స్వైన్‌ఫ్లూ తగ్గుముఖం
జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
వైరస్ అదుపులో ఉందంటున్న జిల్లా ౖవైద్యాధికారులు
తిరుపతి మెడికల్ : జిల్లాను వణికించిన స్వైన్‌ఫ్లూ క్రమంగా అదుపులోకి వస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 25 మంది నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించగా 19 మందికి స్వైన్‌ఫ్లూ వ్యాధి ఉన్నట్టు నిర్ధారణ అయినట్టు ప్రభుత్వ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. స్వైన్‌ఫ్లూ వైరస్ శీతాకాలం, మంచు ఎక్కువగా కురుస్తున్న సమయంలో, గాలిలో తేమశాతం అధికంగా ఉన్నప్పుడు వ్యాపిస్తుంది. వాతారణంలో 28 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటే గాలిలోనే స్వైన్‌ఫ్లూ వైరస్ నశిస్తుంది. ప్రస్తుతం జిల్లాలో పగటిపూట ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలకు చేరడంతో స్వైన్‌ఫ్లూ కారక వైరస్ తగ్గుముఖం పట్టినట్టు వైద్యులు తెలిపారు.
జిల్లావ్యాప్తంగా విస్తరించిన వైద్య సేవలు..
జిల్లాలో ఐరాల, మదనపల్లె, తిరుపతి అర్బన్, చిత్తూరు అర్బన్ ప్రాంతాల నుంచి స్వైన్‌ఫ్లూ వ్యాధిగ్రస్తులు ఉన్న ట్లు గుర్తించిన జిల్లా వైద్యాధికారులు జిల్లా వ్యాప్తంగా వ్యాధి నివారణకు చర్యలు తీసుకుంటున్నారు. తిరుపతి కేంద్రంగా స్విమ్స్‌లోని వైరాలజీ ల్యాబ్‌లో స్వైన్‌ఫ్లూ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, రోగులకు మెరుగైన వైద్యం అందించారు. రుయా ఐడీహెచ్ విభాగంలోని స్వైన్‌ఫ్లూ వార్డులో ప్రత్యేక వైద్య సేవలను కల్పించారు. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ నేతృత్వంలో వైద్యం బృందం వైద్య సేవలు అందిస్తోంది.
వ్యాధి అదుపులో ఉంది..
జిల్లాలో స్వైన్‌ప్లూ వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. చికిత్స అందించే వైద్యులు, వైద్య సిబ్బందికి వ్యాధి నివారణ వ్యాక్సిన్‌లు సరఫరా చేశాం. ప్రస్తుతం జిల్లాలో 19 స్వైన్‌ఫ్లూ కేసులు పాజిటివ్‌గా వచ్చాయి. రుయా ఆస్పత్రిలో ముగ్గురు, వేలూరు సీఎంసీలో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు చికిత్స తీసుకుని ఇంటికి వెళ్లిపోయారు.
– డాక్టర్ విజయగౌరి, జిల్లా వైద్యాధికారిణి