♦ సమగ్ర దర్యాప్తునకు ఆమె తల్లిదండ్రుల డిమాండ్
♦ పరిశీలిస్తున్న రైల్వే పోలీసులు
♦ కేసును కోహీర్ పోలీసులకు బదిలీ చేసే అవకాశం
కోహీర్: ఇంటర్ విద్యార్థిని దివ్య అనుమానాస్పద మృతి కేసులో ఇంకా మిస్టరీ వీడలేదు. దివ్య మృతిపై అనుమానాలున్నాయని ఆమె తల్లిదండ్రుల అనుమానాలు వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు సమగ్ర విచారణ కోసం ఈ కేసును కోహీర్ పోలీసులకు అప్పగించనున్నారు. కోహీర్ మండలం మద్రి గ్రామ శివారులోని రైల్వే ట్రాక్‌పై శుక్రవారం దివ్య అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. దివ్య ఆత్మహత్య చేసుకుందని మొదట భావించిన రైల్వే పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని కోహీర్ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం ప్రారంభించే సమయంలో దివ్య తల్లిదండ్రులు ఆమె మృతిపై అనుమానం వ్యక్తం చేశారు.
సమగ్ర దర్యాప్తు చేయాలని రైల్వే పోలీసులను కోరారు. దీంతో శుక్రవారం సాయంత్రం జరగాల్సిన పోస్టుమార్టం నిలిపివేశారు. శనివారం రైల్వే ఎస్‌ఐ వెంకట్‌రాంనాయక్, తహసీల్దార్ గీత మరోసారి కేసు పూర్వాపరాలను పరిశీలించారు. సంఘటన స్థలానికి వెళ్లి పలు వివరాలు సేకరించారు. దివ్య తల్లిదండ్రులతో మాట్లాడి వారి అనుమానాలను అడిగి తెలుసుకున్నారు. శనివారం సాయంత్రం దివ్య శవానికి జహీరాబాద్ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయించారు. ఆమె మరణం మిస్టరీగా మారడంతో రైల్వే పోలీసులు విచారణ నిమిత్తం కోహీర్ పోలీస్ స్టేషన్ బదిలీ చేయాలని భావిస్తున్నట్టు రైల్వే ఎస్‌ఐ వెంకట్‌రాంనాయక్ తెలిపారు.