- డ్వాక్రా రుణాలపై 2 శాతం కమీషన్ గుంజుతున్న సీవోలు, ఆర్పీలు
- ప్రతి నెలా రూ.లక్షల్లో వసూళ్లు
- ఫిర్యాదు చేస్తే ఇబ్బందులని మిన్నకుండిపోతున్న సభ్యులు
- సీవోలను ఆడిస్తున్న కార్పొరేటర్లు
వసూల్‌రాజాలు!
Published Sun, Sep 25 2016 11:31 PM | Last Updated on Tue, Mar 19 2019 6:59 PM
సాక్షి, రాజమహేంద్రవరం :
డ్వాక్రా సంఘాలకు రుణాల మంజూరులో వసూల్‌రాజాలు చెలరేగుతున్నారు. కొంతమంది కమ్యూనిటీ ఆర్గనైజర్లు(సీవో), కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు (సీఆర్పీ) రెండు శాతం చొప్పున వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. వారు చెప్పినంత కమీషన్ ఇవ్వకపోతే రుణాలు ఎక్కడ ఆగిపోతాయోనన్న భయంతో డ్వాక్రా సంఘాల మహిళలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి వెనుకాడుతున్నారు. వసూల్‌రాజాలు డిమాండ్ చేసినంతా ముట్టజెప్పుకొంటున్నారు. ఈవిధంగా ఒక్క రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోనే ప్రతి నెలా రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. ‘రుణం మంజూరైన ప్రతిసారీ మామూళ్లు ఇవ్వాల్సిందే. లేదంటే రుణాలు ఇంకా మంజూరు కాలేదని నెలల తరబడి తిప్పుతున్నారు. ఇదంతా మాకు మామూలే’ అని ఓ డ్వాక్రా సంఘ సభ్యురాలు వాపోయింది.
వారు చెప్పిందే వేదం
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో 5,536 డ్వాక్రా సంఘాలున్నాయి. వీటికి రుణాల మంజూరు, పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఓ విభాగం ఏర్పాటు చేశారు. అవుట్ సోర్సింగ్ విధానంలో నియమించిన టౌన్ ప్రాజెక్టు ఆఫీసర్ (టీపీఆర్‌వో) ఈ ప్రక్రియనంతా పర్యవేక్షిస్తుంటారు. ఆయనకు సహాయంగా 10 మంది కమ్యూనిటీ ఆర్గనైజర్లు ఉన్నారు. వీరంతా అవుట్‌సోర్సింగ్ విధానంలో విధులు నిర్వర్తిస్తున్నారు. నగరంలో ఉన్న 50 డివిజన్లను ఈ పదిమందికీ కేటాయించారు. 15 నుంచి 25 గ్రూపులను కలిపి ఓ సమాఖ్యగా ఏర్పాటు చేశారు. ఇలా నగరంలో 165 సమాఖ్యలున్నాయి. ప్రతి సమాఖ్యకు ఓ రిసోర్స్ పర్సన్‌ను టీపీఆర్‌వో నియమించారు. వీరు సీవోలకు సహాయకులుగా చలామణీ అవుతూంటారు. ఆ సమాఖ్యపై పెత్తనం అంతా వారిదే. వారి ద్వారా కొంతమంది సీవోలు కమీషన్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి గ్రూపునకు మంజూరు చేసే రుణంలో రూ.లక్షకు రూ.2 వేల చొప్పున గుంజుతున్నారు. గత ఏడాది నగర పరిధిలోని డ్వాక్రా గ్రూపులకు వివిధ బ్యాంకులు రూ.36 కోట్ల రుణాలు మంజూరు చేశాయి. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.56 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే రూ.15 కోట్ల రుణాలు మంజూరయ్యాయి. బ్యాంకు అధికారులు కూడా సీవోలు చెప్పనిదే రుణాలు మంజూరు చేయడం లేదు. దీంతో సీవోలు చెప్పిందే వేదంగా డ్వాక్రా సంఘాల సభ్యులు నడుచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
డివిజన్ కోసం నేతలకు ముడుపులు
పేద, మధ్య తరగతి ప్రజలు నివసించే డివిజన్లలో అధిక సంఖ్యలో డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. ఈ డివిజన్లలో పని చేయడానికి పలువురు సీవోలు అమితాసక్తి చూపుతున్నారు. ఇదే అవకాశంగా కొందరు కార్పొరేటర్లు తమ డివిజన్లలోని సీవోలు సరిగా పని చేయడం లేదని మేయర్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. ఇక్కడే కథ మొదలవుతోంది. సీవోలు ఆయా కార్పొరేటర్ల వద్దకు వెళ్లి బేరసారాలు సాగిస్తారు. తమను ఆయా డివిజన్లలో ఉంచేందుకు అక్కడ ఉన్న ఆదాయాన్నిబట్టి ముడుపులు ముట్టజెబుతున్నారు. సీఆర్పీలుగా ఆయా గ్రూపుల్లోని సభ్యులనే నియమిస్తారు. వీరిలో కొంతమంది అధికార పార్టీ నేతల బంధువులు, కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అధికార బలం ఉన్నవారు ఆయా సమాఖ్యల్లో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. కొన్ని డ్వాక్రా గ్రూపుల అధ్యక్షులు, కార్యదర్శులతో కుమ్మక్కై గ్రూపులోని సభ్యులకు తెలియకుండా రుణాలు పంచుకుంటున్నారు. వాయిదాలు సరిగా కట్టనప్పుడే ఈ విషయం ఆయా గ్రూపు సభ్యులకు తెలుస్తూండడం గమనార్హం. ఆగిపోయిన కొన్ని గ్రూపుల అధ్యక్షులు, కార్యదర్శుల సంతకాలు ఫోర్జరీ చేసి రుణాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ వ్యవహారాలపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని డ్వాక్రా సంఘాల సభ్యులు కోరుతున్నారు.
దందా సాగుతోందిలా..
డ్వాక్రా రుణాల మంజూరు, పర్యవేక్షణకు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో ప్రత్యేకంగా ఓ విభాగం ఉంది. ఇందులో అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో 10 మంది కమ్యూనిటీ ఆర్గనైజర్లు ఉన్నారు. నగరంలోని 50 డివిజన్లను ఈ పదిమందికీ కేటాయించారు. 15 నుంచి 25 గ్రూపులను కలిపి ఓ సమాఖ్యగా ఏర్పాటు చేశారు. ఇలా నగరంలో 165 సమాఖ్యలున్నాయి. ప్రతి సమాఖ్యకు ఓ రిసోర్స్ పర్సన్‌ను నియమించారు. సీవోలకు సహాయకులుగా చలామణీ అయ్యే వీరి ద్వారా కొంతమంది సీవోలు కమీషన్లు వసూలు చేస్తున్నారు. ప్రతి గ్రూపునకు మంజూరు చేసే రుణంలో రూ.లక్షకు రూ.2 వేల చొప్పున గుంజుతున్నారు.
Advertisement
Advertisement