మధ్యాహ్న భోజన నిర్వహణకు సిబ్బంది కరువు | Drought management staff lunche on | Sakshi
Sakshi News home page

మధ్యాహ్న భోజన నిర్వహణకు సిబ్బంది కరువు

Published Sun, Dec 14 2014 1:23 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM

Drought management staff lunche on

మెనూ పాటించడంలేదు.. పురుగుల బియ్యం.. నాణ్యత లేదు.. బిల్లులు చెల్లించడం లేదు. ఇవి తరచూ ప్రభుత్వం నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకంపై వచ్చే ఆరోపణలు. అయితే ఇందుకు సంబంధించి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ప్రత్యేక సిబ్బంది అంటూ లేరు. ఉన్న వారితోనే మధ్యాహ్న భోజన పథక నిర్వహణకు అవసరమైన పనులు చేయాల్సి వస్తోందని పలువురు సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
 నెల్లూరు(విద్య) : ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి సిబ్బంది కొరత తీవంగ్రా ఉంది. 2004లో ఈపథకాన్ని ప్రారంభించారు. 2006లో డెరైక్టరేట్‌లో ఒక ఏడీ, ఒక సూపరింటెండెంట్, ఒక సీనియర్ అసిస్టెంట్, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లతోపాటు ఔట్‌సోర్సింగ్ విధానంలో కంప్యూటర్ ఆపరేటర్, ఇద్దరు అటెండర్లను నియమించుకున్నారు. అప్పట్లోనే జిల్లా స్థాయిలో మధ్యాహ్న భోజనపథక నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేశా రు. ప్రతి జిల్లా డీఈఓ కార్యాలయంలో ఈ పథకం నిర్వహణ కోసం ఒక సూపరింటెండెంట్, ఒక సీనియర్ అసిస్టెంట్‌ను నియమించుకోవచ్చునని ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతవరకు ఆ భర్తీలు జరగలేదు. దీంతో బిల్లుల చెల్లింపులు, బడ్జెట్ కేటాయింపులు, పర్యవేక్షణ, తనిఖీలు, ఆశించిన స్థాయిలో జరగడంలేదు. మధ్యాహ్న భోజనపథకపు పనులన్నీ కార్యాలయంలో డిప్యుటేషన్‌పై ఉన్న జూనియర్ అసిస్టెంటే నిర్వహించాల్సి వస్తుం ది. జిల్లాలో 2,11,772 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అందిస్తున్నారు. ఈ పరిశీలన నిర్వహణకు సంబంధించిన పనులు నత్తనడకన నడుస్తున్నాయి. హెచ్‌ఎంలకు, ఎంఈఓలకు ఈ పథక నిర్వహణ అధికభారంగా మారింది.
 
  పర్యవేక్షణ పూర్తిగా కుంటుపడింది. విద్యార్థులకు ఇవ్వాల్సిన మెనూ, నాణ్యమైన ఆహార పదార్థాలను అందిస్తున్నారో లేదు. చూసేందుకు వీలులేకుండా పోతుంది. ప్రభుత్వం ఒక పథకాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ  నిర్వహణకు సంబంధించిన యంత్రాంగాన్ని విధిగా ఏర్పాటు చేస్తుం ది. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ మాత్రం రాష్ట్రస్థాయిలో యంత్రాంగం ఏర్పాటు చేసి జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయకపోవడం ఆ శాఖ నిర్లక్ష్యానికి నిదర్శనం. తాజాగా అక్టోబర్‌లో జిల్లా స్థాయిలో పథక నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని నియమించుకోవాలని ఆయా డీఈఓలకు ఉత్తర్వులు అందాయి. ఇంతవరకు అవి కార్యరూపం దాల్చడంలేదు. ప్రస్తుతం జిల్లా విద్యాశాఖ మినిస్టీరియల్ స్టాఫ్ కొరత ఎక్కువగా ఉంది.
 
 డీఈఓ కార్యాలయంలో ఇద్దరు ఏడీలు అన్ని విభాగాలను పర్యవేక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆరుగురు సూపరింటెండెంట్లకు గాను ముగ్గురు సూపరింటెండెంట్లే పనిచేస్తున్నారు. మొత్తం 24 మంది క్లర్క్‌ల అవసరం ఉండగా 12 మంది పనిచేస్తున్నారు. రికార్డు అసిస్టెంట్లు, ఆఫీసు సబార్డినెంట్లు, అటెండర్లు, పరిస్థితి అలానే ఉంది. సిబ్బంది కొరతను డిప్యుటేషన్లపై నెట్టుకొస్తున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ తమకు తలకు మించిన భారంగా తయారవుతుందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
 గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలి    
 మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ సక్రమంగా జరిగేందుకు గ్రీవెన్స్ సెల్‌ను ఏర్పాటు చేయాలి. ఏడీ స్థాయి అధికారి పర్యవేక్షణ, తనిఖీలు జరగాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక సిబ్బంది జిల్లాస్థాయిలో లేకపోవడం ఈ పథకం నిర్వహణ పలు ఆరోపణలను ఎదుర్కొంటుంది.
 - కె.గోపాల్, ఏపీస్కూల్ ఎడ్యుకేషన్ సర్వీస్
 అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు
 
 క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందో తెలియడం లేదు సిబ్బంది కొరత వల్ల క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందో తెలియడంలేదు. బిల్లులు పెండింగ్ పడిపోతున్నాయి. ప్రతి పథకం అమలుకు మెయింటెనెన్స్ మానిటరింగ్ ఎక్స్‌పెండిచర్ ఉంటుంది. పోస్టులను ప్రత్యేకంగా భర్తీ చేయమని జీఓ ఉన్నప్పటికీ భర్తీ చేయకపోవడం బాధాకరం.
 - జీవీ నాగేంద్ర, ఏపీస్కూల్ ఎడ్యుకేషన్ సర్వీస్
 అసోసియేషన్ జిల్లా కార్యదర్శి  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement