మాట్లాడుతున్న జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి
సాక్షి,సిటీబ్యూరో: ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలకు జిల్లాలో అందుబాటులో ఉన్న సర్కారు భూమిని గుర్తించి జీహెచ్‌ఎంసీకి అప్పగిస్తే వెంటనే నిర్మాణాలు చేపడుతామని కమిషనర్ డాక్టరు జనార్దన్‌రెడ్డి తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో జేసీ భారతిహోళి కేరి, జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ సురేంద్రమోహన్‌లతో కలిసి ఆర్డీఓలు, తహశీల్దార్లు ,అధికారులతో ప్రభుత్వ భూముల స్వాధీనంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జంట నగరాల్లో దాదాపు 1400 మురికి వాడలు ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
వివాదాలు లేని భూములను స్వాధీనం చేస్తే డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలకు టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న స్థలంలో నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జేసీ భారతి హోళికేరి మాట్లాడుతూ జిల్లాలో 10 ప్రాంతాల్లో 41 ఎకరాల భూమి అందుబాటులో ఉందని, ఇందులో 5 ఎకరాలను ఇప్పటికే జీహెచ్‌ఎంసీకి స్వాధీనం చేసినట్లు తెలిపారు.
ఇతర శాఖల అధీనంలో ఉన్న డిఫెన్స్ భూములపై చర్చిస్తున్నట్లు తెలిపారు. ప్రతిపాదనలు పంపేముందు తహశీల్దార్లు కోర్టు కేసులు, వివాదాలను పరిశీలించాలని ఆదేశించారు.అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలపై రెండు రోజుల్లో నివేదిక అందజేయాలన్నారు. సమావేశంలో ఇన్‌చార్జి ఏజేసీ అశోక్‌కుమార్, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, హౌజింగ్ అధికారులు పాల్గొన్నారు.