భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దు
-
రొట్టెల పండగలో రాజకీయ ఫ్లెక్సీలు, వీఐపీ దర్శనాలకు స్వస్తి పలకండి
-
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
నెల్లూరు (వేదాయపాళెం) :
రాష్ట్రానికే ప్రతిష్టాత్మకమైన బారాషహీద్ దర్గా వద్ద నిర్వహించనన్ను రొట్టెల పండగకు వచ్చే భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం ఏ మాత్రం సరికాదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. బారాషహీద్ దర్గా వద్ద బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ దర్గా పరిసర ప్రాంతాల్లో ఏ రాజకీయ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని హితవు పలికారు. ఫ్లెక్సీల కారణంగా భక్తి భావానికి, ప్రశాంతతకు భంగం కలుగుతుందన్నారు. వీఐపీ దర్శనాలతో సాధారణ క్యూలో ఉన్న భక్తులను గంటల తరబడి వేచి ఉండేలా చేయడం వల్ల తొక్కిసలాట జరుగుతుందన్నారు. అజ్మీర్ దర్గా తరహాలో బారాషహీద్ దర్గాకు ప్రాధాన్యత, విశిష్టత ఉందన్నారు. దేశ విదేశాల నుంచి భక్తులు లక్షలాది మంది వస్తారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. రొట్టెల పండగను జాతీయ పండగగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలన్నారు. రొట్టెల పండగకు కేటాయించిన నిధులు సద్వినియోగం అయ్యేలా మంత్రి నారాయణ, మేయర్ అజీజ్, జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఏర్పాట్లు పరిశీలన
బారాషహీద్ దర్గా వద్ద భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పరిశీలించారు. మరుగుదొడ్లు, చెరువు వద్ద ఘాట్‌ల నిర్మాణ పనులు చూశారు. ముస్లిం మత పెద్దలు, వక్భ్‌బోర్డ్ అధికారులు ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిని గౌరవ పూర్వకంగా ఆహ్వానించి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, ముస్లిం మైనార్టీ నేతలు సలీమ్, హంజాహస్సేన్, మునీర్ సిద్దిక్, అబూబకర్, చిన్నమస్తాన్, రియాజ్, బాబు, కార్పొరేటర్ లేబురు పరమేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.