ప్రాణాలు తీసిన నిద్ర మత్తు | Two kiled in car collision with lorry | Sakshi
Sakshi News home page

ప్రాణాలు తీసిన నిద్ర మత్తు

Published Sun, Jul 17 2016 9:00 PM | Last Updated on Sat, Aug 25 2018 5:41 PM

ప్రాణాలు తీసిన నిద్ర మత్తు - Sakshi

ప్రాణాలు తీసిన నిద్ర మత్తు

కంటైనర్‌ లారీని ఢీకొని డాక్టర్, డ్రైవర్‌ దుర్మరణం
గాయాలతో బయట పడిన మరో డాక్టర్‌ 
సహాయంగా వచ్చిన మరో యువకుడికి తీవ్రగాయాలు   
 
దొరవారిసత్రం : స్కార్పియో కారు డ్రైవర్‌ నిద్ర మత్తు, అతి వేగం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ముందు వెళ్తున్న కంటైనర్‌ను వెనుక నుంచి కారు ఢీకొనడంతో డ్రైవర్‌తో పాటు అందులో ప్రయాణిస్తున్న డాక్టర్‌ దుర్మరణం చెందగా, మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన మండలంలోని జాతీయ రహదారిపై కలగుంట సమీపంలోని ఫ్లైఓవర్‌ బ్రిడ్జిపై ఆదివారం తెల్లవారు జామున జరిగింది. ఎస్సై మారుతీకష్ణ కథనం మేరకు... చెన్నై ప్రాంతంలోని పొన్నేరిలో డాక్టర్లు మువ్వా భవాని (48), ఆదిశేషారావు సాయిభవాని డయాబెటిక్‌ సెంటర్‌ను సుమారు 20 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. ఆదిశేషారావు తండ్రి సంవత్సరికం సందర్భంగా స్వగ్రామైన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు 14వ తేదీన వెళ్లారు. అక్కడ కార్యక్రమాలు ముగించుకుని 16వ తేదీన భవాని స్వగ్రామం తెనాలికి వచ్చారు. అక్కడ చదువుకుంటున్న కుమారుడిని చూసి శనివారం రాత్రి 8 గంటలకు పొన్నేరికి కారులో బయలుదేరారు.

కలగుంట ఫ్లైఓవర్‌ బ్రిడ్జి వచ్చే సరికి డ్రైవర్‌ నిద్రమత్తులో అతివేగంగా కారును నడపడంతో ముందుకు వెళ్తున్న కంటైనర్‌ లారీని ఢీకొన్నాడు. కారు లారీ వెనుక భాగంలో సగం వరకు చొచ్చుకొనిపోయింది. దీంతో కారు డ్రైవర్‌ ధరణి నరేష్‌ (30), డాక్టర్‌ భవాని అక్కడికక్కడే మృతి చెందారు. ఆదిశేషారావుకు స్వల్పగాయాలు కాగా, వీరికి సహాయంగా వచ్చిన కుమార్‌ తీవ్రగాయాలతో బయట పడ్డాడు. డ్రైవర్‌ చెన్నై దగ్గరలోని అనపంబట్టు ప్రాంతానికి చెందినవాడిగా పోలీసుల తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిచారు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   
 
రెండు గంటల పాటు అల్లాడిన యువకుడు 
డాక్టర్‌ కుటుంబానికి తోడుగా వచ్చిన యువకుడు కుమార్‌ జరిగిన ప్రమాదంలో కారులోనే ఇరుక్కుపోయాడు. ప్రమాదం ఆదివారం తెల్లవారు జామున సుమారు 3.30 గంటలకు జరిగింది. విషయం తెలుసుకుని ఎస్సై, పోలీసులు, 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నప్పటికి ఎంత ప్రయత్నం చేసిన ఇర్కుపోయిన యువకుడిని బయటకు తీయలేకపోయారు. చివరికి ఎస్సై నాయుడుపేట నుంచి ఓ క్రేన్‌ తెప్పించి గాయపడిన కుమార్‌ను వెలికి తీసే సరికి రెండు గంటల సమయం పట్టింది. అప్పటి వరకు కాపాడండి కాపాడండి.. అంటూ బిగ్గరగా కేకలు వేస్తూ ఆ యువకుడు నరకయాతన పడ్డాడు. 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement