పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకురావాలి
నెల్లూరు (టౌన్): పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు, దాతలు బడి అభివృద్ధికి ముందుకు రావాలని సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ అధికారి కనకనరసారెడ్డి పిలుపునిచ్చారు. సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో బడి రుణం తీర్చుకుందాం ర్యాలీని పీఓ కనకనరసారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మద్రాస్ బస్టాండ్ నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. అనంతరం మానవహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కనకనరసారెడ్డి మాట్లాడారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో బడి రుణం తీర్చుకుందాం ర్యాలీలను నిర్వహించినట్లు చెప్పారు. ఉపాధ్యాయులు పాఠశాలల్లోని మౌలిక వసతులను గుర్తించి పాఠశాల యాజమాన్య కమిటీలు, గ్రామస్తుల దృష్టికి తీసుకెళ్లి వారి సహకారాన్ని కోరాలని సూచించారు. బడి రుణం తీర్చుకుందాంలో భాగంగా సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ ఉద్యోగుల ఒక రోజు వేతనం రూ.58508ను విరాళంగా ఇచ్చారన్నారు. రాష్ట్ర కమ్యూనిటీ మొబిలైజేషన్ కన్సల్టెంట్ లక్ష్మణ్, డిప్యూటీ డీఈఓ షా అహ్మద్, ఎంఈఓ జగదీష్, ప్లానింగ్ కోఆర్డినేటర్ రమణారెడ్డి, సీఎంఓ శ్రీనివాసులు, ఏపీఓ రాజశేఖర్, ఏఎస్‌ఓ రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.