు
ఒక కొండకు అనుమతులు.. పక్క కొండలపైనా అడ్డగోలు తవ్వకాలు
పంపా జలాశయాన్నీ వదలని వైనం
అధికారం అండతో బరితెగింపు
యథేచ్ఛగా సాగుతున్న దందా
అధికారం అండతో తుని నియోజకవర్గాన్ని అడ్డగోలు వ్యవహారాలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చేశారు. ఒక అమాత్యుని దన్ను చూసుకుని.. బరితెగించి మరీ కోట్ల రూపాయల విలువైన ప్రకృతి సంపదను గెద్దల్లా తన్నుకుపోతున్నారు. ఒక కొండకు అనుమతి తెచ్చుకుని చుట్టుపక్కల కొండలను అడ్డగోలుగా పిండిపిండి చేసేస్తున్నారు. చివరకు పంపా జలాశయం గర్భాన్ని కూడా అక్రమార్కులు విడిచిపెట్టడంలేదు. ఈ బాగోతం వెనుక పెద్ద తలకాయలుండటంతో అధికారులు ప్రేక్షకపాత్రకే పరిమితమవుతున్నారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
విశాఖ – కాకినాడ మధ్య కోస్టల్ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తుని పరిసర ప్రాంతాల నుంచే ఈ కారిడార్ వెళ్లనుంది. అదే ఇప్పుడు అక్కడి కొండలు తరిగిపోవడానికి కారణమవుతోంది. గడచిన రెండేళ్లుగా తాండవ ఇసుకను గెద్దల్లా తన్నుకుపోయిన ‘తమ్ముళ్ల’ కళ్లు ఇప్పుడు ఈ కొండలపై పడ్డాయి. కారిడార్ వెళ్లే మార్గంలో ఉన్న భూములకు డిమాండ్ పెరగడంతో తుని పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంటోంది. దీంతోపాటు పారిశ్రామిక అవసరాల కోసం పెద్ద ఎత్తున భూములు అభివృద్ధి చేస్తున్నారు. ఇది ముందుగానే తెలుసుకున్న తెలుగు తమ్ముళ్లు పల్లంలో ఉన్న భూములను కొనుగోలు చేసేశారు. ఇప్పుడు ఆ భూములను మెరక చేసే
పనిలో పడ్డారు. దీంతోపాటు తమకు సానుకూలంగా ఉన్న పంచాయతీల్లో రెవెన్యూ శాఖకు చెందిన కొండలు, గుట్టలను ‘లీజు’ల పేరుతో సొంతం చేసుకున్నారు. తద్వారా తుని నియోజకవర్గ పరిధిలోని ఆరు కొండల్లో గ్రావెల్ దోపిడీకి తెర తీశారు. ఎక్కడైనా ఒక కొండపై తవ్వకాలు జరిపి గ్రావెల్ తీసుకోవాలంటే భూగర్భ గనుల శాఖ అనుమతి తప్పనిసరి. అలా తవ్విన గ్రావెల్‌కు గనుల శాఖకు క్యూబిక్ మీటరుకు రూ.25 నుంచి రూ.50 సెస్ చెల్లించాలి. ప్రభుత్వ నిధులతో చేపట్టే ప్రజోపయోగమైన రహదారులు, భవనాలు తదితర పనులకు మాత్రమే ఈ గ్రావెల్‌ను వినియోగించాలి. కానీ ‘ప్రత్యేక’ పాలన నడుస్తున్న తుని నియోజకవర్గంలో అధికార పార్టీ ముఖ్య నేతలకు ఈ నిబంధనలేవీ వర్తించడంలేదు. అధికారమే తమ చేతుల్లో ఉంటే ఇక నిబంధనలేమిటని ఎదురు ప్రశ్నిస్తున్నారు. అందుకే ఇష్టానుసారం కొండలను పిండి చేసి, గ్రావెల్ తెగనమ్ముకుంటున్నారు.
చామవరంలో కొండ తవ్వకానికి పంచాయతీ తీర్మానం చేసి ఇచ్చారని చెబుతున్నారు. గ్రావెల్ రవాణా చేస్తున్న వాహనాల వే బిల్లుల ఆధారంగా గనుల శాఖకు రోజుకు 30 ట్రిప్పులు రికార్డుల్లో చూపిస్తున్నారు. కానీ వందల లారీల్లో గ్రావెల్ తరలించుకుపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆ గ్రావెల్‌ను రియల్టర్ల భూములను మెరక చేసేందుకు వినియోగిస్తున్నారు.
కొల్లగొడుతున్నారిలా..
తుని మండలం హంసవరం కొండపై ఇష్టానుసారం తవ్వకాలు చేపట్టిన మండల స్థాయి నాయకుడేæ ఇప్పుడు చామవరం కొండ తవ్వకాలు కూడా చేపట్టారు. చామవరం – హంసవరం మధ్య సుమారు 200 ఎకరాల పెద్ద కొండను కొట్టేసేందుకు సిద్దమయ్యారు. ఈ కొండలో 15 హెక్టార్లకు అనుమతి తీసుకున్నా మొత్తం కొండను తవ్వేస్తున్నారు.
విశాఖ జిల్లాకు సరిహద్దు గ్రామమైన వల్లూరులో కొండను తవ్వేసి గ్రావెల్ తరలించేస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో చక్రం తిప్పుతున్న ఒక ముఖ్యనేత కనుసన్నల్లో.. టీడీపీకి చెందిన మండల స్థాయి ద్వితీయ శ్రేణి నాయకుడు ఈ గ్రావెల్ తవ్వకాలు చేపట్టి పెద్ద ఎత్తున అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడు.
