నిర్లక్ష్యానికి తావులేకుండా రక్షకతడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్ ఆదేశించారు.
– రూ.50 కోట్లతో రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు
– వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ ఆదేశం
అనంతపురం అగ్రికల్చర్: నిర్లక్ష్యానికి తావులేకుండా రక్షకతడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్ ఆదేశించారు. జిల్లాకు వచ్చిన ఆయన శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వ్యవసాయశాఖ, మైక్రో ఇరిగేషన్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ రక్షకతడిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకదృష్టి సారించినందున ఒక్క ఎకరా కూడా వేరుశనగ పంటను ఎండనివ్వకుండా కాపాడే బాధ్యత తీసుకోవాలన్నారు.
వ్యవసాయశాఖ, ఎంఐ కంపెనీలు సమన్వయం చేసుకుని పనిచేస్తే ఫలితం ఉంటుందన్నారు. ప్రతి 15 రోజులకోసారి చెల్లింపులు ఉంటాయని, అందుకోసం రూ.50 కోట్ల బడ్జెట్‌తో రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎత్తిపోతల పద్ధతితో పాటు రైతుల సాయంతో రెయిన్‌గన్ల ద్వారా నీటి తడులు ఇచ్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు పోవాలన్నారు. అందుకోసం కైజాల, వాట్సప్ తదితర యాప్‌లు వాడుకోవాలని సూచించారు. ప్రస్తుతానికి 5 మండలాల్లో వేరుశనగ పంట బెట్ట పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోందన్నారు. మున్ముందు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉన్నందున ఎప్పటికపుడు పక్కా వివరాలు నమోదు చేసుకుని పని చేయాలని ఆదేశించారు. కాల్‌సెంటర్, కంట్రోల్ రూం ద్వారా పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. సమావేశంలో ఇన్‌చార్జ్ కలెక్టర్ టి.రమామణి, జేడీఏ పీవీ శ్రీరామమూర్తి, కమిషనరేట్ జేడీఏ హరిబాబుచౌదరి, ఆత్మ పీడీ పి.నాగన్న, డీడీఏలు చంద్రనాయక్, శ్రీనివాసరావు, ఏడీఏ (పీపీ) విద్యావతి, డివిజన్ ఏడీఏలు, టెక్నికల్ ఏవోలు, డ్రిప్ కంపెనీ డీసీఓలు పాల్గొన్నారు.