మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు
- మల్లన్న సాగర్‌కు అడ్డు టీడీపీ, కాంగ్రెసోళ్లే
- జిల్లాలో 8 లక్షల ఏకరాలకు సాగు నీరు
- ప్రతిపక్షాలపై మంత్రి హరీశ్ ఘాటు విమర్శలు
దుబ్బాక: తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగాలన్నా, కరువు పోవాలన్నా... గోదావరి నీళ్లు రావాలి. అప్పుడే దేశానికి అన్నం పెట్టే అన్నదాతల కళ్లల్లో సంతోషాన్ని చూడాలన్నదే టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు.
సోమవారం దుబ్బాక బాలాజీ ఫంక‌్షన్ హాల్‌లో డీసీసీబీ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 19 గ్రామాలకు చెందిన 480 మంది రైతులకు పాడి గేదేల కొనుగోలు కోసం రూ. 4.80 కోట్ల విలువైన చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డెబ్బై ఏళ్ల కాలంలో కాంగ్రెసోళ్లు కుంభకర్ణుడి నిద్రలోకి పోయి ఒక్క ప్రాజెక్టు కట్టలేదు... చంద్రబాబు తెలంగాణకు చెందిన ఏడు మండలాలను పొలవరం ప్రాజెక్టులో ముంచిండు.. రైతు కన్నీళ్లను తుడిచి, ఆనందాన్ని నింపుదామనుకున్న కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కోర్టులకెళ్లి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాయని ఆరోపించారు.
సముద్రంలో కలిసి పోతున్న గోదావరి నీళ్లను నూరు తాటి చెట్ల ఎత్తున ఉన్న మెదక్ జిల్లాకు తీసుకొచ్చి 8 లక్షల ఎకరాలకు సాగు నీరందించి, ఆత్మహత్యల్లేని జిల్లాగా తీర్చిదిద్దుతామన్నారు. రైతుల ప్రయోజనాల కోసమే రానున్న రెండేళ్లలోనే మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ను కట్టి తీరుతామని, రైతుల కాళ్ల వద్దకు గోదావరి నీళ్లను తీసుకరావడమే ధ్యేయంగా పని చేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
రైతుల బాధలను అర్థం చేసుకున్న కేసీఆర్ నాణ్యమైన విద్యుత్‌ను గృహావసరాలకు 24 గంటలు, వ్యవసాయానికి 9 గంటలపాటు నిరంతరాయంగా అందిస్తుంటే ప్రతిపక్షాల కళ్లకు కనబడడం లేదా అని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంతంలో ఒక్క పంటకు నీరివ్వలేని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తం కుమార్‌రెడ్డి ఆంధ్రోళ్ల మూడో పంటకు నీళ్లించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్, టీడీపీ చేసిన పాపాలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చక్కదిద్దాలన్నా ఉద్ధేశ్యంతోనే ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు రూ. 6 లక్షల నష్ట పరిహారాన్ని ఇస్తోందన్నారు.
జిల్లా పాడి పరిశ్రమాభివృద్ధికి కృషి చేస్తున్న డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డిని మంత్రి అభినందించారు. జాయింట్ లైవ్‌లీహుడ్ గ్రూప్ కింద ఎస్సీ, ఎస్టీ రైతులకు 33 శాతం, ఓసీ, బీసీ రైతులకు 25 శాతం సబ్సిడీని డీసీసీబీ బ్యాంకు ద్వారా ప్రభుత్వం అందిస్తోందన్నారు. ప్రతి పక్షాల ఆరోపణలను ఎక్కడిక్కడా నిలదీసి, అడ్డుకోవాలని మంత్రి ప్రజలకు పిలుపు నిచ్చారు.
అమిత్ షా విమర్శలు అర్థరహితం: ఎమ్మెల్యే సోలిపేట
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం కేటాయించిన నిధుల్లో కోతలు విధిస్తూ అభివృద్ధిని అడుగడుగునా అణచివేస్తోందని, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. అభివృద్ధి జరగడం లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆరోపణలు చేయడంపై అర్థరహితమని అన్నారు. బీజేపీ ప్రభుత్వ కాలంలో సైనికుల శవ పేటికల్లో జరిగిన కుంభకోణంపై ఎందుకు స్పందించరని ప్రశ్నించారు.
శిలాజీనగర్ తండాకు చెందిన 100 మంది గిరిజన మహిళలు సారాను బందు చేసి పాల ఉత్పత్తిపై ఆసక్తిని పెంచుకోవడంపై ఎమ్మెల్యే ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ర్యాకం పద్మ, జడ్పీటీసీ ఏల్పుల గౌతమి, ఏఎంసీ చైర్మన్ గుండవెళ్లి ఎల్లారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు అమ్మన రవీందర్‌రెడ్డి, మద్దుల గాలిరెడ్డి, కూరాకుల మల్లేశం, వైస్ చైర్మన్ ఆస జ్యోతి, ఆయా శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.