రాజేంద్రనగర్: రాజేంద్రనగర్‌లోని పీవీ నర్సింహారావు వెటర్నరీ వర్సిటీ కళాశాల పాత భవనంలో రంగారెడ్డి(శంషాబాద్) జిల్లా కలెక్టర్ భవనాన్ని తాత్కలికంగా ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ వర్సిటీ విద్యార్థులు బుధవారం ధర్నా నిర్వహించారు. తరగతులు బహిష్కరించి పరిపాలన భవనం నుంచి పాత భవనం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ...
విద్యార్థులకు, రైతులకు ఈ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. శిథిలావస్థకు చేరిన ఈ భవనాన్ని రూ. 2.50 కోట్లతో ప్రస్తుతం మరమ్మతులు చేపడుతున్నారన్నారు. ఇది వినియోగంలోకి వస్తే విద్యార్థులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. కలెక్టరేట్ భవనం ఏర్పాటును ఉపసంహరించుకోకుంటే యూనివర్సిటీని నిరవధికంగా బంద్ చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులకు పశువైద్య శాస్ర్తవేత్తలు మద్దతు తెలిపారు.