అంతా మిస్టరీయే.. | Durga barani kumar suicide in east godavari district | Sakshi
Sakshi News home page

అంతా మిస్టరీయే..

Published Tue, Nov 3 2015 10:35 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

అంతా మిస్టరీయే.. - Sakshi

అంతా మిస్టరీయే..

ఏటీఎంలో నగదు లోడింగ్ చేసే ఉద్యోగి ఆత్మహత్య
 పశ్చిమ గోదావరి జిల్లా చిడిపి వద్ద గోదావరిలో మృతదేహం
 మాయమైన రూ.10 లక్షలు ఎక్కడో?
 
కాకినాడ : ఏటీఎంలలో క్యాష్ లోడ్ చేసే ప్రైవేటు సంస్థ ఉద్యోగి కాకినాడ రూరల్ మండలం తూరంగి గోపీకృష్ణాకాలనీకి చెందిన మల్లుల దుర్గా భరణికుమార్(24) గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందుకు దారితీసిన పరిస్థితులు మాత్రం మిస్టరీగా మారాయి. అతడు రూ.పది లక్షలు తీసుకుని మోటార్ బైక్‌పై పరారయ్యాడని క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీస్ ఇన్ఫో సిస్టం ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి చెరుకూరి వరప్రసాద్ వన్‌టౌన్ లా అండ్ ఆర్డర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
 
అన్నయ్యకు ఈ-మెయిల్
శనివారం సాయంత్రమే భరణికుమార్ తన మెయిల్ ఐడీ నుంచి తన అన్నయ్య ప్రసాద్ ఓ మెయిల్‌కు పంపాడు. ‘అన్నయ్యా, నేను సూసైడ్ చేసుకుంటున్నా. నాకు ఏటీఎంలో రూ.60 వేల షార్టేజ్ ఉంది. ఏం చేయాలో తెలియలేదు. అమ్మను బాగా చూసుకో. అమ్మా నేను డాడీ దగ్గరికి వెళ్తున్నా. ఐ యామ్ సారీ’ అని అతడు పంపిన మెయిల్‌ను బట్టి అతడు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని తెలుస్తోంది.
 
రూ.పది లక్షలు ఏమయ్యాయి?
అతడు రూ.పది లక్షలతో పరారయ్యాడని సంస్థ ప్రతినిధులు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేశారనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. రూ.పది లక్షలతో అతడు పరారై ఉంటే.. అతడికి ఆత్మహత్య చేసుకునే ఆలోచనే రాదని, ఇది సంస్థ వారు ఉద్దేశపూర్వకంగా భరణికుమార్‌పై నింద మోపేందుకు ప్రయత్నిస్తున్నారని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శనివారం సాయంత్రమే భరణికుమార్ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
 
 గోదావరిలో తేలిన మృతదేహం
 పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు రూరల్ మండలంలోని చిడిపి సమీపంలో గోదావరి నదిలో భరణికుమార్ మృతదేహాన్ని సోమవారం స్థానికులు గుర్తించారు. వీఆర్‌ఓ శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు పోలీసులు గుడ్డిపుంత రేవులో మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహం లభించిన సమీప ప్రాంతంలో నిలిపి ఉన్న  మోటార్ బైక్ అతడిదేనని ఎస్సై ఎం.శ్యాంసుందరరావు చెప్పారు. మూడు రోజులుగా ఆ బైక్ అక్కడ ఉందని స్థానికులు చెబుతున్నారు. మృతదేహాన్ని కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాకినాడ వన్‌టౌన్ పోలీసులు భరణికుమార్ కుటుంబ సభ్యులను చిడిపికి తీసుకువెళ్లారు. దుస్తులను బట్టి అది భరణికుమార్ మృతదేహంగా కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.
 
 ఆ యువతి ఎవరు?
కాకినాడకు చెందిన ఓ యువతి రాజమండ్రి గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిందంటూ కాకినాడలో ప్రచారం జరిగింది. భరణి కుమార్‌కు, ఆ యువతికి ఏమైనా సంబంధం ఉందా? అనేది చర్చనీయాంశమైంది. ఆ యువతి వివరాలు మాత్రం తెలియరాలేదు. భరణికుమార్ సంఘటనకు, ఆ యువతి సంఘటనకు ఎటువంటి సంబంధం లేదని బంధువులు, పోలీసులు చెబుతున్నారు. మొత్తం మీద భరణి కుమార్ ఆత్మహత్య, రూ.పది లక్షలు ఏమయ్యాయనే అంశాలు మిస్టరీగా మారాయి. పోలీసులను తప్పుదారి పట్టించేందుకు భరణికుమార్‌పై తప్పుడు ఫిర్యాదు చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement