ఇసుక రీచ్‌లో ఆధిపత్య పోరు
Published Tue, Oct 4 2016 10:31 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM
* 500 మీటర్లకు 500 నిబంధనలు
* ఒకరికి న్యాయం, మరొకరికి అన్యాయం
* భారీగా నిలిచిపోయిన ఇసుక లారీలు
వెంకటపాలెం (తాడేపల్లి రూరల్): ఇసుక రీచ్‌లో అధికార పార్టీ నేతలు ఆధిపత్యం సంపాదించుకునేందుకు ఇసుక లారీ ఓనర్లను, డ్రైవర్లను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పెనుమాక, వెంకటపాలెంలో ఇసుక రీచ్ నుంచి తాడేపల్లి, మంగళగిరి, విజయవాడ ప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్నారు. మంగళవారం నుంచి వెంకటపాలెం ఇసుక రీచ్ ప్రారంభం కావడంతో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచరులు తమ లారీలే రోడ్డు మీద నడవాలంటూ పోలీసు బాస్‌లతో చర్చించి, వెంకటపాలెం నుంచి లోడు అయి వచ్చే లారీలను నిలిపివేశారు. పెనుమాక ఇసుక రీచ్‌కు, వెంకటపాలెం ఇసుక రీచ్‌కు ఒకటే రూటు. ఎక్కడ లోడైనా అదే రోడ్డులోకి రావాల్సిందే. కాకపోతే వెంకటపాలెం ఇసుక రీచ్ నుంచి వచ్చే లారీలు 500 మీటర్ల రహదారి ఎక్కువగా ఉంటుంది. ఈ 500 మీటర్లకు 500 ఆంక్షలు విధించి, ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు లారీలను నిలిపివేశారు. లారీ యజమానులు జరుగుతున్న ఈ సంఘటనపై పోలీసులను ప్రశ్నించడంతో ఈ 500 మీటర్లు సీఎం రహదారి, మీరెలా వెళతారంటూ ప్రశ్నిస్తున్నారని లారీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి సీఎం ఇంటి మీదుగానే పెనుమాక ఇసుక రీచ్ నుంచి ట్రాక్టర్లు, లారీలు తిరుగుతున్నాయని ప్రశ్నించగా, అది అర్బన్æ పరిధి, ఇది రూరల్∙పరిధి, ఎక్కువగా మాట్లాడుతున్నారేంటి? అని దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. కనీసం ట్రాక్టర్‌పై భోజనానికి కూడా వెళ్లనీయకుండా తమను ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. వెంకటపాలెం మెయిన్ రోడ్డు నుంచి ప్రతి లారీ రాజధాని రూటులో ప్రయాణించాల్సిందే. మరి అక్కడ లేని ఆంక్షలు ఇక్కడే ఎందుకు విధిస్తున్నారని లారీ డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులే పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని లారీ డ్రైవర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
తుళ్లూరు ఎస్‌ఐ మహ్మద్ షఫీ వివరణ ..
వెంకటపాలెం నుంచి వచ్చే ఇసుక లారీలను ఆపిన మాట వాస్తవమేనని, సచివాలయానికి ఉద్యోగస్తుల తాకిడి పెరగడంతో ట్రాఫిక్ నిలిచిపోతుందని లారీలు ఆపినట్టు తెలిపారు. పెనుమాక ఇసుక రీచ్ నుంచి వచ్చే లారీలను ఎందుకు ఆపలేదని ప్రశ్నించగా, అది అర్బన్ పరిధి అని, తమది కాదని అన్నారు. వెంకటపాలెంలో 500 మీటర్లే మీ పరిధిలో ఉంది, మిగతాది అంతా అర్భన్ పరిధిలో ఉంది కదా అని ప్రశ్నిస్తే, మా ఎస్పీ గారు ఆపమన్నారు, మేము ఆపాము, మీ పరిధికాదు కదా అని అన్నారు.
Advertisement
Advertisement