బ్రాండెండ్ మద్యం మూతలు
కాగజ్‌నగర్‌లో కల్తీమద్యం గుట్టు రట్టయింది. మంగళవారం ఎక్సైజ్ అధికారులు దాడి చేసి కల్తీ మద్యం, బ్రాండెడ్ మద్యం కంపెనీల నకిలీ మూతలు స్వాధీనం చేసుకున్నారు.
కాగజ్‌నగర్ : కాగజ్‌నగర్‌లో కల్తీమద్యం గుట్టు రట్టయింది. మంగళవారం ఎక్సైజ్ అధికారులు దాడి చేసి కల్తీ మద్యం, బ్రాండెడ్ మద్యం కంపెనీల నకిలీ మూతలు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక రైల్వేస్టేషన్ వెనుకభాగం కాపువాడలోని ఓ ఇంట్లో మద్యం కల్తీ చేస్తున్నారని టీఆర్‌ఎస్ నాయకులు కొందరు ఎక్సైజ్ సీఐ, అధికారులకు సమాచారం అందించారు.
వారు ఆ ఇంటి వద్దకు చేరుకుని తాళం పగులగొట్టి లోపలికి వెళ్లారు. వేల సంఖ్యలో బ్రాండెడ్ మద్యం కంపెనీల నకిలీ మూతలు, కల్తీ మద్యం లభ్యమయ్యాయి. 676 కల్తీ ఐబీ మద్యం బాటిళ్లు, 28 ఓసీ మద్యం బాటిళ్లు, 10,500 ఐబీ మూతలు(సీళ్లు), 1500 రాయల్‌స్టాగ్ మూతలు, 500 ఎంసీ మూతలు లభించాయి. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో మద్యనిషేధం అమల్లో ఉండడంతో ఇక్కడి నుంచి కల్తీ మద్యం రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్సైజ్ సీఐ మంగమ్మ మాట్లాడుతూ కల్తీ మద్యం స్వాధీనం చేసుకుని గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇంటి యజమాని ఆధారంగా వ్యాపారం చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. దాడిలో ఎక్సైజ్ ఎస్సైలు ముత్యం, కె.శ్రీధర్, మిర్జా అహ్మద్ బేగ్, సిబ్బంది భగవంత్‌రావు, చంద్రశేఖర్, శ్యాంరావు తదితరులు పాల్గొన్నారు.