doravarisatram
-
రహదారిపై భారీ ట్యాంకు
దొరవారిసత్రం: దొరవారిసత్రం గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై శుక్రవారం అతిపెద్ద ట్యాంకు ఓ లారీపై వెళ్లడాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. ఈ లారీ చెన్నై హార్బర్ నుంచి వారం కిందట వంద అడుగుల పొడవున్న ట్యాంకుతో బయలుదేరింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టుకు వెళ్తోంది. మార్గమధ్యంలో దారికడ్డంగా ఉన్న విద్యుత్ తీగలు తప్పిస్తూ సిబ్బంది నెమ్మదిగా ముందుకు కదలడం కనిపించింది. -
బాక్స్ టైప్ బ్రిడ్జి నిర్మించాల్సిందే
కలెక్టర్ ముత్యాలరాజు దొరవారిసత్రం : మినమలముడి, అక్కరపాక ప్రాంతాల్లో మ్యాన్ హోల్ రైల్వే గేట్లు తొలిగించి బాక్స్ టైప్ బ్రిడ్జిలు నిర్మించాల్సిందేనని జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు అన్నారు. బాక్స్ టైప్ బ్రిడ్జి నిర్మాణాలను ఆయా గ్రామ ప్రజలు, రైతులు గత మూడేళ్లగా అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో బుధవారం అక్కరపాక, మినమలముడి గ్రామాల సమీపంలో మ్యాన్ రైల్వే గేట్లు ఉన్న ప్రాంతాలను రైల్వే అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. చాలాచోట్ల బ్రిడ్జి నిర్మాణాలు పూర్తిచేశారని, మన జిల్లాలోనే ప్రజలు అడ్డుపడుతున్నారన్నారు. దీనిపై రెండు ప్రజలు స్పందిస్తూ గేట్లను తొలిగించేందుకు ప్రయత్నిస్తే ప్రాణాలైన వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్వదేశీ దర్శన్ కింద రూ.61 కోట్లు జిల్లాలోని వివిధ పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు స్వదేశీ దర్శన్ పథకం కింద రూ.61 కోట్లు నిధులు మంజూరైనట్లు ముత్యాలరాజు తెలిపారు. దొరవారిసత్రం, సూళ్లూరుపేట, తడ ప్రాంతాల్లోని నేలపట్టు, పక్షుల కేంద్రానికి రూ.1.48 కోట్లు, అటకానితిప్పకు రూ.1.79 కోట్లు, వేనాడుకు రూ.2.51 కోట్లు, ఇరకంకు రూ.10.47కోట్లు, బీవీ పాళెంకు 11.97 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. నేలపట్టు పక్షుల కేంద్రం సమీపంలో పిల్లల పార్కు పనులకు కలెక్టర్ పరిశీలించారు. -
ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
దొరవారిసత్రం: మట్టి తీసుకువస్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడటంతో డ్రైవర్ మావిళ్లపాటి రాజయ్య(40) మృతి చెందిన సంఘటన తిమ్మినాయుడు కండ్రిగ గ్రామ రోడ్డు వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు... తనియాలి ఎస్సీ కాలనీకి చెందిన రాజయ్య బూదూరు గ్రామ సమీపంలో తెలుగు గంగ కాలువ వద్ద ట్రాక్టర్లో మట్టి లోడు చేసుకుని తిరిగి తనియాలి గ్రామానికి వస్తున్న సమయంలో ట్రాక్టర్ తిమ్మనాయుడుకండ్రిగ గ్రామ రోడ్డు వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కనే పొలాల్లో పడిపోవడంతో డ్రైవర్ కూడా ట్రాక్టర్ కిందనే పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం సూళ్లూరుపేటకు తరలిస్తున్న సమయంలోనే 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని రాజయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, కొడుకు ఉన్నారు. ప్రమాదంపై పోలీసులకు ఏలాంటి సమాచారం అందలేదు. -
రైల్వే గేట్లు తొలిగిస్తే ప్రాణాలు పోయినట్లే
దొరవారిసత్రం : అక్కరపాక, మినమలముడి ప్రాంతాల్లో లెవల్ క్రాసింగ్ వద్ద ఉన్న మ్యాన్‌హోల్ రైల్వే గేట్లు తొలిగించి బాక్స్ టైప్ బ్రిడ్జిల నిర్మాణం జరిగితే ప్రాణాలు పోయినట్లేనని గ్రామస్తులు రైతులు ప్రజాభిప్రాయం సేకరణలో జేసీ మహ్మద్ ఇంతియాజ్, సబ్ కలెక్టర్ గిరీషా, రైల్వే అధికారుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. బాక్స్‌టైప్ బ్రిడ్జి నిర్మాణంపై ఇప్పటికే మూడుసార్లు రైల్వే అధికారులు ప్రజాభిప్రాయం సేకరించిన చేపట్టిన ప్రయోజనం లేకుండాపోయింది. గురువారం మరోసారి తహసీల్దార్ కార్యాలయంలో అభిప్రాయసేకరణ జరిగింది. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, రైతులు వరి కోతలు, చెరుక పంటల సమయంలో లారీలు బ్రిడ్జిల కింద నుంచి రాలేవని, దీంతో ఇబ్బందులుపడుతామని, రైల్వే గేట్లు అలాగే ఉంచాలని కోరారు. జేసీ మాట్లాడుతూ విపత్తుల సమయంలో నీళ్లు నిలబడకుండా పంచాయతీల్లోని వ్యక్తులను ఉద్యోగులుగా రైల్వే అధికారులు నియమించారన్నారు. అంతేకాకుండా బాక్స్‌టైప్ బ్రిడ్జిలు నిర్మించినా ఉన్న గేట్లు తొలిగించకుండా క్లోజ్ చేయాలని, విపత్తుల సమయంలో ఆ గేట్లు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులను కోరారు. ఈకార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు విజేత, డీఎస్పీ శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాసులు, రైల్వే అధికారులు డీఈ రామ్‌ప్రసాద్‌రావ్, ఏడీఈ రాబిన్‌రాజన్, వివిధ పార్టీ నాయకులు దువ్వూరు గోపాల్‌రెడ్డి, వేనాటి సతీష్‌రెడ్డి, ఈశ్వరయ్య పాల్గొన్నారు. -
ప్రాణాలు తీసిన నిద్ర మత్తు
♦ కంటైనర్ లారీని ఢీకొని డాక్టర్, డ్రైవర్ దుర్మరణం ♦ గాయాలతో బయట పడిన మరో డాక్టర్ ♦ సహాయంగా వచ్చిన మరో యువకుడికి తీవ్రగాయాలు దొరవారిసత్రం : స్కార్పియో కారు డ్రైవర్ నిద్ర మత్తు, అతి వేగం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ముందు వెళ్తున్న కంటైనర్‌ను వెనుక నుంచి కారు ఢీకొనడంతో డ్రైవర్‌తో పాటు అందులో ప్రయాణిస్తున్న డాక్టర్ దుర్మరణం చెందగా, మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన మండలంలోని జాతీయ రహదారిపై కలగుంట సమీపంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఆదివారం తెల్లవారు జామున జరిగింది. ఎస్సై మారుతీకష్ణ కథనం మేరకు... చెన్నై ప్రాంతంలోని పొన్నేరిలో డాక్టర్లు మువ్వా భవాని (48), ఆదిశేషారావు సాయిభవాని డయాబెటిక్ సెంటర్‌ను సుమారు 20 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. ఆదిశేషారావు తండ్రి సంవత్సరికం సందర్భంగా స్వగ్రామైన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు 14వ తేదీన వెళ్లారు. అక్కడ కార్యక్రమాలు ముగించుకుని 16వ తేదీన భవాని స్వగ్రామం తెనాలికి వచ్చారు. అక్కడ చదువుకుంటున్న కుమారుడిని చూసి శనివారం రాత్రి 8 గంటలకు పొన్నేరికి కారులో బయలుదేరారు. కలగుంట ఫ్లైఓవర్ బ్రిడ్జి వచ్చే సరికి డ్రైవర్ నిద్రమత్తులో అతివేగంగా కారును నడపడంతో ముందుకు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొన్నాడు. కారు లారీ వెనుక భాగంలో సగం వరకు చొచ్చుకొనిపోయింది. దీంతో కారు డ్రైవర్ ధరణి నరేష్ (30), డాక్టర్ భవాని అక్కడికక్కడే మృతి చెందారు. ఆదిశేషారావుకు స్వల్పగాయాలు కాగా, వీరికి సహాయంగా వచ్చిన కుమార్ తీవ్రగాయాలతో బయట పడ్డాడు. డ్రైవర్ చెన్నై దగ్గరలోని అనపంబట్టు ప్రాంతానికి చెందినవాడిగా పోలీసుల తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిచారు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు గంటల పాటు అల్లాడిన యువకుడు డాక్టర్ కుటుంబానికి తోడుగా వచ్చిన యువకుడు కుమార్ జరిగిన ప్రమాదంలో కారులోనే ఇరుక్కుపోయాడు. ప్రమాదం ఆదివారం తెల్లవారు జామున సుమారు 3.30 గంటలకు జరిగింది. విషయం తెలుసుకుని ఎస్సై, పోలీసులు, 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నప్పటికి ఎంత ప్రయత్నం చేసిన ఇర్కుపోయిన యువకుడిని బయటకు తీయలేకపోయారు. చివరికి ఎస్సై నాయుడుపేట నుంచి ఓ క్రేన్ తెప్పించి గాయపడిన కుమార్‌ను వెలికి తీసే సరికి రెండు గంటల సమయం పట్టింది. అప్పటి వరకు కాపాడండి కాపాడండి.. అంటూ బిగ్గరగా కేకలు వేస్తూ ఆ యువకుడు నరకయాతన పడ్డాడు.