కొనసాగుతున్న దివీస్ బాధితుల దీక్షలు
కొనసాగుతున్న దివీస్ బాధితుల దీక్షలు
Published Sun, Feb 12 2017 11:02 PM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM
భగ్నం చేసేందుకు పోలీసుల యత్నాలు?
తొండంగి : కోనప్రాంతంలో రైతులకు కోర్టు స్టేటస్‌కో ఇచ్చిన, రైతుల స్వాధీనంలో ఉన్న భూముల్లో దివీస్ యాజమాన్యం చేపట్టిన అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ దివీస్ వ్యతిరేకపోరాటకమిటీ చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం కూడా కొనసాగాయి. కొత్తపాకల గ్రామంలో ఏర్పాౖటెన దీక్షలో రెండో రోజు దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు మట్ల ముసలయ్య, గంపల దండు, సన్ని సత్యనారాయణ, తాటిపర్తి బాబూరావు, యనమల సత్తిబాబు, మారేటి లక్ష్మణరావు, కుక్కాసత్తిబాబు, పి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రిలే దీక్షా శిబిరానికి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వేణుగోపాల్, సీపీఎం నాయకులు వచ్చి మద్దతు పలికారు. తహసీల్దార్ టీవీ సూర్యనారాయణ, ఎస్సై బి.కృష్ణమాచారి తదితరులు దీక్షా స్థలికి వచ్చి విచారణ చేస్తామని దీక్ష విరమించాలని కోరారు. తమకు ఆమోదయోగ్యంగా ఉమ్మడిగా సర్వేయర్లను ఏర్పాటు చేసి విచారణ జరపాలని, రేపటికి వాయిదా వేయాలని సీపీఎం నాయకులతో పాటు పోరాట కమిటీ సభ్యులు కోరారు. అలా కుదరదంటూ గంట వ్యవధిలోనే విచారణను ముగించి అక్రమ నిర్మాణాలు లేవని అధికారులు తెలిపారని దివీస్ వ్యతిరేకపోరాట కమిటీ సభ్యులు వివరించారు. న్యాయం జరిగే వరకూ రిలే దీక్షలు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. శాంతియుతంగా చేపట్టి్టన తమ దీక్షలను భగ్నం చేసేందుకు అధికారులు, పోలీసులు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపించారు.
బాధిత రైతులు లేకుండా విచారణ ఎలా చేస్తారు?
దీర్ఘకాలంగా సాగు చేసుకుంటున్న రైతులు భూములకు కోర్టు స్టేటస్కో విధించినా అక్రమ నిర్మాణాలు జరిగాయని రైతులు ఫిర్యాదు చేస్తే, వారు లేకుండా అధికారులు ఏ విధంగా విచారణ చేశారని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ అసంతృప్తి వ్యక్తంచేశారు. దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ, సీపీఎం ఆధ్వర్యంలో బాధిత రైతులతో కలిసి జనవరి 21న తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పుడు రైతులు లేకుండా విచారణ చేయడం అన్యాయమన్నారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కేఎస్ శ్రీనివాసరావు, జిల్లా నాయకుడు కె.సింహాచలం, కొవిరి అప్పలరాజు, సీఐటీయూ మండల నాయకుడు బద్ది శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Advertisement