బాక్స్ టైప్ బ్రిడ్జి నిర్మించాల్సిందే
-
కలెక్టర్ ముత్యాలరాజు
దొరవారిసత్రం : మినమలముడి, అక్కరపాక ప్రాంతాల్లో మ్యాన్ హోల్ రైల్వే గేట్లు తొలిగించి బాక్స్ టైప్ బ్రిడ్జిలు నిర్మించాల్సిందేనని జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు అన్నారు. బాక్స్ టైప్ బ్రిడ్జి నిర్మాణాలను ఆయా గ్రామ ప్రజలు, రైతులు గత మూడేళ్లగా అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో బుధవారం అక్కరపాక, మినమలముడి గ్రామాల సమీపంలో మ్యాన్ రైల్వే గేట్లు ఉన్న ప్రాంతాలను రైల్వే అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. చాలాచోట్ల బ్రిడ్జి నిర్మాణాలు పూర్తిచేశారని, మన జిల్లాలోనే ప్రజలు అడ్డుపడుతున్నారన్నారు. దీనిపై రెండు ప్రజలు స్పందిస్తూ గేట్లను తొలిగించేందుకు ప్రయత్నిస్తే ప్రాణాలైన వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
స్వదేశీ దర్శన్ కింద రూ.61 కోట్లు
జిల్లాలోని వివిధ పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు స్వదేశీ దర్శన్ పథకం కింద రూ.61 కోట్లు నిధులు మంజూరైనట్లు ముత్యాలరాజు తెలిపారు. దొరవారిసత్రం, సూళ్లూరుపేట, తడ ప్రాంతాల్లోని నేలపట్టు, పక్షుల కేంద్రానికి రూ.1.48 కోట్లు, అటకానితిప్పకు రూ.1.79 కోట్లు, వేనాడుకు రూ.2.51 కోట్లు, ఇరకంకు రూ.10.47కోట్లు, బీవీ పాళెంకు 11.97 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. నేలపట్టు పక్షుల కేంద్రం సమీపంలో పిల్లల పార్కు పనులకు కలెక్టర్ పరిశీలించారు.