ఇంటర్‌ విద్యార్థి అనుమానాస్పద మృతి  | Inter Student Suspicious Death In Visakhapatnam | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్యార్థి అనుమానాస్పద మృతి 

Dec 1 2019 9:03 AM | Updated on Dec 1 2019 9:03 AM

Inter Student Suspicious Death In Visakhapatnam - Sakshi

ఆస్పత్రిలో కార్తీక్‌ మృతదేహం, విద్యార్థులను విచారిస్తున్న సీఐ రవి

ఆనందపురం (భీమిలి): అందరిలాగే తానుకూడా వేకువజామునే లేచాడు. అందరితోపాటు కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేయడానికని బయలుదేరి వెళ్లాడు. అంతలోనే ఘోరం జరిగిపోయింది. ఏమయిందో తెలియదుగానీ ఐదు అంతస్తుల భవనం పైనుంచి ఏదో కింద పడ్డ శబ్ధం. అక్కడి సిబ్బందిలో కలకలం. వెళ్లి చూడగా తీవ్ర గాయాలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ అచేతనంగా పడి ఉన్న విద్యార్థి. ఆ వెంటనే కుమారుడుకి గాయాలయ్యాయని విద్యార్థి తల్లిదండ్రులకు సమాచా రం. ఆందోళనకు గురైన వారు చేరుకునేలోపే కుమారుడు విగతజీవిగా మారాడన్న పిడుగులాంటి వార్త. దీంతో దుఃఖ సాగరంలో మునిగిపోయిన తల్లిదండ్రులు. ఇదీ మండలంలోని బోయిపాలెంలో ఉన్న శశి ఇంటర్‌ కళాశాలలో శనివారం తెల్లవారుజామున జరిగిన సంఘటన మిగిల్చిన విషాదం. ఎన్నో ఆశలతో చదివిస్తున్న కుమారుడు విగతజీవిగా మారడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా, పర్లాకిమిడి, యూడవీధికి చెందిన యర్నాగుల నరిసింహరావు, గీత దంపతులకు కార్తీక్‌ (17) ఒక్కడే కుమారుడు. నరిసింహరావు పర్లాకిమిడిలో వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడిని అల్లారుముద్దుగా పెంచి ప్రయోజకుడిని చేయాలని భావించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో పదో తరగతి వరకు చదవించారు. పదో తరగతిలో కార్తీక్‌ 8.2 గ్రేడ్‌ మార్కులు సాధించాడు. అనంతరం ఈ ఏడాది బోయిపాలెంలో ఉన్న శశి విద్యా సంస్థలో ఇంటర్‌ (ఎంపీసీ) మొదటి సంవత్సరంలో చేర్పించి కళాశాల హాస్టల్‌లో ఉంచారు. మూడో అంతస్తులోని 523వ  నంబరు గదిలో సహచర విద్యార్థులతో కార్తీక్‌ ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున సుమారు 5 – 30 గంటల ప్రాంతంలో హాస్టల్‌ సిబ్బంది విద్యార్థులను నిద్ర లేపారు.

అందరితోపాటు కార్తీక్‌ కూడా లేచి కాల కృత్యాలు తీ ర్చుకొని స్నానం చేయడానికని వె ళ్లాడు. కొద్దిసేపటికి హాస్టల్‌ భవనం పైనుంచి కిందకు ఏదో పడ్డ పెద్ద శబ్ధం వచ్చింది. అప్పటికి విధుల్లో ఉన్న ఆనందరావు అనే సెక్యూరిటీ గార్డు పరుగున వెళ్లి చూడగా తీవ్ర గాయాలతో అచేతనంగా పడి ఉన్న కార్తీక్‌ కనిపించాడు. దీంతో ఆందోళనకు గురై కళాశాల సిబ్బందికి తెలియజేయడంతో అక్కడకు చేరుకొని చికిత్స కోసం ఆరిలోవలో ఉన్న ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా  మృతి చెందాడు. ఆ వెంటనే కార్తీక్‌ తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

విద్యార్థుల రక్షణ గాలికి.. 
కళాశాలలో విద్యార్థుల రక్షణకు కనీస చర్యలు చేపట్టనట్టు తెలుస్తోంది. విద్యార్థుల కదలికలు గమనించడానికిగానీ, తరగతి గదులు, హాస్టల్‌ గదులలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికీ సీసీ కెమోరాలు ఎక్కడా కానరాలేదు. కళాశాల అంతటికీ ఇద్దరే సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి వల్లే తమ కుమారుడు మృతి చెందాడని కార్తీక్‌ తండ్రి నరిసింహారావు ఆరోపిస్తున్నాడు.  విచారణ జరిపిన ఏసీపీ  విషయం తెలుసుకున్న వెంటనే సంఘటనా ప్రాంతాన్ని ఏసీపీ రవిశంకరరెడ్డి, సీఐ రవి పరిశీలించారు. సిబ్బందిని, విద్యార్థులను విచారించారు. మృతదేహం ఉన్న ఆరిలోవలోని ప్రైవేట్‌ ఆస్పత్రిని డీసీపీ విజయ్‌భాస్కర్‌ సందర్శించి తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి కేసుని ఎస్‌ఐ శ్రీనివాసరావు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వస్థాలానికి తీసుకెళ్తుండగా గంభీరం వద్ద కళాశాల ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేయడంతో పోలీసులు జోక్యం చేసుకుని సర్ది చెప్పారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

సంఘటనపై పలు అనుమానాలు..!
కార్తీక్‌ భవనం పైనుంచి దూకి పడిపోయాడని విద్యా సంస్థ సిబ్బంది తెలుపుతుండగా తమ కుమారుడు పిరికివాడు కాదని తల్లిదండ్రులు అంటున్నారు. ఎవరో ఏదో చేశారంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. విద్యార్థికి కళాశాలలో ఏమైనా ఇబ్బందులు ఉండి అఘాయిత్యానికి పాల్పడ్డాడా..? లేదా ఎవరైనా పైనుంచి తోసేశారా..? కళాశాల సిబ్బంది ఒత్తిడి ఏమైనా ఉందా..? విద్యార్థుల మధ్య ఏమైనా మనస్పర్థలు ఉన్నాయా..? అన్న కోణాలలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక వేళ కార్తీక్‌ ఆత్మహత్యకు పాల్పడి ఉంటే అందుకు ప్రేరేపించిన సంఘటనలు ఏమిటన్నది తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement