ప్రేమ్‌సాగర్ మృతదేహం
మద్యం మత్తులో గోడలు, పైపుల ఆధారంగా ఇద్దరు యువకులు ఓ అపార్ట్‌మెంట్ పైకి ఎక్కేందుకు ప్రయత్నించగా... వారిలో ఒకరు చనిపోగా,మరొకరు గాయపడ్డారు. మరణించిన వ్యక్తి ఓ సంస్థలో ఫుడ్ డెలివరీ బాయ్ కాగా.. క్షతగాత్రుడు బైక్ చోరీ కేసుల్లో నిందితుడు. అయితే మూడో అంతస్తు నుంచి పడడంతోనే యువకుడుమరణించినట్లు పోలీసులు పేర్కొంటుండగా... అతడి స్నేహితులే పథకం ప్రకారం హత్య చేశారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. బంజారాహిల్స్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్: మద్యం మత్తులో ఓ అపార్ట్‌మెంట్ పైకి ఎక్కడానికి ప్రయత్నించిన ఇద్దరు యువకుల్లో కిందపడి ఒకరు చనిపోగా, మరొకరు గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా, కొత్తకోట మండలం వడ్డవెట్ట గ్రామానికి చెందిన వేముల ప్రేమ్‌సాగర్ (20) ఇంటర్ చదివాడు. తండ్రి హరిబాబు, తల్లి లక్ష్మీలతో కలిసి ఫిల్మ్‌నగర్‌లోని దుర్గాభవానీనగర్‌లో ఉంటూ ఓ సంస్థలో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. బోనాల పండుగ సందర్భంగా ఆదివారం రాత్రి అతను తన స్నేహితులైన సత్యానంద్, గణేష్, నాగరాజుతో కలిసి హైటెక్ సిటీ వైపు వెళ్లి అక్కడ మద్యం తాగారు. అనంతరం వీరు అక్కడి నుంచి జూబ్లీహిల్స్ వైపు వచ్చారు. గణేష్, నాగరాజు తమ ఇళ్లకు వెళ్లిపోగా, ప్రేమ్‌సాగర్, సత్యానంద్ ఫిలింనగర్ వైపు వెళ్లారు. అక్కడి వెంచర్–2లో ఉన్న ట్రెండ్ సెట్ విల్లా అపార్ట్‌మెంట్ వద్ద ఆగిన వీరు గోడలు, పైపులు పట్టుకుని భవనం పైకి ఎక్కేందుకు ప్రయత్నం చేశారు. మూడో అంతస్తు వరకు వెళ్ళిన తర్వాత అదుపుతప్పి ఇద్దరూ కింద పడిపోయారు. తీవ్ర గాయాలతో సెల్లార్‌లో పడిన వీరిని గమనించిన అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ రోడ్డు పైకి తీసుకువచ్చి వదిలేశాడు. సోమవారం ఉదయం వీరిని గుర్తించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రేమ్‌సాగర్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడిన సత్యానంద్ చికిత్స పొందుతున్నాడు.
మత్తులో నుంచి బయట పడిన అతను కొన్ని వివరాలు వెల్లడించాడు. ఆదివారం రాత్రి వీరితో కలిసి ఉన్న గణేష్, నాగరాజులనూ పోలీసులు విచారించగా అందరు కలిసి మద్యం తాగింది వాస్తమే అయినా సత్యానంద్, ప్రేమ్‌సాగర్‌లను వదిలి తాము ఇళ్ళకు వెళ్ళిపోయినట్లు తెలిపారు. కాగా మృతుడి తల, మెడపై తీవ్ర గాయాలు ఉండటం, సమీపంలోనే వీరి బైక్ ధ్వంసమై ఉండటంతో బైక్ స్కిడ్ కావడంతో కిందపడి ఇద్దరూ గాయపడి ఉంటారని, తీవ్రగాయాలు కావడంతో ప్రేమ్ మృతి చెంది ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ప్రేమ్‌సాగర్ తల్లిదండ్రులు తమ కుమారుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సత్యానంద్ తదితరులు పథకం ప్రకారం ప్రేమ్‌సాగర్‌ను చంపి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సదరు అపార్ట్‌మెంట్ సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన ఫుటేజ్‌ను పరిశీలించగా, వీరు ఇద్దరూ అపార్ట్‌మెంట్ మూడో అంతస్తు నుంచి కింద పడినట్లు నిర్థారించారు. ఈ విజువల్స్‌నే ప్రేమ్‌సాగర్ కుటుంబీకులకు చూపించారు. అయితే వీరిద్దరూ అసలు అపార్ట్‌మెంట్ పైకి అక్రమంగా ఎక్కడానికి ఎందుకు ప్రయత్నించారనే దానిపై ఆరా తీస్తున్నారు. సత్యానంద్‌పై చోరీ కేసులు ఉండటంతో అతడే ప్రేమ్‌సాగర్‌ను ఉసిగొల్పి చోరీ కోసం తీసుకువెళ్తున్నాడా? లేక మరోదైనా కారణం ఉందా? అనే అంశాలు ఆరా తీస్తున్నారు. వీరిని బయటికి తీసుకువచ్చి వదిలేసిన వాచ్‌మెన్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment