ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
దొరవారిసత్రం:
మట్టి తీసుకువస్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడటంతో డ్రైవర్ మావిళ్లపాటి రాజయ్య(40) మృతి చెందిన సంఘటన తిమ్మినాయుడు కండ్రిగ గ్రామ రోడ్డు వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు... తనియాలి ఎస్సీ కాలనీకి చెందిన రాజయ్య బూదూరు గ్రామ సమీపంలో తెలుగు గంగ కాలువ వద్ద ట్రాక్టర్‌లో మట్టి లోడు చేసుకుని తిరిగి తనియాలి గ్రామానికి వస్తున్న సమయంలో ట్రాక్టర్ తిమ్మనాయుడుకండ్రిగ గ్రామ రోడ్డు వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కనే పొలాల్లో పడిపోవడంతో డ్రైవర్ కూడా ట్రాక్టర్ కిందనే పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం సూళ్లూరుపేటకు తరలిస్తున్న సమయంలోనే 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని రాజయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, కొడుకు ఉన్నారు. ప్రమాదంపై పోలీసులకు ఏలాంటి సమాచారం అందలేదు.