
బుచ్చమ్మ, పద్మరాజు (ఫైల్)
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్ నెం. 25లో బుధవారం చోటు చేసుకున్న తల్లీ,కొడుకుల అనుమానాస్పద మృతిపై జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం, జల్లూరు గ్రామానికి చెందిన సత్యబాబు, బుచ్చమ్మ దంపతులు జూబ్లీహిల్స్ రోడ్‌నెం. 25లోని వ్యాపారవేత్త ఆదిత్యారెడ్డి నివాసంలో పనిచేస్తూ అదే ఇంటి వెనక సర్వెంట్ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. బుధవారం ఉదయం సత్యబాబు ఇంటి యజమాని కుక్క చనిపోవడంతో ఉప్పల్‌లో ఖననం చేసేందుకు డ్రైవర్‌తో కలిసి వెళ్లాడు. మధ్యాహ్నం అతపి భార్య బుచ్చమ్మ, కుమారుడు పద్మరాజు తమ గదిలో నిప్పుల కుంపటి ఏర్పాటు చేసుకొని టీవీ చూస్తూ అలాగే నిద్రపోయారు.
అయితే ఇళ్లంతా పొగచూరి ఊపిరాడక చనిపోయి ఉంటారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంత స్పృహ లేకుండా ఎలా పడుకుంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుర్చీలో కూర్చున్న బుచ్చమ్మ, మంచం మీద పడుకున్న పద్మరాజు అలాగే విగతజీవులయ్యారు. ఊపిరాడకపోతే తలుపుతీసుకొని బయటటికి రావచ్చుకదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వారు అంతకుముందు తిన్న ఆహార పదార్థాలను ఎఫ్‌ఎస్‌ఎల్ పరీక్ష కోసం పంపించారు. నివేదిక వస్తే అసలు విషయాలు వెల్లడవుతాయని పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment