దశాబ్దాం నాటి కల సాకారం
దశాబ్దాం నాటి కల సాకారం
Published Mon, Dec 19 2016 9:17 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
ముచ్చుమర్రి లిఫ్ట్ నుంచి కేసీకి కృష్ణా జలాలు
- జిల్లాకు చేయాల్సినంతా చేశా...
- స్వీట్లు పంపిణీ చేసిన కలెక్టర్
కర్నూలు(అగ్రికల్చర్): ‘‘జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చా. గోదావరి జిల్లాలతో సమానంగా అభివృద్ధి చేశా. జిల్లా ప్రజలు అభివృద్ధి ఫలాలను అనుభవించే రోజులు వస్తున్నాయి. దశాబ్దం కలను నెరవేర్చాం. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి కేసీ కెనాల్‌కు నీళ్లు ఇచ్చాం.’’ అని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తెలిపారు. సోమవారం ఉదయం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ముగిసిన తర్వాత జిల్లా అధికారులతో ప్రధానంగా అభివృద్ధిపై చర్చించారు. ముచ్చుమర్రి లిఫ్ట్ నుంచి కేసీకి కృష్ణా జలాల తరలింపుతో తన కల నేరవేరిందంటూ స్వీట్లు పంపిణీ చేశారు. జిల్లాకు చేయాల్సిందంతా చేశామని.. ఇక చేయాల్సింది ఏమీ లేదని ప్రకటించారు. హంద్రీనీవా సుజల స్రవంతి, కేసీ కెనాల్ కాలువలకు 300 రోజులు నీరు పారుతుండటం వల్ల రైతులు మూడు పంటలు పండించుకోవచ్చన్నారు. రేయింబవళ్లు పనిచేసి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా వేలాది ఎకరాలకు నీళ్లు ఇవ్వగలిగామన్నారు. వచ్చే జనవరి నాటికి పత్తికొండ, దేవనకొండ, మండలాల్లోని 65వేల ఎకరాలకు నీరిచ్చేందుకు ముమ్మరంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు.
డీలర్లు కోర్టుకు వెల్లి స్టే తెచ్చుకునే అవకాశం ఎందుకిచ్చారు..
ఈ–పాస్ మిషన్‌లను బైపాస్ చేసి ప్రజాపంపిణీకి తూట్లు పొడిచిన డీలర్లు అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. డీలర్లపై క్రిమినల్ కేసులు పెట్టిన తర్వాత కనీసం మూడు వారాల సమయం వచ్చిందని.. ఆ లోపు వారిని అరెస్ట్ చేయకుండా జాప్యం చేసి ముందస్తు బెయిల్ తెచ్చుకోవడానికి అవకాశం ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేశారు. దీనిని ముఖ్యమంత్రి నిర్వహించే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు నోట్స్‌లో పెట్టాలని ఆదేశించారు.
నివేదికలు ఇవ్వండి..
ఈ నెల 21, 22 తేదీల్లో విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు తాజా అభివృద్ధిపై నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. వివిధ శాఖలకు చెందిన 27 అంశాలపై నివేదికలు ఇవ్వాలని సూచించారు. సమావేశంలో జేసీ హరికిరణ్, జేసీ–2 రామస్వామి, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, సీపీఓ ఆనంద్‌నాయక్, నీటిపారుదల శాఖ ఎస్‌ఈ చంద్రశేఖర్‌రావు తదితరులు పాల్గొన్నారు
Advertisement
Advertisement