‘కల్తీ’పాలు | 'fake' milk | Sakshi
Sakshi News home page

‘కల్తీ’పాలు

Published Mon, Sep 12 2016 6:08 PM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM

‘కల్తీ’పాలు

‘కల్తీ’పాలు

* డిమాండ్‌కు తగినట్లుగా దొరకని పాలు
ఇతర రాష్ట్రాల డెయిరీల నుంచి వస్తున్న వైనం
నరసరావుపేటలో ఇటీవల రట్టయిన కల్తీ పాల కేంద్రం గుట్టు
 
అనేక ఉత్పత్తుల్లో కల్తీ సాధారణమైన నేటిరోజుల్లో అక్రమార్కులు స్వచ్ఛమైన పాలనూ వదలటం లేదు. కల్తీ చేయటం, కృత్రిమంగా తయారుచేసి సరఫరా చేస్తుండటం పరిపాటైంది. వినియోగదారుల ఆరోగ్యంపై పెనుప్రభావం చూపే పాలకల్తీని గుర్తించే సాధనాలు, నిరోధించేందుకు తగినంత యంత్రాంగం ఇప్పటికీ లేవు. పాల కల్తీని తీవ్రమైన విషయంగా పరిగణించి, చర్యలు తీసుకోవాల్సిన పాలకుల నిర్లక్ష్యం, చిత్తశుద్ధిలోపం అక్రమ తయారీదారులకు వరంగా మారింది. ప్రజల ఆరోగ్యం దేవుడిపై భారమైంది.
 
తెనాలి: పాల ఉత్పత్తిలో భారతదేశంలో ప్రపంచంలోనే అగ్రగామి. 2015–16లో 155.5 మిలియన్‌ టన్నులతో తన స్థానాన్ని నిలుపుకొంది. ప్రతి మనిషికి సగటు పాల లభ్యత రోజుకు 337 గ్రాములు. ఇది సంతోషించదగ్గ విషయమే...నాణేనికి మరోవైపు అన్నట్టుగా, పాల కల్తీలోనూ మనదేశం ఆధిపత్య స్థాయిలో వుందంటే అతిశయోక్తికాదు. పాల కల్తీపై దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో 68.4 శాతం పాలు నాణ్యతా ప్రమాణాలకు తగ్గట్టుగా లేవని రూఢీ అయింది. ప్యాకెట్‌ పాలకన్నా, విడి పాలలోనే కల్తీ జోరుగా జరుగుతోన్నట్టు తేలింది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామాల్లో కల్తీ శాతం తక్కువగా ఉంది. పట్టణాల్లో 68.9 శాతం ప్రమాణాలు లేకుంటే వీటిలో పాల ప్యాకెట్లలో 66.6 శాతం, విడి పాలలో 33.4 శాతం పాలు నాణ్యత లేనివి. గ్రామాల్లో 31 శాతం ప్రమాణాల్లేనివిగా వుంటే, ఇందులో ప్యాకెట్లలో 16.7 శాతం, విడిపాలల్లో 83.2 శాతం నాణ్యత లేనివిగా సర్వేలో తేల్చారు.
 
జిల్లాలో పరిస్థితి ఇదీ..
ఉత్పత్తికి, డిమాండుకు సమతుల్యం లేకపోవటం పాల కల్తీకి దారితీస్తోందన్నది నిర్వివాదాంశం. దేశవ్యాప్తంగా పాల దిగుబడులు పెరిగినా జిల్లాలో పెరగటం లేదు. జిల్లాలో సగటున రోజుకు 4.50 లక్షల లీటర్ల పాల అమ్మకాలు జరుగుతున్నాయి. పాడిరైతులు 28 శాతం అంటే సుమారు లక్ష లీటర్లు తమ అవసరాలకు అట్టిపెట్టకుంటారని అంచనా. గత పదేళ్లుగా జిల్లా జనాభా పెరుగుతున్నా పాల అమ్మకాలు ఇంతకుమించి ఉండటం లేదు. కనీస పాల లభ్యత ప్రకారం చూసుకున్నా జిల్లా జనాభాకు రోజుకు 10 లక్షల లీటర్ల ఆవశ్యకత వుంది. ఇతర జిల్లాలు/ రాష్ట్రాల్నుంచి డెయిరీలు తెప్పిస్తున్న పాలతోపాటు వెండర్లు విడిగా విక్రయించే పాలు ఆ లోటును తీరుస్తున్నట్టు భావించాల్సి ఉంది. ఇదే కల్తీకి ప్రేరణ గా చెప్పొచ్చు.
 
ఆదాయం కోసం అక్రమ పద్ధతులు....
పాలను ఎవరు అమ్మినా వాటిలో కొన్ని ప్రమాణాలు విధిగా వుండాలని ప్రభుత్వం నిర్దేశించింది. వాటిని పాటించిన వారు ప్రివెన్షన్‌ ఆప్‌ ఫుడ్‌ అడల్ట్రేషన్‌ చట్టం కింద శిక్షార్హులు. ఆ ప్రమాణాలను అనుసరించి టోన్డ్‌ మిల్కులో 3 శాతం వెన్న, సాలిడ్స్‌ నాట్‌ ఫ్యాట్‌ (ఎస్‌ఎన్‌.ఎఫ్‌) 8.5 శాతం వుండాలి. ఫ్యాట్‌ ఎంతమేర ఉన్నప్పటికీ ఎస్‌ఎన్‌ఎఫ్‌ ఏమాత్రం తగ్గటానికి వీల్లేదు. ఆదాయం పెంచుకోవటానికి పాల అమ్మకందారులు (వెండర్లు) అక్రమ పద్ధతులకు పాల్పడుతున్నారు. పాల పరిమాణం పెంచుకొనేందుకు నీటిని కలుపుతున్నారు. వీటిలో ఫ్యాట్, ఎస్‌ఎన్‌ఎఫ్‌ శాతం తగ్గిపోతుంది. గేదె పాలలో 6–7 శాతం ఫ్యాట్, ఎస్‌ఎన్‌ఎఫ్‌ 9 శాతం ఉండాలి. నీళ్లు కలపటం వల్ల ఫ్యాట్‌ 3–5 శాతం, ఎస్‌ఎన్‌ఎఫ్‌ 4–7 శాతమే వుంటుంది. 
 
పాలలో యూరియా...
నీళ్లు కలిపిన పాలలో ఎస్‌ఎన్‌ఎఫ్‌ శాతం కోసం నీరు, యూరియా కలుపుతున్నారు. మరికొందరు అక్రమ వ్యాపారులు  ఏకంగా కృత్రిమ పాలనే తయారుచేస్తున్నారు. నరసరావుపేట రూరల్‌ పోలీసులు దాడిలో వెలుగుచూసిన కల్తీ పాల కేంద్రంలోనూ ఆయిల్‌ ప్యాకెట్లు, యూరియా వినియోగం వెల్లడైన విషయం తెలిసిందే. వెన్నకు ప్రత్యామ్నాయంగా వంటనూనె వాడకం ఎప్పట్నుంచో వుంది. చిక్కదనం కోసం గంజిపొడి, కొన్ని రకాల జిగుర్లు వినియోగిస్తున్నారు. పాలలా నురుగు వచ్చేందుకు డిటర్జెంట్‌ పౌడర్లు, ఆమ్ల గుణాన్ని తగ్గించేందుకు కాస్టిక్‌సోడాను వేస్తున్నారు. స్టార్చ్, గ్లూకోజ్, ఫార్మలీస్‌ను కృత్రిమ పాలకు వినియోగించిన దాఖలాలు వెలుగుచూశాయి. కృత్రిమపాలు కొద్దిరోజులు నిల్వవుండేలా చూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement