అక్రమ రిజిస్ట్రేషన్లు
Published Fri, Aug 9 2013 1:16 AM | Last Updated on Fri, Sep 1 2017 9:44 PM
గన్నవరం రూరల్, న్యూస్‌లైన్ : గన్నవరం సబ్ రిజిస్ట్రారు కార్యాలయ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి నకిలీ దస్తావేజులను పట్టుకున్నారు. ఇరవై నాలుగు గంటలు ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బుధవారం సబ్‌రిజస్ట్రారు కార్యాలయానికి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ కోసం రెండు పార్టీల వారు వచ్చారు. భూమిని తనఖా పెట్టి రూ.10 లక్షల నగదు తీసుకునేందుకు దస్తావేజుల ఒరిజనల్ కాపీ, సేల్ డీడ్ పత్రాలను అందజేశారు. అయితే వేలిముద్రలు, సబ్ రిజస్ట్రార్ కార్యాలయం స్టాంపు తేడాగా ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. బొటన వేలి ముద్ర పూర్తిగా లేకపోవడం, స్టాంపు సైజు చిన్నదిగా అక్షరదోషాలతో ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. ఇవి నకిలీ దస్తావేజులు
తేల్చారు. భూమి తనఖా పెట్టేందుకు వచ్చిన వ్యక్తిని సబ్ రిజిస్ట్రార్ కృష్ణప్రసాద్ నిలదీయడంతో అసలు విషయం బయటపడుతుందనే భయంతో ఆ వ్యక్తి అక్కడ నుంచి ఉడాయించారు. ఈ హఠాత్పరిమాణంతో సేల్ డీడ్ రాయించుకుని అప్పు ఇద్దామనుకున్నవారు నివ్వెరపోయారు. ఈ నకిలీ దస్తావేజులు సబ్ రిజస్ట్రార్ కృష్ణ ప్రసాద్ స్వాధీనం చేసుకుని జిల్లా రిజస్ట్రార్ శ్రీనివాసరావుకు సమాచారం అందజేశారు.
నకిలీలతో ఇప్పటికే ఆరు రిజిస్ట్రేషన్లు
నకిలీ దస్తావేజులతో ఇప్పటికే ఆరు రిజస్ట్రేషన్లు పూర్తి చేసి సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ ఎంతోకాలంగా లేఖరిగా ఉన్న వ్యక్తితోనే ఈ దస్తావేజులన్నీ రాయించినట్లు అనుమానిస్తున్నారు. దీంతో బుధవారం సాయంత్రం ఆ లేఖరిని సబ్ రిజస్ట్రార్ కృష్ణ ప్రసాద్ పిలిచి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ నకిలీ దస్తావేజుల వ్యవహారంలో ఓ ముఠానే ఉన్నట్లు భావిస్తున్నారు. విజయవాడ నగరానికి చెందిన వారే ఈ కార్యకలాపాలకు పూనుకుంటున్నారని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. గన్నవరం, పరిసర ప్రాంత రియల్ బ్రోకర్లు వీరికి సహకరిస్తున్నారని, రిజిస్ట్రేషన్ పత్రాల్లో సాక్షులుగా కూడా గన్నవరానికి చెందిన వ్యక్తులే ఉన్నారని తెలిసింది. రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు ఇతర పత్రాలన్నీ నకిలీవి సృష్టిస్తున్నారని, ఇవన్నీ విజయవాడ, మచిలీపట్నం చిరునామాల తో ఉంటున్నాయని తెలిసింది. ఈ ఆరు రిజిస్ట్రేషన్లలో రూ.కోటి వరకు చేతులు మారినట్లు రిజిస్ట్రేషన్ కార్యాలయ వర్గాలు పేర్కొంటున్నాయి.
సిబ్బంది పాత్రపైనా అనుమానాలు ?
ఈ నకిలీ దస్తావేజుల తయారీలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం సిబ్బంది పాత్రపై కూడా ఉండి ఉండవచ్చనే అనుమానాలు ప్రచారంలోకి వచ్చాయి. గతంలోని కొనుగోలు దారుల (భూమి యజమానులు) ఫొటోలు మార్చి వేరే వ్యక్తులు అంటించి ఈ నకిలీ వ్యవహారం నడిపినట్లు తెలుస్తోంది. సీడీ రూపంలో ఈ నకళ్లను సిబ్బందే కార్యాలయం దాటిస్తున్నారని తెలుస్తోంది. ఇందుకు వారికి భారీగా ప్రతిఫలం అందుతోందని, అదే విధంగా దస్తావేజులు రాస్తున్న వారికి పెద్ద మొత్తంలో ముడుతుందని చెబుతున్నారు.
గన్నవరం- ఏలూరు రహదారిపై ఉన్న వెంచర్‌లోని ప్లాట్లకు ఈ నకిలీ దస్తావేజులు సృష్టించి అమ్మకాలు, సేల్ డీడ్‌లు చేస్తున్నట్లు అధికారులు ధ్రువీకరిస్తున్నారు. గన్నవరం సమీపంలోని ఒకే వెంచర్‌కు చెందిన ప్లాట్లుకు ఈ దస్తావేజులు సృష్టించారని తెలుస్తోంది. ఈ మేరకు ఆ వెంచర్ యాజమాన్యానికి ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు సబ్ రిజస్ట్రార్ కార్యాలయం సిబ్బంది ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.
నకిలీ దస్తావేజులపై చేసిన రిజస్ట్రేషన్లు రద్దు చేస్తాం - జిల్లా రిజస్ట్రార్ శ్రీనివాస్
గన్నవరంలో సబ్ రిజస్ట్రార్ కార్యాలయంలో నకిలీ దస్తావేజుల ఆధారాలతో రిజస్ట్రేషన్లు జరిగినట్లు తెలిసింది. సంబంధిత ప్లాట్ల అసలు యజమానులు దరఖాస్తు చేస్తే, తర్వాత జరిగిన రిజస్ట్రేషన్లన్నీ రద్దు చేస్తాం. నకిలీ దస్తావేజులు చూసి మోసపోయి కొనుగోళ్ళు చేసిన వారు నష్టపడక తప్పదు. అప్పులు ఇచ్చినవారిదీ అదే పరిస్థితి.
రిజిస్ట్రార్‌కు నివేదిస్తాం..
ఈ నకిలీ దస్తావేజులు అసలును పోలి ఉన్నాయి. వేలిముద్రలు, స్టాంపులు పరిశీలించి నకిలీవిగా గుర్తించాం. వాటిని తీసుకువచ్చిన వ్యక్తిని ప్రశ్నిస్తే బుకాయించాడు. ఇప్పటి వరకూ ఈ తరహా మూడు రిజిస్ట్రేషన్లు జరిగినట్లు గుర్తించాం. వీటిపై విచారణ జరుపుతున్నాం. ఇప్పటిక దస్తావేజుల లేఖరికి, సాక్షులుగా ఉన్నవారికి సమాచారం ఇచ్చాం. దీనిపై విచారణ చేసి జిల్లా రిజిస్ట్రార్‌కు నివేదిక పంపుతాం.
-కృష్ణ ప్రసాద్, గన్నవ రం సబ్ రిజస్ట్రార్
Advertisement
Advertisement