‘డబుల్’దగా | double scam in ration dealers | Sakshi
Sakshi News home page

‘డబుల్’దగా

Published Thu, Mar 3 2016 2:57 AM | Last Updated on Sun, Sep 3 2017 6:51 PM

‘డబుల్’దగా

‘డబుల్’దగా

ఇష్టారాజ్యంగా రేషన్ డీలర్లు  ఏకకాలంలో రెండు రకాలుగా దందా
పేదలకు సక్రమంగా అందని బియ్యం తూకంలో మోసం, కోత పేరిట వాత
దోపిడీ బియ్యం మిల్లులకు.. తిరిగి పౌరసరఫరాల శాఖకు సరఫరా
ప్రతి నెలా ఐదు వేల టన్నుల బియ్యం గోల్‌మాల్
నీరుగారుతోన్న సీఎం ఆశయం

రేషన్ డీలర్ల అక్రమ దందా జిల్లాలో యథేచ్ఛగా సాగుతోంది. ఓ వైపు పేదలను, మరోవైపు ప్రభుత్వాన్ని నిలువునా దోచుకుంటున్నారు. తూకంలో మోసం చేస్తూ, కోటా తగ్గిస్తూ ప్రతినెలా కార్డుదారుల నుంచి బియ్యాన్ని దండుకుంటున్నారు. ఇలా మిగిలించుకున్న బియ్యాన్ని అడ్డదారిలో తిరిగి సర్కార్‌కే అంటగడుతున్నారు. ప్రతినెలా 30 శాతం బియ్యాన్ని ఇలా పక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతి నెలా ఐదు వేల టన్నుల బియ్యం గోల్‌మాల్ అవుతోంది. ఈ తంతు నిర్వహణకు జిల్లాలో ఓ మాఫియా వ్యవస్థ బలంగా పనిచేస్తోంది. అడిగే వారు లేకపోవడంతో ఈ దోపిడీ వ్యవస్థ రోజురోజుకూ వేళ్లూనుకుంటోంది. ఫలితంగా పేదోడికి మూడు పూటలా కడుపు నిండా అన్నం పెట్టాలన్న సీఎం కేసీఆర్ ఆశయం నీరుగారిపోతోంది. - సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి

జిల్లాలో మొత్తం 7,93,855 ఆహార భద్రతా కార్డులు ఉన్నాయి. తెల్లరేషన్ కార్డు కలిగిన కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున రూపాయికి కిలో బియ్యం అందజేస్తున్నారు. అంత్యోదయ కార్డుకు సభ్యులతో సంబంధం లేకుండా 35 కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారు. తెల్ల, అంత్యోదయ ఆహార భద్రతా కార్డులకు కలిపి నెలనెలా 16,387.047 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డీలర్ల చేతిలో పెడుతోంది. ఈ బియ్యం ద్వారా 26.84 లక్షల మంది ప్రజలు రోజుకు కనీసం రెండు పూటలైనా భోజనం చేస్తారని సర్కార్ భావిస్తోంది.

ఇదో రకం దందా....
గ్రామాల్లో కనీసం 20 శాతం మంది వలస, ఇతర కారణాల వల్ల ప్రతి నెలా రేషన్ బియ్యం తీసుకోవడం లేదు. మరో 3 శాతం మంది రేషన్ కార్డులు డీలర్ల వద్దే ఉన్నాయి. మొత్తానికి సగటున 30 శాతం బియ్యాన్ని ప్రతి నెలా కార్డుదారులు తీసుకోవడం లేదని పౌరసరఫరాల శాఖ అధికారులే లెక్కలు కడుతున్నారు. నిబంధనల ప్రకారం ఈ 30 శాతం బియ్యాన్ని డీలర్లు తిరిగి పౌరసరఫరాల శాఖకు అప్పగించాలి. నిజానికి ఆ శాఖ అధికారులు దగ్గరుండి మిగులు సరుకుల వివరాలు తీసుకొని వచ్చే నెల కోటాకు సర్దుబాటు చేయాలి. ఇప్పటివరకు క్వింటాల్ బియ్యం కూడా సివిల్ సప్లయీస్ శాఖకు రికవరీ కాలేదు. 30శాతం అంటే దాదాపు ఐదు వేల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రతి నెలా పక్కదారి పడుతోంది. పౌర సరఫరాల శాఖకు బియ్యం అందిస్తున్న రైస్ మిల్లర్లు అవే బియ్యాన్ని డీలర్ల ద్వారా మళ్లీ బయట మార్కెట్‌లో కొంటూ రీసైక్లింగ్ చేస్తూ తిరిగి పౌర సరఫరాల శాఖకే పంపిస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థపై సరైన నిఘా కొరవడటంతో అక్రమార్కులు యథేచ్ఛగా బియ్యాన్ని దొడ్డిదారిన పంపుతున్నారు. మండల కేంద్రాలకు దూరంగా ఉన్న గ్రామాలను ఎంచుకొంటున్న అక్రమార్కులు రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

 తూకంలో మోసం...
డీలర్ల చేతివాటం కారణంగా జిల్లాలో ప్రతినెలా 30 శాతం బియ్యం పక్కదారి పడుతోంది. డీలర్లు ఒక్కో కార్డుకు రెండు కిలోల చొప్పున బియ్యం కోత పెడుతున్నారు. ఇదికాకుండా మరో అర కిలో నుంచి కిలో వరకు తూకంలో మోసం చేస్తున్నారు. ఐదుగురు సభ్యులున్న కార్డుదారుకు 30 కిలోల బియ్యం రావాల్సి ఉండగా...

 27 కిలోలు మాత్రమే వస్తుందని మనూరు మండలం మాయికోడ్ గ్రామానికి చెందిన విఠలేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమిటని వినియోగదారులు నిలదీస్తే ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచే కోటా తక్కువగా వస్తుందంటూ బుకాయిస్తున్నారు. అన్ని ఊర్లలోనూ పరిస్థితి ఇలాగే ఉందంటూ చెబుతున్నారని కంగ్టి మండలం చాప్టా(కె) గ్రామానికి చెందిన సరిత తెలిపారు.

  తక్కువ ఇస్తున్నరు..
మాకు ప్రతి నెలా రెండు కిలోల బియ్యం తక్కువ ఇస్తున్నరు. అందరికి అంతేనని చెబుతుండ్రు. మా ఇంట్లో పది మంది ఉంటరు. ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున 60 కిలోలు రావాలి. కానీ 58 కిలోలే ఇస్తున్నరు. - మేత్రి వీర్‌గొండ, చాప్టా(కె), మం: కంగ్టి

 అంత్యోదయ కార్డుకు 33 కిలోలేనట...
నాకు రెండు కిలోల బియ్యం తక్కువ ఇస్తున్నరు. గరీబీళ్లకు 35 కిలోల చొప్పున ఇస్తున్నట్టు సర్కారు చెబుతుంది. మాకు మాత్రం 33 కిలోలే వస్తున్నయి. అందరు అంతే తీసుకొంటుంటే మేము గూడా ఏమి అడుగుతలేం. అధికారులు పట్టించుకొని ఒక్కొక్కళ్లకు ఎంత ఇస్తున్నరో చూస్తే బాగుంటది. - మాణిక్, చాప్టా(కె), మం: కంగ్టి

 తొలుత సంది గంతే...
తొలుత కార్డుకు ఒకటి, రెం డు కిలోలు తక్కువ ఇస్తుం డ్రి. ఇప్పుడు ఆరు కిలోలు అయినా కూడా ఒక్కో కార్డుకు కిలో బియ్యం కోసుకొని ఇస్తుండ్రు. డీలర్‌ను అడిగితే మాకే తూకంలో తక్కువ వస్తున్నది.. మేమెం చేయాలి అని అంటున్నరు.
-  నాగ్‌గొండ, చాప్టా(కె), మం: కంగ్టి

 కిలో బియ్యం తక్కువ...
ప్రతి 20 కిలోల బియ్యానికి కిలో తక్కువ వస్తుంది. డీలర్‌ను ఏమి అనలేకపోతున్నం. ఎన్నిమార్లు చెప్పిన వారు మారుతలేరు. అన్ని ఊర్లలో ఇలాగే ఉందని డీలర్లు అంటున్నరు. గట్టిగా అడిగితే బెదిరిస్తున్నరు. మేం ఎవరికి చెప్పుకోవాలో తెలుస్తలేదు.
                             - రాములు, మాయికోడ్

 సక్రమంగా ఇస్తలేరు...
రేషన్ డీలర్లు బియ్యం సరిగ్గా ఇస్తలేరు. ఇదే విషయాన్ని రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకుంటలేరు. అధికారులు ఓసారి వచ్చి తనిఖీ చేసి పోయిండ్రు. అయినా డీలర్ పద్ధతి మారలేదు. మాలాంటి పేదోళ్లు నష్టపోతున్నారు.  - శ్రీశైలం, శెల్గిరా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement