గార్దబాలతో వచ్చి.. మొక్కులు తీర్చి
- చౌడేశ్వరీదేవి గుడిచుట్టూ బురదలో గార్దబాల పదక్షణ
- తిలకించేందుకు వేలాదిగా తరలివచ్చి జనం
కల్లూరు : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కల్లూరు శ్రీచౌడేశ్వరిదేవి ఆలయం చుట్టూ బురదలో గురువారం గార్దబాల ప్రదక్షణ ఆనందోత్సాహాల మధ్య సాగింది. తరతరాలుగా వస్తున్న ఆచారంలో భాగంగా గార్దబాలను ప్రత్యేకంగా అలంకరించి ఆలయం వద్దకు తెచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం చుట్టూ ఏర్పాటుచేసిన బురదనీటిలో దింపి మూడు ప్రదక్షణలు చేయించారు.
నగరంలోని బుధవారపేట, వన్‌టౌన్, సాయిబాబానగర్, పెద్దపడఖానా, కల్లూరు, శరీన్‌నగర్, శ్రీరామనగర్‌తోపాటు శింగవరం, మునగాలపాడు, తాండ్రపాడు, పంచలింగాల తదితర గ్రామాల రజకులు తమ గార్దబాలతో ప్రదక్షణకు పోటీ పడ్డారు. ప్రదక్షణలు చేసి అమ్మవారికి మొక్కు తీర్చుకున్నారు. ఏటా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులమంతా పాల్గొంటామని రజక సంఘం నాయకులు ఎల్లప్ప తెలిపారు. ఈ ఏడాది బురదలో తగిన మేరకు నీరు లేకపోవడంతో ఒక ప్రదక్షణతోనే సరిపెట్టుకున్నామన్నారు. బురదలో నీళ్లు పలుచగా ఉంటే 3 నుంచి 5 ప్రదక్షణలు తీయించి సంతోషంగా ఇంటికి వెళ్లే వాళ్లమని తెలిపారు.