తునిలో రోజూ వచ్చే చెత్తను తరలించేందుకు ఎస్.అన్నవరంలో డంపింగ్ యార్డుకు సుమారు ఐదెకరాలు కేటాయించారు. డంపింగ్ యార్డు పేరుతో ఈ మెట్టను తవ్వుకుపోయేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మెట్టను తరలించుకుపోయే హక్కులను తుని పురపాలక సంఘంలోని ముఖ్య ప్రజాప్రతినిధి బంధువులకు అప్పగించారని తెలిసింది.
తేటగుంట గవరపేట వద్ద పోలవరం కాలువ తవ్వకాల్లో పెద్ద ఎత్తున వచ్చిన ఎర్రమట్టిని రేయింబవళ్లనే తేడా లేకుండా అడ్డగోలుగా లారీల్లో తరలించుకుపోయి అమ్మేసుకుంటున్నారు.
తొండంగి మండలంలో బెండపూడి, కొత్తపల్లి, కొమ్మనాపల్లి పంచాయతీల పరిధిలో కూడా కొండలున్నాయి. అక్కడ ఎటువంటి అనుమతులూ రాకుండానే గ్రావెల్ తవ్వేస్తున్నారు. గ్రావెల్ తవ్వకం, రవాణా కోసం భారీ యంత్రాలు, లారీలను వినియోగిస్తున్నారు. ఇక్కడ చీకటి పడిన తరువాత పెద్ద ఎత్తున లారీల్లో గ్రావెల్ తరలించుకుపోతున్నారు. ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే అడ్డదారిలో గ్రావెల్‌ను దర్జాగా అమ్ముకుంటున్నారు.
అటు పంపా రిజర్వాయర్, ఇటు అనుమతి లేని కొండల నుంచి నిత్యం 200 లారీలు రెడ్ గ్రావెల్, 100 ట్రాక్టర్ల ఎర్రమట్టి కొల్లగొడుతున్నారు.
సహజసంపదను దోచేస్తున్నారు
పేదవాడు తట్ట మట్టి తీసుకువెళితే కేసులు పెట్టి వేధించే ప్రభుత్వం.. తుని పరిసర ప్రాంతాల్లో కొండలకు కొండలనే అడ్డగోలుగా తవ్వేసి, లక్షలు మూటగట్టుకుపోతున్నా పట్టించుకోవడం లేదు. అనుమతుల్లేకుండా భారీ యంత్రాలతో లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తవ్వేస్తున్న అక్రమార్కులు పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారు. కొండల చుట్టుపక్కల ఉన్న రోడ్లన్నీ నాశనమైపోతున్నాయి. అక్రమార్జనే లక్ష్యంగా పెట్టుకుని సహజ సంపదను దోచుకుపోతున్నారు. అధికారం అండతో ప్రజలకు నరకం చూపుతున్నారు. అన్నీ తెలిసినా అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి.
– దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యే, తుని
‘త్రిమూర్తులు’ సారథ్యంలో దందా
తవ్వకాలు జరుపుతున్నచోట ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తున్నారు. వారు చెప్పిందే రేటన్న పద్ధతిలో వ్యవహారం నడుస్తోంది. అధికార పార్టీకి చెందిన మండల స్థాయి నాయకుడి కనుసన్నల్లో ఈ వసూళ్ల పర్వం నడుస్తోంది. ఆ నాయకుడి నుంచి క్షేత్రస్థాయిలో ఉన్న ఇద్దరు తెలుగు తమ్ముళ్లు దళారీల అవతారమెత్తి లారీ గ్రావెల్‌ను వారి ఇష్టమొచ్చిన రేటుకు అమ్ముకుంటున్నారు. ఈ ‘త్రిమూర్తులు’ (ముగ్గురు) ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. ఎన్.సూరవరం గ్రామంలో అధికార పార్టీకి చెందిన ఓ ప్రధాన నేత అమ్మకాలు, కొనుగోళ్ల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. రాత్రికి ఎవరి వాటాలు వారు పంచుకుంటున్నారు.
మామూలుగా 5 యూనిట్ల లారీ గ్రావెల్ తవ్వకానికి, లోడింగ్‌కు రూ.250 ఖర్చవుతుండగా, దానిని కొండవద్ద రూ.1600కు అమ్ముతున్నారు. అదే గ్రావెల్‌ను బయటకు తీసుకొచ్చి రూ.3 వేలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. అదే రెండు యూనిట్ల లారీ గ్రావెల్ తవ్వకానికి రూ.100 ఖర్చవుతూండగా, కొండవద్ద రూ.750 వసూలు చేస్తున్నారు. దీనిని బయట రూ.1650కి అమ్ముతున్నారు. ప్రతి రోజూ ఈవిధంగా 200 నుంచి 300 వరకూ లారీలు తిరుగుతున్నాయి. అరకొరగా ట్రాక్టర్లు కూడా తిరుగుతూంటాయి.
l ఈ మొత్తం దందాలో మండల స్థాయి నాయకుడు రోజుకు రూ.2.25 లక్షలు వెనకేసుకుంటుంటే క్షేత్రస్థాయిలో తమ్ముళ్లు రూ.1.25 లక్షలు దోచేస్తున్నారు. దీనిప్రకారం రోజుకు రూ.3.50 లక్షలు, నెలకు రూ.కోటిపైనే తమ్ముళ్ల జేబుల్లోకి పోతోంది. గ్రావెల్ దోపిడీ సాగిస్తున్నది అధికార పార్టీవారు కావడంతో ఇంత జరుగుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయలేకపోతున్నారు.