
నీటిలో తేలియాడుతున్న చిన్నా మృతదేహం
హయత్‌నగర్: మద్యం మత్తులో ఈత కొట్టేందుకు బావిలోకి దిగిన ఓ యువకుడు నీటిలో మునిగి మృతి చెందాడు. శనివారం హయత్‌నగర్ ఠాణా పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సీఐ నరేందర్‌గౌడ్ కథనం ప్రకారం.... మౌలాలికి చెందిన సత్తయ్య కొడుకు చిన్నా (28) కూలీ. ఇతను గతంలో తారామతిపేటలో ఖుర్షిద్ అనే వ్యక్తి వ్యవసాయ బావి వద్ద పనిచేశాడు.
ఈ క్రమంలో కుషాయిగూడకు చెందిన తోటి స్నేహితులు వెంకటేశ్, జాఫర్‌లతో కలిసి చిన్నా ఆ బావి వద్దకు శుక్రవారం వచ్చాడు. అంతా కలిసి మద్యం తాగారు. అనంతరం ఈత కొడతానని బావిలోకి దిగిన చిన్నా..ఎంతకూ పైకి రాకపోవడంతో ఆందోళన చెందిన స్నేహితులు అక్కడి నుంచి పారిపోయారు. శనివారం ఉదయం బావిలో మృతదేహం తేలియాడుతుండగా చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
మృతదేహాన్ని నీటిలో నుంచి బయటకు తీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతుడి స్నేహితులను పిలిపించి విచారించారు. కాగా చిన్నా ఈతకు వెళ్లి మృతి చెందాడా? లేక స్నేహితుల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.