విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్
– కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్
– కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్, టోల్‌ఫ్రీ నెంబర్ 08572–240500 ఏర్పాటు
చిత్తూరు కలెక్టరేట్
జిల్లాను కరువు రహితంగా మార్చడమే ధ్యేయంగా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాభావ పరిస్థితుల దష్ట్యా ఎండిపోయిన వేరుశనగ పంటను రెయిన్‌గన్స్ ద్వారా తడులు అందించి కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 1.26లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగవుతుందన్నారు. ఈనెల 19వతేది నుంచి ఇప్పటివరకు 18వేల హెక్టార్లలో రెయిన్ గన్స్ ద్వారా వేరుశనగ పంటకు తడులిచ్చామన్నారు. అవసరమైతే రెండవ తడులు కూడా ఇస్తామన్నారు. రాబోయే మూడు రోజుల్లో జిల్లావ్యాప్తంగా వేరుశనగ పంటకు తడులు పూర్తిగా అందిస్తామన్నారు. వేరుశనగను తడిపేందుకు జిల్లాకు 1,426 రెయిన్ గన్స్, 1,426 స్ప్రింకర్లు, 300 ఆయిల్ ఇంజన్లు, 27,600 హెచ్‌డీఎఫ్‌సి పైపులు వినియోగిస్తామని, ఇంకా అవసరమైతే పరికరాలు తెప్పిస్తామన్నారు. నీటి వసతి లేని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామన్నారు. జిల్లా కేంద్రం నుంచి కమాండింగ్ కంట్రోల్ రూమ్‌ను, టోల్‌ఫ్రీ నంబర్ 08572 – 240500 ను ఏర్పాటు చేశామన్నారు. రైతులు తమ పొలాలకు సంబంధించి సమస్యలు ఏవైనా ఉంటే ఈ నంబర్‌కు ఫోన్ చేసి అడిగిన వెంటనే అధికారులు తగు చర్యలు తీసుకుంటారన్నారు.