ఆగస్టులోపు ముచ్చుమర్రి పూర్తి
జిల్లా కలెక్టర్ సత్యనారాయణ
ముచ్చుమర్రి(పగిడ్యాల): ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనులను ఆగస్టు చివరి నాటికి పూర్తి చేయిస్తామని జిల్లా కలెక్టర్ ఎస్. సత్యనారయణ అన్నారు. మండల పరిధిలోని ముచ్చుమర్రి గ్రామం వద్ద జరిగే ఎత్తిపోతల పనుల పురోభివృద్ధిని కలెక్టర్ శనివారం పరిశీలించారు. పంప్‌హౌస్‌పై నిర్మితమయ్యే పంప్‌ల సెట్టింగ్ పనులను, ప్రాజెక్ట్ డిజైన్ మ్యాప్, నీటి లభ్యత వివరాలు ఈఈ రెడ్డి శేఖర్‌రెడ్డి కలెక్టర్‌కు వివరించారు. అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ ఎత్తిపోతల పనులు నత్తనడకన సాగుతున్నాయని వేగం పెంచాలని ఆదేశించారు. జూపాడుబంగ్లాలో జరిగిన సంఘటనకు బాధ్యుడైన పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేశామన్నారు. హంద్రీనీవా కాలువపై వీరాపురం పొలాలకు వెళ్లేందుకు బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టాలని నెహ్రూనగర్‌కు చెందిన పలువురు రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా అర్జీ ఇవ్వాలని సూచించారు. అనంతరం కేసీ కాలువ క్రాస్‌రెగ్యులేటర్‌లను పరిశీలించారు. కార్యక్రమంలో జలవనరులశాఖ ఎస్‌ఈ నారాయణస్వామి, డీఈ బాలాజీ, ఆదిశేషారెడ్డి, నందికొట్కూరు మార్కెట్‌యార్డ్ చైర్మన్ గుండం రమణారెడ్డి, నందికొట్కూరు ఎంపీపీ ప్రసాదరెడ్డి, మండల నోడల్ అధికారి వీరారెడ్డి, తహసీల్దార్ కుమారస్వామి, ఎంపీడీఓ విజయలక్ష్మి, ఈఓఆర్డీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.