ఖరమే జీవనాధారం
ఖరమే జీవనాధారం
Published Wed, Sep 28 2016 11:24 PM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM
గాడిద పాలమ్మి జీవిస్తున్న కుటుంబాలు
ఆదిలాబాద్ నుంచి వచ్చి సంచార వ్యాపారం
చిన్న గ్లాసుడు పాల ఖరీదు రూ.వంద
ఔషధమన్న నమ్మకంతో కొంటున్న జనం
రాజానగరం : పని చేయకుండా ఖాళీగా తిరిగే వాళ్లను ‘ఎందుకురా.. అలా గాడిదలా తిరుగుతావు’ అని చులకనగా మాట్లాడతారు. అలా అంటే.. ‘తెలుగు తెలియని’ గాడిదలు ఊరుకుంటాయేమో గానీ.. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కొందరు మాత్రం ఒప్పుకోరు. ఎందుకంటే వారి జీవనం ఆధారపడిందే ఖరాల (గాడిదలు) మీద. ఆ జిల్లాకు చెందిన కొంతమంది జిల్లాలోని పలుగ్రామాల్లో గాడిదలను తిప్పుతూ వాటి నుంచి పాలను పిండి, చిన్న గ్లాసుడు పాలను రూ.వందకు విక్రయిస్తున్నారు. ఈ విధంగా జిల్లాలో 11 కుటుంబాలు గాడిదలతో సంచరిస్తూ వాటి పాలతో జీవనోపాధిని పొందుతున్నాయి. గాడిద పాలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయనడంతో, నేటి ఆధునిక సమాజంలో రోగాల పరమై జీవనం సాగిస్తున్న అనేక మంది ఈ పాలను. తాగితే స్వస్థత చేకూరుతుందని ఆశిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే.. ‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము పాలు..’ అన్న శతక పద్యాన్ని సవరించుకోవలసిన అవసరం ఉందనిపిస్తోంది కదూ!
ప్రచారం నేపథ్యంలో పెరిగిన గిరాకీ
గాడిద పాలను కొద్ది కొద్దిగా రోజుకు మూడు పూటల చొప్పున మూడు రోజుల పాటు తాగితే ఆయాసం, ఉబ్బసం, జలుబు, రొంప, పిల్లలకు దగ్గు తదితర రోగాలు తగ్గుతాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గాడిద పాలకు మంచి గిరాకీ వచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ విధంగా సంచార జీవనం సాగించే కుటుంబాలు సుమారు 35 వరకు ఉన్నాయి. వీరంతా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు గాడిదలను వేసుకుని తిరుగుతూ ఉపాధిని పొందుతుంటారు. వర్షాకాలం, శీతాకాలంలో వీరు ఈ విధమైన సంచార జీవనం గడుపుతారు. వేసవిలో ఇళ్ల వద్దనే ఉంటారు. అదేమంటే వేసవిలో ఈ పాలు మరింత వేడిని చేస్తాయని, అందుకని బయటకు పోమని అంటారు.
Advertisement
Advertisement