డ్రగ్స్‌ మాఫియా | drugs mafia | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ మాఫియా

Published Thu, Aug 4 2016 12:33 AM | Last Updated on Fri, May 25 2018 2:11 PM

డ్రగ్స్‌ మాఫియా - Sakshi

డ్రగ్స్‌ మాఫియా

కడప అర్బన్‌:

రాష్ట్రస్థాయిలో డ్రగ్స్‌ మాఫియాకు కేంద్ర బిందువుగా కడప మారుతుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మూడు రోజుల క్రితం డీఆర్‌ఐ (డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌) అధికారులు స్థానిక ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో సూర్య కెమికల్స్‌లో ‘ఎఫిడ్రిన్‌ హెచ్‌సీఎల్‌’ను పట్టుకున్నారు. ఇది స్థానికంగా సంచలనం సృష్టించింది. రెండేళ్ల నుంచి బ్రౌన్‌షుగర్‌ లాంటి మత్తు పదార్థాలను గల్ఫ్‌కు వెళుతున్న జిల్లావాసుల ద్వారా పంపుతూ కొందరు జిల్లా పోలీసులకు పట్టుబడ్డారు. గల్ఫ్‌లో కూడా అమాయకమైన ప్రజలు సైతం విమానాశ్రయాల్లో తనిఖీల్లో పట్టుబడి జైళ్ల పాలయ్యారు. తాజాగా ఎఫిడ్రిన్‌ దొరకడంతో డ్రగ్స్‌మాఫియాపై అనుమానాలు బలపడుతున్నాయి. ఈ దిశగా పోలీసులు దృష్టిసారించారు.
అసలేం జరిగింది ?
కడప నగర శివార్లలోని పరిశ్రమల ప్రాంతంలో ప్లాట్‌ నం 183లో ప్రశాంతి ప్లైయాష్‌ బ్రిక్స్‌ పేరుతో యర్రగుడి సూర్యనారాయణ పరిశ్రమ నడుపుతున్నాడు. అందులో ఓవైపు సూర్య కెమికల్స్‌ పేరుతో ఓ గదిలో ఓ రియాక్టర్‌ను ఏర్పాటు చేసి ‘ఎఫిడ్రిన్‌ హెచ్‌సీఎల్‌’ నుంచి ‘ఎఫిడ్రిన్‌’ను తయారుచేస్తున్నారని డీఆర్‌ఐ అధికారులకు సమాచారమందింది. దీంతో హైదరాబాద్‌ జోనల్‌ కార్యాలయం నుంచి అధికారులు కడపకు గత నెల 30న వచ్చి సెర్చ్‌ వారెంట్‌ ద్వారా తనిఖీలు చేశారు. ఎరుపు రంగులోని ఓ బ్యాగ్‌లో 46 కిలోల ‘ఎఫిడ్రిన్‌ హెచ్‌సీఎల్‌’ను స్వాధీనం చేసుకున్నారు. ఆ కెమికల్‌ను సీజ్‌ చేశారు. తర్వాత జిల్లా కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్‌ వారెంట్‌ ద్వారా హైదరాబాద్‌కు యర్రగుడి సూర్యనారాయణరెడ్డిని తీసుకుని వెళ్లారు. ఈ కెమికల్‌ను అల్లోపతి మందుల్లో కూడా తగిన మోతాదులో ఉపయోగిస్తుంటారు.
కెమికల్స్‌ పరిశ్రమలపై డీఆర్‌ఐ అధికారుల నిఘా
పరిశ్రమల్లో తయారుచేస్తున్న కెమికల్స్, పల్వరైజింగ్‌ పదార్థాలు, పెయింటింగ్స్‌లో ఉపయోగిస్తున్న రసాయనాలను గురించి డైరెక్టర్‌ ఆప్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. పరిశ్రమలు నడుపుతున్న కొన్ని ప్రాంతాల్లో ఎఫిడ్రిన్‌ హెచ్‌సీఎల్‌ లాంటి కెమికల్స్‌ ఇంకా ఎక్కడైనా తయారవుతున్నాయా? అనే కోణంలో నిఘా ఉంచినట్లు సమాచారం.
సూర్య కెమికల్స్‌ వైపు పరుగులు తీస్తున్న అధికారులు
డీఆర్‌ఐ అధికారులు వచ్చి సూర్యనారాయణరెడ్డిని అరెస్ట్‌ చేసుకుని వెళ్లడంతో జిల్లాలోని సంబంధిత అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పర్యవేక్షణలో తమ శాఖ వైపు నుంచి ఏమైనా సంబంధం వుందా! అన్నట్లు ఆయా శాఖల అధికారులు పరుగులు తీస్తున్నారు. మంగళవారం ఎక్సైజ్‌ అధికారులు, బుధవారం ఔషధ నియంత్రణ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
 పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో ...
జిల్లా పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో కూడా ప్రత్యేక విభాగానికి చెందిన వారు కెమికల్స్‌ ఫ్యాక్టరీలతో పాటు, మత్తు పదార్థాల ముడిపదార్థాలకు అవకాశం ఉన్న పరిశ్రమలపై కూడా నివేదికలు తయారుచేస్తున్నారు. డ్రగ్స్‌ మాఫియాపై కూడా ప్రత్యేక నిఘాను ఉంచినట్లు తెలుస్తోంది. ఐతే ఏ పరిశ్రమలోనైనా తాము ఉపయోగిస్తున్న లైసెన్స్‌డ్‌ కెమికల్స్‌ను, సంబంధిత తయారీ వస్తువులను ఎప్పటికపుడు సంబంధిత అధికారుల పర్యవేక్షణ చేయించుకుంటూ అప్రమత్తంగా వ్యవహరిస్తుంటారు. కానీ దురాశతో సూర్యనారాయణరెడ్డి లాంటి వారు ఇలాంటి చర్యలకు పాల్పడుతూ పట్టుబడుతుంటారు.
              
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement